Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఆత్మ నిర్భరతా నినాదం నిరాయుధ సైన్యం

నోరు విప్పితే ప్రధానమంత్రి మోదీ మన సైనిక దళాలను కీర్తిస్తూ ఉంటారు. పుల్వామా సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. సైన్యం సామర్థ్యాన్ని తన ఘనత కింద ప్రచారం చేసుకుంటారు. ప్రతి అంశంలోనూ ‘‘ఆత్మ నిర్భరత’’ తమ పరమ లక్ష్యం అని చెప్తూ ఉంటారు. విశ్వగురువులం మనమేనంటారు. కానీ మన సైనిక దళాలు మాత్రం తగిన, సరైన ఆయుధాలు లేక కొట్టు మిట్టాడుతూ ఉంటుంది. మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ సైన్యానికి ఆయుధ కొరత పెరుగుతూనే ఉంది. స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ విభాగాలకు కేటాయిస్తున్నది కేవలం రెండుశాతమే. త్రివిధ దళాలలోనూ ఇదే పరిస్థితి. త్రివిధ సైనిక దళాలనూ ఆయుధ సంపత్తి కొరత వేధిస్తూనే ఉంది. అయిన దానికీ, కాని దానికీ పాకిస్థాన్‌ మీద విరుచుకు పడే మోదీ, బీజేపీ ఈ ఆయుధ కొరత గురించి మాత్రం మాట్లాడకపోవడం విచిత్రమే. నిజానికి అది ఉద్దేశ పూర్వకమైది కూడా కావచ్చు. మరో వేపు చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వస్తున్నా మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు. చైనా అంతటి బలమైన దేశాన్ని మనం ఎలా నిలవరించగలం అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ వాపోతుంటారు. తమకు సాధన సంపత్తి ఉండవలసినంత లేదని త్రివిధ సైనిక దళాలూ 2014 నుంచి చెప్తూనే ఉన్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఆయుధ కొరతను మోదీ ప్రభుత్వం పాక్షికంగా నైనా తీర్చడం లేదు. ఆయుధ దిగుమతులలో మన దేశమే అగ్రభాగాన ఉన్నా కొరత తీరకపోవడం ఆశ్చర్యకరమే. మనం ఎక్కువగా రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇటీవలి కాలంలో అనేక కారణాలవల్ల రష్యా మన రక్షణావసరాలను తీర్చలేక పోతోంది. కీలకమైన ఆయుధాలే కాక ఇంతకు ముందు దిగుమతి చేసుకున్న వాటికే విడిభాగాలు కూడా అరకొరగానే దిగుమతి చేసుకోగలుగు తున్నాం. మన సైనిక దళాలు వాడే ఆయుధాలలో విడిభాగాల అవసరం 60శాతం ఉంటుంది.
ఉక్రెయిన్‌ మీద యుద్ధం ప్రకటించిన తరవాత రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించడం కూడా ఈ కొరతకు ప్రధాన కారణం కావొచ్చు. మోదీ సర్కారు అధికారంలో ఉన్న ఈ తొమ్మిదేళ్లలో దృఢమైన జాతీయతావాదం గురించి ఎంత గొంతు చించుకున్నా ఆయుధాల విషయం మాత్రం జాతి భద్రతను ప్రమాదంలో పడవేస్తోంది. దీనివల్ల సహజంగానే మన సేనల సామర్థ్యం బలహీనమవుతుంది. వైమానిక దళం దగ్గర యుద్ధ విమానాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైమానిక దళం దగ్గర 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ ఆ సంఖ్య దారుణంగా 29కి పడిపోయింది. ఈ తగ్గుదల మరింత త్వరితంగా పెరిగే అవకాశంఉంది. ఈ విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడే ఇంధనం నింపే సదుపాయాలు కొరవడ్డాయి. నౌకాదళంలో కూడా సాంప్రదాయిక యుద్ధ నౌకలకు కొరత కొనసాగుతోంది. ఐ.ఎన్‌.ఎస్‌. విక్రాంత్‌లో యుద్ధ విమానాల అవసరమూ తీరడం లేదు. మన దేశం లోనే తయారయ్యే 65,000టన్నుల బరువుగల విమాన వాహక నౌకలు కావాలని నౌకాదళం చాలాకాలంగా విన్నవిస్తూనే ఉంది. దీనికి ప్రభుత్వ అనుమతి ఇప్పటికి రానేలేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ అవసరం మరింత ఎక్కువ. శతఘ్నులు కావాలని భారత సైన్యం కోరుతోంది. ప్రధాన యుద్ధ ట్యాంకులు, తేలికపాటి ట్యాంకులు, పదాతి దళాలు వినియోగించే యుద్ధంలో వాడే వాహనాలు, రకరకాల హెలికాప్టర్లు లేకపోవడం సైన్యం సామర్థ్యానికి కత్తెర వేస్తోంది. అలాగే రైఫిళ్లు, స్నైపర్‌ రైఫిళ్లు, కార్బైన్లు కావలసి ఉన్న రక్షణ మంత్రిత్వశాఖ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ సాధన సంపత్తిని సమకూర్చడంమీద దృష్టే ఉన్నట్టులేదు. రక్షణ సంబంధ విషయాలలో మన కాళ్లపై మనమే నిలబడాలన్న విధానానికి మోదీ ప్రభుత్వం తిలోదకాలిచ్చినట్టు ఉంది. ఆత్మ నిర్భరతకు ఊతం ఇవ్వడానికి సైనిక సహకారం గురించి అదే పనిగా మాట్లాడే రక్షణశాఖ ఆచరణలో మాత్రం చేస్తున్నది శూన్యమే. పేరుకు మాత్రమే సైనిక సహకారం అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. సైనిక సహకారం అంటే ప్రభుత్వ రంగంలో గానీ, ప్రైవేటురంగంలో కానీ మనం దిగుమతి చేసుకునే ఆయుధాలు మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండాలి. విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసు కున్నప్పుడు దానికి సంబంధిóంచిన సాంకేతికత కూడా మనకు అందాలి. ఈ ఆయుధాల ఉత్పత్తిలో మన పాత్ర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఏ దేశంలోనో ఉత్పత్తి అయిన ఆయుధాలు మనం దిగుమతి చేసుకుంటే దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు అందినప్పుడే ప్రయోజనం ఉంటుంది. కానీ ఆయుధ ఉత్పత్తి కంపెనీలు ఈ పరిజ్ఞానం అందించడానికి అంత అనుకూలంగా లేకపోవడం పెద్ద సమస్య.
అసలు మనం ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం వెంపర్లాడడమే పొరపాటు అని వాదించే సైనిక వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. మరీ విచిత్రం ఏమిటంటే 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత అంతకు ముందు అధికారంలో ఉన్న యు.పి.ఎ. ప్రభుత్వ నిర్వాకంవల్ల చిన్న పిన్ను దగ్గర నుంచి యుద్ధ విమానాల దాకా అన్ని హడావుడిగా దిగుమతి చేసుకోవలసి వచ్చిందని 2022 మార్చిలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్‌ పార్లమెంటులోనే అబద్ధం చెప్పారు. ఉన్న అవసరాలను మోదీ ప్రభుత్వం తీర్చి ఉంటే సైనిక దళాల దగ్గర ఆయుధ కొరత ఎందుకుంటుందో. యు.పి.ఎ. ప్రభుత్వం రక్షణ దళాలకోసం ‘‘ఏమీ కొనలేదు’’ అని ఆమె చెప్పారు కానీ వివరాలు వెల్లడిరచడానికి నిరాకరించారు. యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో లొసుగులు ఎత్తి చూపడం మీద ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న దృష్టి వాస్తవాలు గమనించడం మీద ఎప్పుడూ లేదు. 2004 నుంచి 2014 దాకా యు.పి.ఎ. అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో యుద్ధ విమానాలు, రవాణా వాహనాలు, శిక్షణకు ఉపకరించే విమానాలు, నిఘాకోసం హెలికాప్టర్లు, ప్రధానమైన ట్యాంకులు, విమాన వాహక నౌకలు, డీసెల్‌, ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములు సమకూర్చారు. అసత్యాలమీద ఆధారపడి కాలం వెళ్లబుచ్చడానికి అలవాటు పడ్డ మోదీ సర్కారుకు సంతంతో పనే లేదు. త్రివిధ దళాలకు కావలసిన ఆయుధాలు సమకూర్చడానికి యు.పి.ఎ. సర్కారు మూడు బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. యు.పి.ఎ. హయాంలోనే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కలిసి 600 దాకా సమకూరాయి. ఇందులో 250 సుఖోయ్‌ విమానాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్‌ నుంచి మనం కొన్న విమానాలే తరవాత అమెరికా సమకూర్చుకుంది. ఈ విమానాలు ఇటీవలి కాలంలో మనం సూడాన్‌లో చిక్కుకుపోయిన మన పౌరులను సురక్షితంగా ఇల్లు చేర్చడానికి ఉపయోగపడ్డాయి. మునుపటి ప్రభుత్వాన్ని దూషించడం తప్ప మోదీ సర్కారు రక్షణ విభాగాలకు చేసిన మేలు దాదాపు పూజ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img