Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ ప్రభుత్వ తెంపరితనం

బహుశః ఇది స్వతంత్ర భారత చరిత్రలో మొదటి సారి కావచ్చు. సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని వెల్లడిరచడానికి మోదీ సర్కారు నిర్మొహమాటంగా నిరాకరించింది. పెగాసస్‌ విషయంలో ప్రమాణ పత్రం సమర్పించాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటను మోదీ సర్కారు బలాదూరుగా తిరస్కరించింది. పెగాసస్‌ విషయంలో ప్రమాణపత్రం దాఖలు చేసేది లేదని ప్రభుత్వం సోమవారం చెప్పింది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కనక ప్రమాణ పత్రం ఇవ్వలేమని తెగేసి చెప్పింది. ‘‘ఇది జాతీయ భద్రతా వ్యవహారమని దాటవేయకండి. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది. దానికి అనుగుణంగానే రాజ్యవ్యవస్థలన్నీ నడుచుకోవలసి ఉంటుంది. రాజ్యాంగం ద్వారానే ప్రజలకు హక్కులు సంక్రమించాయి. వీటిని పరిరక్షించ వలసిన బాధ్యత కోర్టులకు ఉంది. ప్రభుత్వ వ్యవహారాలను న్యాయ దృష్టితో పరిశీలించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది. పత్రికా రచయితలు, రాజ కీయ నాయకులు, రాజ్యాంగ పదవులను నిర్వహిస్తున్న వారు, భద్రతా దళాల వారు, దర్యాప్తు సంస్థల వారు – ఇలా అందరి మీద ఇజ్రాయిల్‌ నుంచి తీసుకొచ్చిన పెగాసస్‌ ద్వారా గూఢచర్యం జరుగుతున్నప్పుడు భద్రతా వ్యవహారం సాకు చూపి తప్పించుకోవడం కుదరదు’’ అని సుప్రీంకోర్టు తీవ్రంగానే అన్నా మోదీ సర్కారు పట్టించుకోలేదు. ప్రమాణ పత్రం సమ ర్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 17వ తేదీ నుంచి దాగుడు మూతలు ఆడుతోంది. చూస్తాం, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం అని చెప్తూ వచ్చిన కేంద్రం చివరకు గత 13వ తేదీన ప్రమాణపత్రం సమర్పించే పనే లేదు అని తేల్చేసింది. ఇదే ప్రభుత్వం ఇదివరకు ప్రమాణపత్రం సమర్పించ డానికి గడువు కావాలని వాదించింది. సుప్రీంకోర్టు తగినంత గడువిచ్చింది. కావాలంటే మరి కొంత గడువిస్తామనీ చెప్పింది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని మాకూ తెలుసు. ఈ విషయాలన్నీ బహిరంగం కాకూడదనీ తెలుసు. అయినా ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయా లని సుప్రీంకోర్టు అన్నా ప్రభుత్వం ఈ సలహాను సైతం పెడచెవిన పెట్టింది. ప్రభుత్వం కనక ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే రెండు మూడు రోజుల్లో మేమే ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వం బెసకలేదు. దీన్నిబట్టి రాజ్యాంగం, న్యాయమార్గ పాలన, సుప్రీం కోర్టు హితవచనాలు, ఆదేశాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు మొదలైనవి ఏవీ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని తేలిపోయింది. ప్రజాస్వామ్యవ్యవస్థను, రాజ్యాంగ నియమాలను, న్యాయ మార్గ పాలన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇక సుప్రీంకోర్టే ప్రభుత్వానికి నోటీసు జారీ చేయవలసి ఉంది. గత్యంతరం కనిపించడం లేదు. రాజ్య వ్యవస్థలోని సకల అంగాలు విఫలమవుతున్న దశలో ప్రజలకు న్యాయవ్యవస్థ మీదే అంతో ఇంతో నమ్మకం మిగిలి ఉంది. ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేయాలని మోదీ సర్కారు పంతం పట్టినట్టుంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానం సాహ సోపేతంగా నడుచుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. పెగాసస్‌ విషయం పరిశీలించడానికి నిపుణులతో ఒక కమిటీ వేస్తామనీ ఆ కమిటీకే తాము ఇవ్వవలసిన వివరణ ఇస్తామని ప్రభుత్వం అంటోంది. మరి ఆ కమిటీ రూపొందించే నివేదికలోని అంశాలు బయటకు పొక్కితే దాని పర్యవసా నాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు లేదు. ఆ కమిటీలో కూడా అయినవాళ్లనే నియమించి తూతూ మంత్రంగా వ్యవహారం నడిపించాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. అలహాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సంపాదించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవలసిన అవ సరం ఉందని హితవు చెప్పారు. ఆ వేదిక మీదే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, అలహాబాద్‌ హైకోర్టు న్యాయ మూర్తులూ ఉన్నారు. న్యాయ వ్యవస్థతో తమ ప్రభుత్వం మధురమైన సంబం ధాలు కోరుకుంటోందని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు అన్న మాటలకు అర్థం ఏమిటో తెలియదు. ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య సంబంధా లను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి అడు గులకు మడుగులొత్తడానికి సిద్ధంగా లేరని ఆయన వ్యవహార సరళి నిరూపిస్తోంది. కార్యనిర్వాహక వర్గానికి, న్యాయవ్యవస్థకు మధ్య సమతూకం ఉండాలి. దాన్నీ ఈ ప్రభుత్వం పరిగణించడం లేదు.
న్యాయవ్యవస్థను తమకు అనుకూలంగా నడుచుకునేలా చూసే ప్రయత్నం మోదీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల నుంచీ జరుగుతూనే ఉంది. ఈ ఏకపక్ష ధోరణిని జీర్ణించుకోలేకే అప్పటి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు – జాస్తి చలమేశ్వర్‌, మదన్‌ బి. లోకూర్‌, రంజన్‌ గొగోయ్‌, జోసెఫ్‌ కురియన్‌ ప్రజాస్వామ్యానికి చీడ పడ్తోందని దేశ చరిత్రలో మొట్టమొదటి సారి విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నడవడిక మీదే ఈ ఫిర్యాదు. ఈ నలుగురిలో రంజన్‌ గొగోయ్‌ ఆ తరవాత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇవ్వడం మొదలు పెట్టారు. అయోధ్య వివాదం, 370వ అధికరణం రద్దు, రాఫేల్‌ వ్యవహారాన్ని విచారించడానికి నిరాకరణ, 35ఎ అధికరణం రద్దు మొదలైనవన్నీ ప్రభుత్వ అనుకూల తీర్పులేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను పెడదారి పట్టించడానికి, తమకు అనుకూలంగా ఉండేట్టు గదమాయించడానికి ప్రభుత్వం పనిగట్టుకుని చేస్తున్న కృషిలో భాగమే. ఇప్పుడు చిక్కల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి వంత పాడడానికి సిద్ధంగా లేకపోవడమే. అదే మోదీ సర్కారుకు కంటగింపుగా ఉంది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించడానికి ప్రధాన న్యాయమూర్తి చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అందుకే అడుగడుగునా అడ్డు తగులుతోంది. అయితే ఇది హఠాత్పరిణామం కాదు. 2018 నుంచి ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న దీపక్‌ మిశ్రా, రంజన్‌ గొగోయ్‌, ఎస్‌.ఎ. బోబ్డే ప్రభుత్వ అనుకూల తీర్పులు ఇవ్వడంలో అన్ని హద్దులూ దాటేశారు. ప్రజల మీద విపరీత ప్రభావం చూపే పెద్ద నోట్ల రద్దు, కరోనా సమయంలో లక్షలాది మంది కార్మికులు తమ ఊళ్లకు కాలి నడకన నడిచి పోవడం లాంటి అనేక కేసులను సుప్రీంకోర్టు పట్టించుకున్న పాపాన పోలేదు. నిజానికీ ఈ వ్యవహారాలన్నింటినీ సుప్రీంకోర్టు తనంత తాను విచారణకు చేపట్టి ప్రజలకు ఊరట కల్గించాల్సింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ప్రజల గోడు పట్టించుకోలేదు. పెగాసస్‌ పీడ మన ఒక్క దేశానికే సంబంధించిది కాదు. అనేక దేశాలు ఈ పెగాసస్‌ను వినియోగించాయి. జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. కానీ ఆ దేశాలు తీవ్రవాదుల, వ్యవస్థీకృత నేరాల గుట్టు కనిపెట్టడానికే పెగాసస్‌ సాంకేతికతను వినియోగించాయి. ఈ అంశంపై ఆ దేశాల్లో ప్రభుత్వాలు దర్యాప్తుకూ సిద్ధపడ్డాయి. మనదేశంలో పెగాసస్‌ను విచ్చల విడిగా రాజకీయ ప్రత్యుర్థులకు వ్యతిరేకంగా వినియోగించినందువల్ల ప్రభుత్వం దాచిపెట్టవలసిన విషయాలు చాలాఉన్నాయి. అందుకే సుప్రీం కోర్టు మాటనూ లెక్కచేయడంలేదు. ఇది కచ్చితంగా మోదీసర్కారు తెంపరి తనమే. ప్రజాస్వామ్యాన్ని ఏడు నిలువుల లోతున పాతరేయడమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img