test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

విశాఖ ఉక్కును ఆవహించిన ప్రైవేటు భూతం

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వ కుటిల పన్నాగాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు బుధవారంతో 600 రోజులు పూర్తి అవుతాయి. విశాఖ ఉక్కు తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు కేవలం ఓ పరిశ్రమ కాదు. ఉపాధి మార్గం కాదు. నెలల తరబడి ‘‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’’ నినాదంతో బలిదానాలతో సాధించుకున్న కర్మా గారం అది. ఒక రకంగా పారిశ్రామికాభివృద్ధిలో తెలుగు వారి దృష్టిలో అది ఆత్మగౌరవ చిహ్నం. ఒక కీలకమైన పరిశ్రమను ప్రైవేటు రంగానికి అప్పగించాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు అనేక సాకులు వెతుకుతాయి. ఆ పరిశ్రమను స్థాపించడానికి కారణమైన మౌలిక అంశాలు కనుమరుగయ్యేట్టు చేస్తాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకోవడానికి ప్రధానంగా వామపక్ష పార్టీలు, వాటితో పాటు ఇతర నేతలు అపారమైన కృషి చేశారు. త్యాగాలకు ఓర్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నడపడానికి కావలసిన ముడిసరుకులకు సంబంధించి సంపూర్ణమైన ఏర్పాట్లు ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఇనుప ఖనిజం వాడుకోవడానికి సొంత గనులు కేటాయించనే లేదు. ఈ ఉక్కు కర్మాగారం ఇబ్బడి ముబ్బడి ధర చెల్లించి బహిరంగ మార్కెట్లు ఇనుప ఖనిజం సేకరించవలసి వచ్చింది. దీనితో సహజంగానే ఖర్చు పెరిగిపోయింది. ఉత్పత్తి సామర్థ్యం మీద, ఆ కర్మాగార నిర్వహణకు తీసుకునే రుణాల మీద పరిమితులు విధించడం ద్వారా ప్రభుత్వాలు ఆ పరిశ్రమను అంతకంతకూ కునారిల్లేట్టు చేశాయి. విశాఖ ఉక్కు ఉద్యమం ఆ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆందోళన చేసిన సమయంలోనూ, ప్రస్తుతం ప్రైవేటీ కరణను ప్రతిఘటించడంలోనూ అది కేవలం ఆ పరిశ్రమ కార్మికులకు పరిమితమైన పోరాటం కాదు. విశాఖ ఉక్కు ఏర్పాటుకు ప్రజలే ఉద్యమించ వలసి వచ్చింది. ఇప్పుడు దానిని ప్రైవేటీకరించకుండా పరిరక్షించేందుకూ జనాందోళన ఆరు వందల రోజులుగా నిరంతరం సాగుతూనే ఉంది. ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అడ్డు కోవడానికి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడానికి ఈ పోరాటం నిరం తరం కొనసాగుతోంది. 1991లో పీవీ నరసిం హా రావు ప్రభుత్వం నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరించడం మొదలైన తరవాతే ప్రభుత్వరంగ పరిశ్రమలను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి అప్పగించే దుష్ట పన్నాగం కొనసాగుతూనే ఉంది. ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయ డానికి ప్రభుత్వాలు ముందు ఆ పరిశ్రమ కుంటుపడేట్టు చేస్తాయి. ఆ తరవాత నష్టాలు వస్తున్నాయి అని యాగీ చేస్తాయి. సకల హంగులు, ముడిసరుకు లాంటివి చేతిలో ఉన్న ప్రభుత్వమే పరిశ్రమలను నడపడం సాధ్యం కానప్పుడు వ్యక్తులు నిర్వహించే ప్రైవేటు రంగం లాభాల బాట ఎలా పట్టిస్తుంది అన్న ప్రశ్నకు ఏ ప్రభుత్వమూ ఇప్పటిదాకా సమాధానం చేప్పనే లేదు. ప్రభుత్వాలు రాక్షసంగా అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను అప్పనంగా, కనీసం వాటిని నెలకొల్పిన నేలకు మార్కెట్‌ లో ఉన్న ధర అయినా వసూలు చేయకుండా గంపగుత్తగా ప్రైవేటుకు అప్పగించాయి. అదేమిటని అడిగితే వ్యాపారం చేయడం ప్రభుత్వ పని కాదు అని వాజ పేయి చెప్పిన మాటను విసుగు విరామం లేకుండా వల్లిస్తుంటాయి. నిజానికి ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం లాభార్జన కాదు. ప్రజలకు అవసరమైన వస్తువులను, పారిశ్రామికీకరణను వేగవంతం చేయడానికి కావలసిన ఉత్పత్తులను తయారు చేయడమే అన్న వాస్తవం ప్రైవేటు రంగాన్ని బుజానకెత్తుకుని మోస్తూ మురిసిపోతున్న ప్రభుత్వాలకు అర్థమయ్యే వ్యవహారం కాదు. ఎందుకంటే ప్రైవేటు రంగం ఎంత బలిసిపోతే అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న పార్టీల బొక్కసాలు అంతగా నిండుతాయి. అంటే ఇది ప్రభుత్వం లాభాపేక్షతో చేస్తున్న పని కాదు. ప్రభు త్వాన్ని నిర్వహిస్తున్న పార్టీలు, వ్యక్తులు సొంత లాభంకోసం అనుసరిస్తున్న దుర్నీతి. ఇంకా కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటుపరం కాకుండా మిగిలు ఉండడానికి కారణం కార్మికవర్గం పోరాట పటిమే. ఆరు వందల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు చేస్తున్న ప్రయత్నం ఇదే.
విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొనడానికి, ఇంతవరకు నిలబడడానికి ప్రధాన కారణం భారత సమాజంతో ప్రభుత్వరంగానికి ఉన్న విడదీయరాని బంధమే కారణం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదన కేవలం మోదీ ప్రభుత్వ మెదడును తొలచిన ఆలోచన ఏమీ కాదు. ప్రైవేటీకరణ గండాన్ని విశాఖ ఉక్కు అనేక సార్లు ప్రతిఘటించి నిలదొక్కుకోగలిగింది. ఒక పరిశ్రమ అంత పటిష్ఠంగా లేదు అనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ప్రైవేటీకరణ బాట పట్టవు. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ పరి శ్రమలను ప్రైవేటీకరించడానికి ఉన్న దార్లన్నీ వెతుకుతూనే ఉంటాయి. మొదట పెట్టుబడుల ఉపసం హరణకు ప్రయత్నం జరుగుతుంది. లేదా ఆ పరిశ్రమలోని ఒక్కో విభాగాన్ని ప్రైవేటు వ్యాపారులకు దారాదత్తం చేస్తారు. ఆస్తులు తెగనమ్ముతారు. ఒక వేళ పరిశ్రమ బాగా నడుస్తున్నా నిధులు దారి మళ్లిస్తారు. విధాన రీత్యా వెన్నుపోటు పొడుస్తారు. వ్యాపార రీత్యా తీసుకో వలసిన నిర్ణయాలు సమయానికి తీసుకోకుండా తాత్సారం చేస్తారు. ఇంత వరకు విశాఖ ఉక్కు విషయంలో కార్మికులు, ప్రజలు ఈ ప్రయత్నాలను నిరోధిస్తూ వచ్చారు. అభివృద్ధి సాధనలో కొరతను తీర్చాలంటే పారిశ్రామికీ కరణ ఒక్కటే మార్గం అని, అది కూడా ప్రభుత్వరంగంలో సాగితే ప్రజా ప్రయోజనాలు కాపాడవచ్చునని వామపక్షాలు నమ్ముతాయి. అందుకే ఎక్కడ ప్రభుత్వరంగ పరిశ్రమలకు ప్రైవేటీకరణ పేరుతో ఉచ్చు బిగించాలని చూసినా వామపక్ష పార్టీలు నిరోధిస్తూ ఉంటాయి. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిరక్షణలో సీపీఐతో సహా వామపక్షాలు దృఢ దీక్షతో ఉద్య మించడానికి కారణం ఇదే. అందుకే విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమం సాగినప్పుడు వామపక్షాలు ముందుండి ఉద్యమానికి నాయకత్వం వహించాయి. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించే వారిని జాతికే శత్రువు లుగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వరంగం మీద కత్తికట్టినట్టు ప్రవర్తించే ఏ ప్రభుత్వమైనా, ఉదారవాద ఆర్థిక విధానాలకు పెద్ద పీటవేసే ఏ సర్కారు అయినా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. విశాఖ ఉక్కుకు సరైన రూపురేఖలు ఏర్పడకముందే దానికి గండి కొట్టాలన్న ప్రయత్నాలు జరిగాయి. నోటితో స్వయంసమృద్ధి అన్న నినాదాలు ఇస్తూ చేష్టల్లో ప్రభుత్వరంగాన్ని కుళ్లబొడవడానికి చేసే కుటిల యత్నాలలో విశాఖ ఉక్కు కర్మాగారం ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉంది. విశాఖ ఉక్కుని నవరత్నాల జాబితాలో చేర్చిన ప్రభుత్వమే దానికి సరైన ఊతం ఇవ్వకుండా బలహీన పరిచి ప్రైవేటీకరణకు దారులు వేస్తోంది. సొంత ఇనుప ఖనిజ వనరులు లేనప్పటికీ లాభాలు సంపాదించి చూపిన ఘనత విశాఖ ఉక్కుకు ఉంది. దానికి గండి కొట్టింది కేంద్ర ప్రభుత్వాలే. ఇప్పుడు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఈ విచ్ఛిన్నకర కార్యకలాపాలను సిగ్గు విడిచి అమలు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం మోదీ సర్కారు అడుగులకు మడుగులొత్తడంలో క్షణం తీరిక లేకుండా ఉంది. ఇలాంటి ప్రతికూల సమయంలో నిరంతర జాగరూకత, సమష్టి పోరాటం ఒక్కటే మార్గం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img