Friday, May 31, 2024
Friday, May 31, 2024

వివక్ష వీడని మోదీ

కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల పట్ల వివక్షను అనురిస్తూనే ఉన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. బీజేపీ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులోనూ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంలో మోదీ అనుసరించిన వివక్షను బహుశా గతంలో ఏ ప్రధానీ అను సరించి ఉండరు. 2014లో లోకసభకు ఎన్నికలు జరగడానికి ముందు ప్రచారంలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలనూ నెరవేర్చలేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని అనేక ఎన్నికల ప్రచార సభల్లోనూ హామీ ఇచ్చి మాట తప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపట్ల సవతిప్రేమను చూపిస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన నాయకుడు ఉద్దవ్‌ థాక్రే నాయకత్వంలో ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వం కీలకపాత్ర వహించి నాటకాన్ని రక్తి కట్టించింది. శివసేన నుండి దాదాపు 20మంది ఎమ్మెల్యేలకు కావలసినవన్నీ సమకూర్చి పార్టీ ఫిరాయింపు చేయించి ఏక్‌నాథ్‌షిండే ముఖ్యమంత్రిగా చేసి బీజేపీ మరో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ షిండే ప్రభుత్వం విఫలమైందని నిరూపించడానికి మహారాష్ట్రకు కేటాయించిన భారీ ప్రాజెక్టులను త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌కు తరలించి మోదీప్రభుత్వం మరోసారి తనవివక్షను ప్రదర్శించింది. మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉన్నారు. షిండే ముఖ్యమంత్రి అయినప్పటికీ పరిపాలనలో తీసుకునే నిర్ణయాలలో ఫడ్నవీస్‌ తెరవెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత మూడు నెలలకాలంలో మహారాష్ట్రకు కేటాయించిన నాలుగు భారీ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారు. దాదాపు 2.25లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పనున్న ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 2లక్షలు ఉద్యోగాలు లభిస్తాయన్నది అంచనా. దేశ ఆర్థిక రాజధాని ముంబై అన్న పేరుంది. అలాగే మహారాష్ట్ర అనేక పరిశ్రమలకు నిలయంగా ఉంది. పెట్టుబడులలోనూ మొదటిస్థానంలో ఉంది. అయితే నిరుద్యోగం తాండవిస్తోంది. తాజాగా ఈ రాష్ట్రానికి 21.935 కోట్ల పెట్టుబడితో నెలకొల్పవలసిఉన్న టాటా ఎయిర్‌బస్‌ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించారు. 6 వేలకుపైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనావేసిన అ ప్రాజెక్టును నాగపూర్‌లో నిర్మించాలని నిర్ణయించారు. దీన్ని ఇప్పుడు గుజరాత్‌లోని వదోదరలో నెలకొల్ప నున్నారు. అంతకుముందు వేదాంత`ఫాక్స్‌కాన్‌ సంస్థ లక్షన్నరకోట్ల రూపాయలకుపైగా పెట్టుబడిపెట్టి సెమీ కండక్టర్‌ చిప్‌ తయారీ ప్రాజెక్టును నెలకొల్పడానికి అవగాహన ఒడంబడిక పత్రంపై సంతకాలు కూడా జరిగాయి. ఈ ప్రాజెక్టు లక్షకుపైగా ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనా. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఒత్తిడితో గుజరాత్‌కు యాజమాన్యం తరలించింది. తమ ఒత్తిడి ఏమీలేదని బీజేపీ బుకాయించింది. ఏ విషయంలోనూ పారదర్శకతలేని మోదీ ప్రభుత్వం వాస్తవ చెప్పడం చాలా అరుదు.
ఈ ప్రాజెక్టులకంటే ముందు 3వేలకోట్ల రూపాయల పెట్టుబడి, 50వేల ఉద్యోగాలు ఇస్తామని బల్క్‌ డ్రగ్‌ పార్కు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. అయినప్పటికీ మహారాష్ట్రకు రానివ్వకుండా అడ్డుపడి గుజరాత్‌కు తరలించారు. అలాగే ఔరంగాబాద్‌లో 424కోట్ల రూపాయలతో మహారాష్ట్ర ప్రభుత్వం వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్న అనంతరం దాన్నీ ఇతర రాష్ట్రాల బాట పట్టించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే పదివేల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2020లోనే మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇన్ని అక్రమ చర్యలకు కేంద్రం పూనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి, షిండే మౌనంగానే ఉన్నారు. ఎక్కడా స్పందించలేదు. షిండే అనుచరులైన 20మంది ఎమ్మెల్యేలను త్వరలో బీజేపీలో చేర్చుకోబోతున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తనకు కష్టాలు తప్పవేమోనన్న అందోళనలో షిండే ఉన్నారని భావించవచ్చు. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలించడానికి ఎన్నికల కమిషన్‌ మోదీకి కావలసినంత సమయం ఇస్తుందేమోనన్న విమర్శలూ వస్తున్నాయి. 2014లో పార్లమెంటు ఎన్నికలకు ముందు అభివృద్ధికి గుజరాత్‌ నమూనా అంటూ ప్రచారం సాగించి ప్రయోజనం పొందిన విషయం తెలిసిందే. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల ఆశ కల్పించి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంకోసమే ఈ మాయోపాయాలన్నీ పన్నుతున్న మోదీ సామర్థ్యానికి పరీక్షే అని విశ్లేషకులు చెపుతున్నారు. దాదాపు 27ఏళ్ల తర్వాత గుజరాత్‌లో ముక్కోణపు పోటీ జరగనుంది.
గత ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకుగాను కాంగ్రెస్‌ 77 సీట్లు గెలుచుకుంది. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్‌ కొంత బలహీన పడిరదని, రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రభావం వల్లకొంత పుంజుకోవచ్చునని భావిస్తున్నారు. దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తూ అమ్‌ ఆద్మీపార్టీ నాయకుడు కేజ్రీవాల్‌ ఈ సారి గుజరాత్‌పై కన్నువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే ధన ప్రభావంతో గెలిచే అవకాశాలు లేకపోలేదని అంచనాలు వస్తున్నాయి. ఇటీవల మోదీ అక్కడ చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడం, ప్రస్తుతం ప్రభుత్వ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అనేకసార్లు గుజరాత్‌లో పర్యటించి వాగ్దానాలు చేయడం గెలుపుపై మోదీ ఆందోళన చెందుతున్నారని స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img