Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

పార్లమెంటులో నిషిద్ధ పదాలు

పార్లమెంటులో ఉపయోగించకూడని పదాల జాబితాతో కూడిన పదకోశాన్ని లోకసభ అధికారులు విడుదల చేశారు. అయితే ఏ పదాలనూ తాము నిషేధించలేదని, ఇంతకు ముందు నుంచే సభ్యులు వాడిన పదాలు మర్యాదకరం కావు అనుకున్న పదాల జాబితాను క్రోడీకరించి ఒక పదకోశాన్ని విడుదల చేశామని లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా వివరణ ఇచ్చుకున్నారు. అవినీతి, దుష్పరి పాలన లాంటి పదాలూ నిషేధిత జాబితాలో చేర్చేశారు. అంటే ఈ అంశాలను ప్రస్తావించకూడదనేగా! సందర్భాన్ని బట్టి ఆ పదాలు మర్యాదకరమైనవా కాదా అని నిర్ధారిస్తామని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. నిషిద్ధ పదాల వినియోగంపై ఉభయ సభలు దాదాపు ఒకే పద్ధ తిని అనుసరించే అవకాశమే ఎక్కువ. ఈ పదాల జాబితా పరిశీలిస్తే ప్రభు త్వాలు, ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలను విమ ర్శించడానికి కొన్ని పదాల వినియోగంపై నిషేధం విధించినట్టు స్పష్టం అవుతోంది. రక్తపాతం, మోసం, దుర్వినియోగం, చెంచా, చెంచాగిరి, చేలా, పిల్లచేష్టలు, అవినీతిపరులు, పిరికిపందలు, నేరస్థులు, మొసలి కన్నీరు, నాటకం, కంటి తుడుపు, గూండా, గూండాగిరి, అసమర్థుడు, పెడదోవ పట్టించడం, ఊసరవెల్లి, అవమానం, అసత్యం, అహంకారం, చీకటి రోజులు, దలాల్‌, దాదాగిరి, బాబ్‌ కట్‌, లాలీపాప్‌, విశ్వాసఘాతుకం, మూర్ఖం, నిరంకుశ మొదలైన మాటలు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. ఈ పదాలన్నింటినీ యు.పి.ఎ. అధికారంలో ఉన్నప్పుడు కూడా సభా మర్యాదకు భంగం కలిగించేవి అని రికార్డుల నుంచి తొలగించిన సంద ర్భాలున్నాయని ఓం బిర్లా సర్ది చెప్తున్నారు. ఈ పదాలేవీ వాడకుండా యు.పి.ఎ. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2జి కుంభకోణం లాంటి వాటిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికార పక్షం ఏ పదజాలాన్ని వాడి ఎండగట్టి ఉంటుంది? ఇది పరిశోధనకు అనువైన విషయమే. 2జి కుంభకోణం రగడ తీవ్రంగా కొనసాగుతున్న దశలో అప్పటి ప్రతిపక్ష నాయ కురాలు సుష్మా స్వరాజ్‌, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌ జైట్లీ సభను జరగనివ్వం అని సమావేశాలు ప్రారంభించక ముందే ప్రకటించడం ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చిన పదజాలాన్ని వినియోగించడం కన్నా తక్కువ ప్రతికూలాంశం అనడం సాధ్యమయ్యే పనేనా? పార్లమెంటులో జరిగే చర్చలు హుందాతనం కోల్పోయి దశాబ్దాలు అవుతోంది. సభ్యులు వాడే పదజాలంలోని వాడి కన్నా అనేక రెట్లు అవమానకరమైన రీతిలో ప్రవర్తించిన సందర్భాలు ఎన్ని లేవు గనక? బల్లలు చరచడం, మైకులు విరవడం, బల్లల మీదకెక్కడం సర్వ సాధారణమైపోయింది. బిల్లులను ఆమో దిస్తున్న తీరు నానాటికీ దిగజారిపోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్ట డానికి బిల్లు ఆమోదించినప్పుడు అసలు చర్చే జరగకుండా పార్లమెంటు తలుపులు మూసేసి ఆమోదించామనిపించిన ఉదంతాన్ని, దానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికార పక్షం సహకరించిన తీరును మరిచి పోవడం సాధ్యమేనా? లగడపాటి రాజ్‌గోపాల్‌ లాంటి వారు సభలో పెప్పర్‌ స్ప్రే చిమ్మి స్పీకర్‌తో సహా అందరినీ అతలాకుతలం చేసిన విధానం కన్నా మాటల సందర్భంలో కటువైన పదజాలం వినియోగించడం తప్పనుకోవడం సాధ్యమవుతుందా? అసలు సభా కార్యక్రమాలు ఏ మాత్రం జరగకుండానే సమావేశాలు ముగిసిన సందర్భాలు ఎన్ని లేవు గనక! మన పార్లమెంటరీ వ్యవస్థకు మూలకందంలాంటి పార్లమెంటును హుందాగా నిర్వహించాలన్న ధ్యాస వదిలేసి దశాబ్దాలు గడిచాయి. పార్లమెంటులో ఘాటైన చర్చలు జర గడం గతంలోనూ ఉంది. చర్చల్లో ఘాటు కన్నా సభ్యుల ప్రవర్తన అను చితంగా ఉండడం మితిమీరిపోతోంది. ప్రతిపక్షాల వాదనను అంగీకరించక పోయినా కనీసం వినే ఓపిక కూడా మోదీ హయాంలో కనిపించడం లేదుగా! మోదీలాగా పార్లమెంట్‌ సమావేశాలను నిర్లక్ష్యం చేసి అతి తక్కువ కాలం మాత్రమే సభకు హాజరయ్యే ప్రధానమంత్రి మరొకరున్నారని చెప్పడం అసత్యమే అవుతుంది. ఈ అసత్యం అన్న మాట కూడా ఇప్పుడు వినియోగించకూడదట. అవినీతి అన్న మాట వాడకుండా అధికార పక్షమే కాదు మరే అవినీతినైనా ఎండగట్టే అవకాశం ప్రజా ప్రతినిధులు కొలువు దీరే సభకు ఉండకపోతే ఇక అవినీతినంతటినీ చాపకింద తోసేయాల్సిం దేనా? పార్లమెంటును హుందాగా నిర్వహించాలన్న అంశాన్ని ఎవరూ కాద నరు. విమర్శలకు తావిస్తూనే సభా మర్యాదకు భంగం కలగకుండా మాట్లాడకూడదన్నది ఎవరి అభిమతమూ కావడానికి వీలు లేదు. ఓం బిర్లా క్రోడీకరించిన నిషేధిత పదాల జాబితా పరిశీలిస్తే మోదీ సర్కారు ఎదు ర్కుంటున్న ఇరకాట పరిస్థితిని అధిగమించడానికే ఈ జాబితా తయారు చేశారని అర్థం అవుతోంది. నెల్లీ మారణకాండ, దిల్లీలో సిక్కుల ఊచకోత, గుజరాత్‌ మారణ కాండ జరిగిన నేపథ్యంలో పార్లమెంటులో జరిగిన చర్చల్లో రక్తపాతం అన్న మాట వాడకుండానే చర్చ జరిగిందని నిరూ పించడం వీలయ్యే పనేనా? ఎవరు అధికార పక్షంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు అన్నది నిషేధిత పదకోశం తయారు చేయడానికి కారణం కాకూడదు.
పార్లమెంటులో సభ్యుల ప్రసంగాలు పరిస్థితినిబట్టి, ఆ పరిస్థితులు సృష్టించే భావోద్వేగాలను బట్టి ఉంటాయి. ప్రభుత్వం అనుసరించే విధానాలను, దుర్వర్తనను నిలదీయడానికి చట్టసభలే వేదిక అన్నది ప్రజాస్వామ్య దేశాలన్నీ అంగీకరించే సూత్రమే. కాంగ్రెస్‌ సుదీర్ఘ కాలం రాజ్యమేలినప్పుడు ఉత్తమ పార్లమెంటేరియన్లుగా పేరు తెచ్చుకున్న వారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన వారే. ఉత్తమ పార్లమెంటేరియన్లకు అవార్డు ఇవ్వాలి అన్న సంప్రాదాయం ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఆ అవార్డు దక్కింది సీపీఐ నాయకుడు ఇంద్రజిత్‌ గుప్తాకే. ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన సందర్భాలు, ఘాటైన పదజాలం వాడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏనాడూ సభా మర్యాదకు భంగం కలిగించలేదు. ఈ పని చేసిన వారిలో ఆయనొక్కరే లేరు. అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కృష్ణ అడ్వానీ, అశోక్‌ మెహతా, బల్‌ రాజ్‌ మధోక్‌, పీలూ మోదీ, హిరేన్‌ ముఖర్జీ, భూపేశ్‌ గుప్తా లాంటి ఉద్దండుల పేర్లు ఎన్నైనా ప్రస్తావించవచ్చు. కానీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సౌధానికి రాళ్లెత్తిన తొలి ప్రధాని విమర్శలు ఎదుర్కోకుండా పారిపోయిన సందర్భం ఒక్కటి కూడా లేదు. పైగా హిరేన్‌ ముఖర్జీ, భూపేశ్‌ గుప్తా లాంటి వారు మాట్లాడుతున్నారంటే ఆయన పార్లమెంటు ఆవరణలో ఎక్కడున్నా సభలోకి పరుగెత్తుకొచ్చేవారు. ఆవేశం లోనో, ఉద్వేగానికి గురైనప్పుడో మర్యాద తప్పానని అనుకున్నప్పుడు నెహ్రూ వెంటనే క్షమాపణ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు బాంబే హైలో చమురు, గ్యాస్‌ దొరికాయి అని పార్లమెంటు సిబ్బంది చిన్న చీటీ మీద రాసి నెహ్రూకు సమాచారం ఇస్తే ఆ ఉద్వేగంలో స్పీకర్‌ అనుమతి తీసుకోకుండా ఆ విషయం సభలో ప్రకటించేశారు. ఆ తరవాత నాలుక కరుచుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. పీలూ మోదీ ఒకసారి వెనక్కు తిరిగి మరో సభ్యుడితో మాట్లాడుతుంటే ఒక సభ్యుడు ‘‘అధ్యక్షా! ఆయన సభకు వీపు చూపుతున్నారు’’ అని ఫిర్యాదు చేశారు. హాస్యస్ఫోరకత పాళ్లు కాస్త ఎక్కువగానే ఉన్న పీలూ మోదీ నేను సభకు వెన్ను చూపడం లాంటి దేమీ లేదు నేను గుండ్రంగా ఉన్నాను’’ అని తన స్థూలకాయం గురించి తానే సరదగా హాస్యోక్తి విసిరారు. అటల్‌ బిహారీ వాజపేయి ఒక్క ఓటు తేడాతో అధికారంలోంచి దిగిపోయినప్పుటి ప్రసంగం చరిత్రాత్మక మైంది. ప్రస్తుత అధికార పక్ష నాయకులు అప్పటి వాజపేయి ప్రసంగాన్ని ఒకసారి వినే ఓపిక చేసుకుంటే ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలు ఎలా ఉంటాయో అర్థం అవుతుంది. పార్లమెంటులో ప్రతిపక్షాల వాదనను విని పించుకోకుండా బుల్డోజ్‌ చేసే స్థితిలో పదజాలం నిషేధమే ప్రధానం అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img