Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

యువత సంఖ్యా బలమే సర్వస్వం కాదు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ఇటీవల వివిధ సందర్భాలలో న్యాయపీఠం మీద ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా చేస్తున్న వ్యాఖ్యలు ఆశాజనకంగా ఉంటున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తరవాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని కాపాడగల రన్న నమ్మకం క్రమంగా పెరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి కానప్పుడు ఆయన నోటి వెంట ఇలాంటి మాటలు వెలువడిన సంద ర్భాలు తక్కువే. స్వామీ వివేకానంద చికాగోలో ‘‘స్ఫూర్తి దాయక’’ మైన ప్రసంగంచేసి 128ఏళ్లుఅయిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి యువతకు మార్గదర్శకంగా ఉండే వ్యాఖ్యలు చేశారు. మతాలు, విశ్వాసాలు, కులాలతో సంబంధం లేకుండా యువత కనబరచిన ఐక్యత, త్యాగాల ఫలితంగానేÑ వారు వీధుల్లోకి వచ్చి నియంతృత్వ పోకడ లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఫలితంగానే మనకు ప్రజాస్వామ్య హక్కులు దక్కాయని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని ఖాతరుచేయని పరిస్థితి ఎదురవుతోందని హెచ్చరించారు కూడా. స్వాతంత్య్ర పోరాట కాలంలోనూ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీవిధించిన చీకటి రోజుల్లో యువత వీధుల్లోకి వచ్చి పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కులను ఖాతరు చేయకపోవడం ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందో ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో అనేక మంది యువజనులు ప్రాణాలే త్యాగం చేయవలసి వచ్చిందని, మంచి మంచి ఉద్యోగాలను స్వాతంత్య్రపోరాటంకోసం వదులుకున్నారని, ఈ త్యాగమంతా వారు సమాజం కోసం, దేశం కోసం చేసిందేనని కూడా ప్రధాన న్యాయమూర్తి రమణ గుర్తుచేశారు. యువత తమకు మాత్రమే కాకుండా తోటివారికి జరిగే అన్యాయాన్ని సహించరని స్వామీ వివేకానంద అన్న మాటలను ఆయన ఉటంకించారు. యువత నిస్వార్థంగా ఉంటారని, సాహసికులని కూడా ఆయన తెలియజేశారు. తాము నమ్మిన విశ్వాసాల కోసం యువత త్యాగాల కైనా సిద్ధపడ్తారని కూడా చెప్పారు. కలుషితం కాని, నిష్కళంకమైన యువతే దేశానికి వెన్నెముక అని కూడా ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. అయితే యువజనులు సామాజిక వాస్తవాలను, సవాళ్లను గ్రహించాలని హితబోధ కూడా చేశారు. యువతరం మీద ప్రధాన న్యాయమూర్తి రమణకు ఉన్న ఆశావహ దృక్పథం ఆంతర్యం కచ్చితంగా స్ఫూర్తిదాయకమైందే. మతం అందరి హితాన్ని కోరుతుందని, సహనశీలతను పెంపొందిస్తుందని స్వామీ వివేకానంద అన్న మాటలను ప్రధాన న్యాయమూర్తి ఉదాహరించడంలో కూడా అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. మతం మూఢనమ్మకాలకు, వితండవాదాలకు ఆలవాలం కాకూడదన్నది స్వామీ వివేకానంద బోధనల సారాంశం అయిన మాట నిజమే. ప్రస్తుత పరిస్థితుల్లో మతోన్మాదం పెచ్చరిల్లడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో యువ జనులు కూడా సమిధలు కావడం చూస్తూనే ఉన్నా. ఈ విపత్కర పరిణామా లకు యువత బాధ్యత లేదని ఖండితంగా చెప్పలేం.
ప్రపంచంలోని యువతలో అయిదోవంతు మన దేశంలోనే ఉన్నారు. యువజనులు అధికంగా ఉండడంవల్ల పని చేయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో వినియోగదార్ల సంఖ్య కూడా పెరుగుతుంది. యువజనుల సంఖ్య అధికంగా ఉన్నందువల్ల 130 కోట్ల పై చిలుకు ఉన్న భారత జనాభా సగటు వయసు 29 కావడం అత్యంత సానుకూలాంశం. కాదనం. ఈ సానుకూలతవల్లే ఎక్కువ మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపు ణులు తయారవుతున్నారు. మన దేశంలో యువతలో అక్షరాస్యత కూడా ఎక్కువే. యువతలో దాదాపు 90 శాతం మందికి చదవడం రాయడం వచ్చు. అక్షరాస్యతే చదువుకు కొలమానం కాదు. అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి రావడంవల్ల దాన్ని విరివిగా ఉపయోగిస్తున్న వారిలో అధిక సంఖ్యాకులూ యువజనులే. ఈ వినియోగం సద్వినియోగమా, దుర్వి నియోగమా అని కచ్చితంగా తేల్చి చెప్పలేం. స్మార్ట్‌ ఫోన్ల వెల్లువ వల్ల యువత చేతిలో ఈ ఫోన్లైతే కనిపిస్తున్నాయి కాని వాటిని దేనికి ఉపయో గిస్తున్నారన్నది శేష ప్రశ్నే. సద్వినియోగంచేస్తున్న వారు లేరని కాదు. నేరాలకూ ఈ అధునాతన ఫోన్లు ఉపకరణాలవుతున్న వాస్తవాన్ని నిరాక రించలేం. కరోనా కష్ట కాలంలో ఆన్‌లైన్‌ తరగతుల తంతువల్ల స్మార్ట్‌ ఫోన్ల సదుపాయంలేని వారి చదువు ఏమేరకు సాగింది, ఈ అవరోధాన్ని అధిగమించడానికి ఏం చేయగలిగాం అన్నది సమాధానం లేని ప్రశ్నే. మన దేశ జనాభాలో పని చేసే వయసులో ఉన్న వారు అంటే 15 నుంచి 59 ఏళ్ల మధ్యవయస్కులు 62.5 శాతం అని ఒక అంచనా. వీరందరికీ పని కల్పించగలుగుతున్నామా అంటే లేదన్న సమాధనామే వస్తుంది. నిరుద్యోగ సమస్య మనల్ని వెక్కిరిస్తోంది. ఏడాదికి కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఏలిన వారి మాటలు పచ్చి బూటకమని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2055 దాకా మన దేశంలో యువజనుల సంఖ్యే ఎక్కువ ఉంటుందంటున్నారు. ఈ యువశక్తిని సద్వినియోగం చేసుకోవడా నికి కావలసిన ప్రణాళికలు ప్రభుత్వ వాగ్దానాల్లో తప్ప ఎక్కడా కనిపించవు. గ్రామాల్లో ఉపాధి పరిమితం అయినప్పుడు పట్టణాలకు తరలి వచ్చే వారిలో సహజంగా యువజనులే అధికంగాఉంటారు. దీనివల్ల పట్టణ వాతావరణంలో వారి ఆలోచనా పరిధి విస్తరించి సాంస్కృతిక వైవిధ్యానికి అవ కాశం ఉండవచ్చు. యువతకు సంబంధించి కొన్ని కఠినవాస్తవాలనూ గమనంలోకి తీసుకోవలసిందే. మూక దాడులు, మూక హత్యలకు కారకులైన వారిలో ఉన్నది యువజనులేగా! ఇది దేనికి సంకేతం. ఈ దాడులకు బలైందీ యువతే కదా! ప్రధాన న్యాయమూర్తికి యువత మీద ఉన్న ఆశల్లో బేసబబు ఏమీ లేదు కానీ యువతను ఒక వర్గంగా జమ కట్టడం కుదరదు. యువత అంతా సవ్యంగానే వ్యవహరిస్తుందన్న హామీ కూడా లేదు. కౌమార దశకు కూడా చేరని వారి దగ్గర్నుంచి మతోన్మాదం నూరి పోసే సంస్థలను, వ్యవస్థలనునిలవరించే మార్గమేదైనాఉందా? కచ్చితంగా లేదు. తెలివి తేటలు, నైపుణ్యం, సద్వర్తన వయసుకు పరిమితమైన వ్యవహారాలుకావు. యువకుల్లో కూడా రకరకాల పెడధోరణులు ప్రమాదకరస్థాయిలో ఉండవచ్చు. ఇప్పుడు మనం అడు గడుగునా అనుభవిస్తున్నది ఇదే. యువశక్తిని ఉత్పాదక శ్రమకు విని యోగించుకోగలిగే విధానాలు మన పాలకులు ఇంతవరకు రూపొందించనే లేదు. వారిశక్తిని ఉత్పత్తి వేపు, నైపుణ్యంవేపు, సద్వర్తనవేపు మళ్లించ లేనప్పుడు ద్యోతకమయ్యే పెడధోరణులకు వయసుతోనిమిత్తం ఉంటుందను కోలేం.
యువతలో ఉత్సాహం పాళ్లు ఎక్కువే. కానీ దానికి దారీ తెన్నూ సరైది లేకపోతే ఒరిగేదేమీ ఉండదు. మతం పేర విధ్వంసం సృష్టించిన అనేక సందర్భాల్లో పాత్రధారులు ఈ యువతరంలోనే ఎక్కువ. అలాంటప్పుడు యువతలో ఈ లోపాలను ప్రస్తావించకుండా కీర్తించడం వల్ల, మన వీపు మనం చరుచుకోవడంవల్ల ఫలితం ఏమీ ఉండదు. యువశక్తి ప్రాధాన్యతను నొక్కి చెప్పిన ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ కర్తవ్యాలను కూడా ప్రస్తావించి ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉండేది. కేవలం వయసు దేనికీ కొలమానంకాదు. యువశక్తి అడ్డదార్లు తొక్కడానికి ప్రభుత్వ అపసవ్య విధానాలు ప్రధాన కారణమని గుర్తించగలిగినప్పుడే వారి సంఖ్యాబలానికి సార్థకత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img