Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలీసులకు ‘‘సుప్రీం’’ మొట్టికాయలు

ప్రభుత్వ అధికారుల, పోలీసుల నడవడికపై న్యాయ వ్యవస్థ ఇటీవలికాలంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తోంది. ప్రభుత్వాధికారులు, పోలీసులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అడుగులకు మడుగులొత్తడానికి అలవాటు పడ్డాయని కూడా విమర్శించింది. అధికారంలో ఉన్న పక్షానికి వత్తాసు పలికితే ఆ తరవాత మరో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోలీసు అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించవలసి వస్తుందని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. వి. రమణ హెచ్చరించారు. ధన్‌ బాద్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తం ఆనంద్‌ మృతి కేసును విచారిస్తున్న సందర్భంలోనైతే సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణే పోలీసులు, సీబీఐ న్యాయస్థానాల ఆదేశాలను ఖాతరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశాధికారవర్గం, పోలీసులు చేసే ఆగడాలపై సామాన్యుల నుంచి అందే ఫిర్యాదులపై దర్యాప్తు చేయడానికి వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా తనకు ఉందని ప్రధాన న్యాయమూర్తి రమణ అన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ పని చేయడం లేదన్నారు. పోలీసు అధికారులే తీవ్రమైన నేరాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌ పూర్‌ లో ఒక హోటల్‌ మీద పోలీసులు దాడి చేసినప్పుడు ఒక వ్యాపారి ప్రాణాలే పోయాయి. తమిళనాడులో పి. జయరాజ్‌, ఆయన కుమారుడు జె. బెనిక్స్‌ పోలీసు నిర్బంధంలో ఉండగానే మరణించారు. ఈ సందర్భంలో సీబీఐ తొమ్మిది మంది పోలీసులపై చార్జిషీట్లు దాఖలు చేసింది. కస్టడీ మరణాలు కొత్తేమీ కాదు. అన్ని రాష్ట్రాలలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అకృత్యాలు, అఘాయిత్యాలు, దాడులు జరిగినప్పుడు పౌరులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉన్న పోలీసులే తమ నిర్బంధంలో ఉన్న వారి ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు కొల్లలు. లాక్‌ డౌన్‌ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై, కొనసాగించిన అమానుష చర్యలపై అనేక వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఒక్క సందర్భంలోనూ తప్పు చేసిన వారిపై చర్య తీసుకోలేదు కనక పోలీసుల అతి ప్రవర్తనకు అడ్డుకట్ట లేకుండా పోయింది. పోలీసుల చేతిలో ఉన్న లాఠీ భయపెట్టడానికే తప్ప జనాన్ని చితక బాదడానికి కాదన్న స్పృహ ఉన్న పోలీసు అధికారి ఉదాహరణ ప్రాయంగా కూడా కనిపించడు. ఈ ధోరణి కింది స్థాయి పోలీసు జవాన్ల నుంచి మొదలుకొని కష్టపడి చదివి, ఉత్తమ శిక్షణ పొందిన ఐ.పి.ఎస్‌. అధికారుల్లో కూడా ఉంది. పోలీసులున్నది భద్రత కల్పించడానికి కాదనీ వారికున్న అధికారాన్ని వివిధ రీతుల్లో దుర్వినియోగం చేయడానికేనన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే తమకు అన్యాయం జరిగినప్పుడు కూడా పోలీసు స్టేషన్‌ మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి కూడా ఇష్టపడని వారే ఎక్కువగా ఉంటారు. ఛత్తీస్‌ గఢ్‌ లో గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ అనే పోలీసు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పై దేశద్రోహ ఆరోపణతో పాటు, అవినీతి, బలవంతంగా డబ్బు లాగడం లాంటి కేసులున్నాయి. ఆయన తనను అరెస్టు చేయకుండా నిరోధించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఛత్తీస్‌ గఢ్‌ లో ప్రభుత్వం మారిపోయిన తరవాత మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు డా. రమణ్‌ సింగ్‌ పై ప్రభుత్వ పంపిణీ విధానంలో అక్రమాలు జరిగాయన్న కేసులు మోపాలని రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చిందట. ఆయన అందుకు నిరాకరించడంతో ఆయన మీద కేసులు మోపారట. కేసులు మోపడంలో కొత్త ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించి ఉండవచ్చు. కానీ ఫలానా పోలీసుఅధికారి ముక్కు సూటిగా వ్యవహరిస్తారు అని చెప్పగలిగే అవకాశం చాలా చాలా తక్కువ. ప్రభుత్వాలు మారగానే పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసి తమకు సన్నిహితులు, అనువుగా ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించే సంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐ.పి.ఎస్‌. అధికారులు నడుచుకోవలసిన పద్ధతుల్లో నడుచుకోనప్పుడు రాజకీయ వాతావరణం మారితే ఇబ్బంది పడక తప్పదు. తమ మౌలిక బాధ్యత పౌరుల రక్షణ అన్న స్పృహ ఉన్న పోలీసులను దుర్భిణీ వేసి వెతికి పట్టుకోవలసిందే. గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ పై దేశద్రోహ ఆరోపణ మోపిన సందర్భంలో ఛత్తీస్‌ గఢ్‌ హైకోర్టు ఆయనకు ఊరట కలిగించింది. కానీ మిగతా రెండు కేసుల్లో ఊరట ఇవ్వనందువల్ల ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంలో సుప్రీంకోర్టు బూటకపు ఎన్‌ కౌంటర్ల గురించి ప్రస్తావించక పోయినా పోలీసు స్టేషన్ల లోనే మానవ హక్కులకు భంగం కలుగుతోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడంలో బూటకపు ఎన్‌ కౌంటర్లు కూడా మదిలో ఉండే ఉంటాయి. బూటకపు ఎన్‌ కౌంటర్లు వ్యవస్థలో భాగం అయిపోయాయి. ఈ ఎన్‌ కౌంటర్లు ప్రధానంగా రెండు సందర్భాలలో జరుగుతున్నాయి. మొదటిది: తీవ్రవాదాన్ని, విద్రోహ కార్యకలాపాలను అణచడం. ఇందులో నక్సలైట్లను ఎన్‌ కౌంటర్లలో మట్టుబెట్టడం కూడా ఉంది. నక్సలైట్ల ఎన్‌ కౌంటర్లు అర్థ శతాబ్దం నుంచి నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. ఎన్‌ కౌంటర్లు జరిగినప్పుడు పోలీసుల మీద హత్యా నేరం మోపి విచారించాలని అనేక కమిషన్లు చెప్పినా పట్టించుకున్న వారే లేరు. పంజాబ్‌, మణిపూర్‌ లో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తినప్పుడు జరిగిన ఎన్‌ కౌంటర్లకు లెక్కే లేదు. పంజాబ్‌ లో తీవ్రవాదాన్ని అదుపు చేయగలిగామని మురిసిపోతున్నాం. కానీ అక్కడ తమ వారిని ఎన్‌ కౌంటర్లలో కోల్పోయిన అనేక కుటుంబాల వారు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మణిపూర్‌ లోనూ అదే పరిస్థితి. అనేక వందల మందిని ఎన్‌ కౌంటర్లలో మట్టుబెట్టామని మణిపూర్‌ పోలీసులు గొప్పలు చెప్పుకున్నారు. అక్కడ కనీసం 2000 బూటకపు ఎన్‌ కౌంటర్లు జరిగాయని అంచనా. కాంధహార్‌ కు భారత విమానాన్ని దారి మళ్లించడం, 2001లో అమెరికాలో జంట హార్మ్యాల కూల్చివేత తరవాత తీవ్రవాదాన్ని అణచి వేసే పేర ఎన్‌ కౌంటర్లు విచ్చల విడిగా సాగుతున్నాయి. రెండవది: నేరస్థులన్న అనుమానం ఉన్న వారిని ఎన్‌ కౌంటర్ల పేర కడతేర్చడం. దర్యాప్తు చేయడంలో పోలీసుల అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి, న్యాయస్థానాల్లో నేరస్థులని నిరూపించడానికి కావలసినంత సమాచారం సేకరించడంలో అసమర్థత దీనికి ప్రధాన కారణం. శాంతిభద్రతలను పరిరక్షించే పేరిట ప్రభుత్వాలు కూడా బూటకపు ఎన్‌ కౌంటర్లను ఒక విధానంగా అమలు చేస్తాయి. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ హయాంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు మిషతో జరిగిన ఎన్‌ కౌంటర్లకు లెక్కే లేదు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్‌ కౌంటర్లు చరిత్ర గర్భంలో కలిసి పోయాయి. ప్రభుత్వం వేరు, రాజ్య వ్యవస్థ వేరు అన్న స్పృహ మన సమాజంలోనే చాలా తక్కువ. అకృత్యాలకు పాల్పడిన పోలీసులకు, ప్రభుత్వాధికారులకు సైతం శిక్ష తప్పదన్న భరోసా కలిగితే తప్ప సుప్రీంకోర్టు ఆగ్రహంవల్ల ఒరిగేది ఏమీ ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img