Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతిపక్షాల ఐక్యతకు అడ్డు తగిలే
ప్రాంతీయ ప్రయోజనాలు

ప్రతిపక్షాల ఐక్యత గురించి ఏ చిన్న కదలిక కనిపించినా అది విస్తృతంగా చర్చనీయాంశం అవుతోంది. చివరకు ఒక్క అడుగైనా ముందుకు పడడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కె.సి.ఆర్‌.) వెళ్లి నితీశ్‌ కుమార్‌ నో, కేజ్రీవాల్‌ నో, మమతా బెనర్జీనో కలుసుకుంటే మరో నాయకుడెవరైనా బీజేపీయేతర నాయకులను కలుసుకుంటే ప్రతిపక్షాల ఐక్యత గురించి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సమాజ్‌వాదీ అగ్ర నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ శుక్రవారం కోల్‌కతాలో బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీని కలుసుకోవడం ఈ ఆశలకు ప్రాణం పోశాయి. తమ తమ రాష్ట్రాలలో చాలా బలంగా ఉన్న పార్టీలు అనేకం ఉన్నాయి. మమత, కె.సి.ఆర్‌., నితీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి వారైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరందరూ ఐక్యం కావడానికి మోదీ నాయకత్వంలోని బీజేపీపై గూడు కట్టుకున్న వ్యతిరేకత ఎంత కారణమో వారి మధ్య అనైక్యతకూ మరో బలమైన కారణం ఉంది. అదే కాంగ్రెస్‌ వ్యతిరేకత. మోదీని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓడిరచాలన్న సంకల్పం ఎంతబలంగాఉన్నా అది విస్తృత స్థాయిలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదిరితే తప్ప లక్ష్యం నెరవేరదు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూజనతాదళ్‌ ఇప్పుడు బీజేపి నాయకత్వం లోని ఎన్‌.డి.ఏ.లో భాగంకాదు గానీ ఆ పార్టీకి బీజేపీమీద వల్లమాలిన ద్వేషం ఏమీలేదు. అంటే ప్రాంతీయపార్టీలలో లేదా కొన్ని రాష్ట్రాలలోనే సత్తువ చూపగలిగిన పక్షాలకు బీజేపీని ఓడిరచాలన్న కాంక్ష ఎంతబలంగా ఉన్నా కాంగ్రెస్‌తో బోలెడు పేచీలు ఉన్నాయి. ఎందుకంటే స్థానికంగా కాంగ్రెస్‌ ఈ పార్టీలన్నింటికీ ప్రథమ ప్రత్యర్థి. లోకసభఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు ఏడాది సమయంఉంది. మోదీ ఎప్పుడూ ఎన్నికలధ్యాసలోనే ఉంటారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఐక్యతా సాధనా ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాయి. భారత్‌ జోడో యాత్ర ద్వారా వ్యక్తిగతంగా రాహుల్‌ మీద మునుపు ఉన్న ప్రతికూల అభిప్రాయం మారింది. యాత్ర పొడవునా కాంగ్రెస్‌ శ్రేణులు లక్షల సంఖ్యలో కదిలారు. కానీ కాంగ్రెస్‌ పార్టీకి ఈ యాత్రవల్ల ఏ మేరకు మేలు కల్గిందో ఇప్పటికైతే తెలియదు. కాంగ్రెస్‌కు ఉన్న అవకాశం ఇతర ప్రతిపక్ష పార్టీలు వేటికీ లేదు. దేశం నలు మూలలా అంతో ఇంతో అస్తిత్వం ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే. అందుకే కాంగ్రెస్‌కు స్థానంలేని ప్రతిపక్షాల ఐక్యత వల్ల ఫలితం లేదు అని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పదేపదే చెప్తున్నారు. బిహార్‌లో నితీశ్‌కు కాంగ్రెస్‌తో సమస్యలేదు. కానీ ప్రాంతీయంగా ప్రాబల్యం ఉన్న అన్ని పార్టీలకు స్థానికంగా కాంగ్రెస్‌తో విరోధం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకోగానే ప్రతిపక్ష కూటమి ఏర్పడుతుందన్న ఆశ బలంగా కనిపిస్తోంది. సమాజ్‌వాదీపార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో లేక పోవచ్చు. కాని ఆపార్టీకి ఉత్తరప్రదేశ్‌లో మంచిపట్టే ఉంది. గత శాసన సభ ఎన్నికలలో తన పోరాట పటిమస్థాయి ఏమిటో నిరూ పించింది. అయితే అఖిలేశ్‌ కోల్‌కతాలో మమతా బెనర్జీతో సమావేశం కావడం, ప్రతిపక్ష ఐక్యతదిశగా వీరిద్దరి చర్చలు ఉపకరంగా ఉంటాయన్న అంచనా వెనక, వీరి మధ్య సఖ్యతకు ప్రధానమైన కారణం బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లో ఈ పార్టీలకు బీజేపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో కాంగ్రెస్‌ అన్నా అంతే విముఖత ఉంది. కె.సి.ఆర్‌. కొద్దిరోజుల కింద ఫెడరల్‌ఫ్రంట్‌అని ప్రతిపాదించినా, చాలారోజులకిందట మమతాబెనర్జీ భారీఎత్తున ప్రతిపక్షాలసమావేశం ఏర్పాటుచేసినా అందులో ప్రధా నాంశం బీజేపీ వ్యతిరేకతకన్నా కాంగ్రెస్‌ అంటే విముఖతే ప్రధానంగా కనిపించింది.
బీజేపీయేతర పక్షాల యత్నాల వెనక మరో విచిత్రమైన స్థితీ ఉంది. ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీల నాయకులలో చాలా మందికి ప్రధానమంత్రి పదవిపై విపరీతమైన మమకారం ఉంది. దీనికి తోడు బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య సమానదూరం పాటిస్తామని మమతా బెనర్జీతో చర్చల తరవాత అఖిలేశ్‌ ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు మహా అయితే మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంకేతాలు కావచ్చు. కానీ ప్రతిపక్షాలన్నీ ఐక్యంగాపోరాడి, బహుముఖపోటీలను నివారించలేక పోతే మోదీ నాయకత్వంలోని బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో ఓడిరచడం ససేమిరా సాధ్యం కాదు. అంతిమంగా అది బీజేపీకే ఉపకరిస్తుంది. అయితే ఇలాంటి వైఖరి ఈ పార్టీలు తమకు బలం ఉన్న రాష్ట్రాలలో తమ పట్టును మరింత పెంచుకోవడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే బీజేపీకి, కాంగ్రెస్‌కు సమాన దూరం అన్న వాదన మోదీని ఓడిరచడానికి ఉపయోగపడదు. ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్‌కు బాస్‌ అనుకోనక్కర్లేదు అని మమతకు సన్నిహితుడు సుదీప్‌ బందోపాధ్యాయ అనడంచూస్తే కాంగ్రెస్‌మీద ఉన్న వ్యతిరేకత ఎంత తీవ్రమైందో తేలిపోతుంది. గత కొద్దిరోజులుగా అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రమైనవ్యాఖ్యలే చేస్తున్నారు. వీటన్నింటినిబట్టి చూస్తే బీజేపీతో ముఖా ముఖి పోటీకి అవకాశం లేనట్టే. 2014లో, 2019లో ప్రతిపక్షాలు ఎంత బలహీనంగా ఉన్నాయో 2024లోనూ అంతే బలహీనంగా ఉండక తప్పదేమో. భారత్‌ జోడోయాత్ర రాహుల్‌ పలుకుబడిని, ఆమోద యోగ్యతను ఎంతపెంచినా అఖిలేశ్‌యాదవ్‌, మమతాబెనర్జీ లాంటి వారు తమకు దక్కవలసిన ముస్లిం ఓట్లను కాంగ్రెస్‌ నొల్లుకుపోతుందని భావిస్తారు తప్ప ప్రతి పక్ష కూటమిలో కాంగ్రెస్‌కు స్థానం ఉండడంవల్ల బీజేపీని ఓడిరచడం సులువు అవుతుందని భావించరు. భారత్‌ జోడోయాత్ర ప్రధానంగా ముస్లింఓటర్లను తమ వేపు ఆకర్షించడానికేనని అఖిలేశ్‌ భావిస్తారు. ముస్లింలజనాభా గణనీయంగా ఉన్న బెంగాల్‌ ముఖ్యమంత్రి కూడా అదే దృష్టితో ఉంటారు. చాలా రోజులు ముస్లింలు కాంగ్రెస్‌కే అండగా నిలబడ్డారు. కానీ సామాజిక న్యాయంకోసం నిలబడతామనే పార్టీలు అవతరించిన తరవాత ముస్లింలలో కొందరైనా ఆ పార్టీలను సమర్థించడం మొదలు పెట్టారు. గెలిచే అవకాశంఉన్న వారికే ఓటువేయాలి అన్న అభిప్రాయం ముస్లిం లకూ ఉంటుందిగా! భారత్‌ జోడో యాత్రవల్ల ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌ లాంటి రాష్టాలలో ఎక్కువ మంది మళ్లీ కాంగ్రెస్‌ను సమర్థిస్తే నష్టం మమత, అఖిలేశ్‌ లాంటివారికెేగా. ఒక్క బిహార్‌లో నితీశ్‌ కుమార్‌కు ఆ భయంలేదు. ముస్లింలు ఆయన పార్టీని, లాలూ పార్టీ వెంటే ఉంటారు. అక్కడ కాంగ్రెస్‌ది బలహీనమైన పాత్రే. బీజేపీది అదే పరిస్థితి. ప్రాంతీయంగా అస్తిత్వం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే పార్టీలు అంతిమంగా విస్తృతమైన ప్రతిపక్ష కూటమికి ఆటంకం కలిగిస్తాయేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img