Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఐరాస ఆదేశాన్ని పట్టించుకోని ఇజ్రాయిల్‌

దాదాపు ఆరు నెలలుగా ఇజ్రాయిల్‌ పలస్తీనా మీద, ముఖ్యంగా గాజా మీద కర్కోటకమైన యుద్ధం కొనసాగిస్తోంది. సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి ఎట్టకేలకు రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని ఇజ్రాయిల్‌ను నిర్దేశిస్తూ తీర్మానం ఆమోదించగలిగింది. అమెరికా ఈ తీర్మానంపై ఓటింగుకు గైరుహాజరైనందువల్ల తీర్మానం ఆమోదించడం సాధ్యమైంది. ప్రపంచ శాంతిని కాపాడి, యుద్ధాలు నివారిం చవలసిన బాధ్యత ఉన్న ఐక్యరాజ్యసమితి ఇజ్రాయిలీ తీవ్రవాద చర్యలను నిరోధించడంలో విఫలమైంది. రంజాన్‌ పవిత్ర మాసం గనక ఇంకా ఈ నెలలో మూడు వారాలకన్నా తక్కువ కాలంలో మాత్రమే కాల్పుల విరమణ పాటించాలని తీర్మానించడం విచిత్రం. అయితే భద్రతా సమితి ఈ ఒక్క అడుగైనా వేయగలిగింది. బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని కూడా కోరింది. గత ఏడాది అక్టోబర్‌ ఏడున హమాస్‌ ఇజ్రాయిల్‌ మీద రాకెట్లతో దాడి చేసిన మర్నాడే హమాస్‌ను అంతమొందించేదాకా నిద్రపోనని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నెతన్యాహూ గర్జించారు. అప్పటి నుంచి గాజా నది పశ్చిమ తీరం నుంచి పలస్తీనియన్లు చాలా మంది గాజా చేరుకున్నారు. ఆ తరవాత ఇజ్రాయిల్‌ గాజాను సర్వనాశనం చేయడానికి సకలవిధ ప్రయత్నాలూ చేస్తోంది. హమాస్‌ ఇజ్రాయిల్‌ మీద దాడి చేసినప్పుడు 12,000 మంది మరణించిన మాట నిజమే. కానీ ఇజ్రాయిల్‌ పలస్తీనియన్ల మీద బాహాటంగా యుద్ధమే ప్రకటించింది. ఈ యుద్ధంలో ఇంతవరకు 32,000 మంది పలస్తీనియన్లు నేలకొరిగారు. 17 లక్షల మంది నిర్వాసితులయ్యారు. గాజా నగరం శ్మశానం కన్నా ఘోరంగా తయారైంది. నెతన్యాహు రక్త దాహాన్ని అమెరికా మొదటి నుంచి బాహాటంగానే సమర్థిస్తోంది. కాల్పులు విరమించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రతిపాదించినప్పుడల్లా అమెరికా వీటో అస్త్రం ఉపయోగించి మోకాలడ్డుతూనే ఉంది. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలి యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి నాలుగుసార్లు కాల్పుల విరమణకోసం ప్రయత్నించి విఫలం అయింది. గత శుక్రవారం అమెరికా తనకు అనుకూలమైన రీతిలో కాల్పుల విరమణకోసం తీర్మానం ప్రతిపాదించినప్పుడు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా, చైనా దేశాలు అమెరికా కుటిల యత్నాలను సాగనివ్వకుండా వీటో చేశాయి. ఇంతకు ముందు తీర్మానాలను ఆమోదించడానికి వీలు లేకుండా అమెరికా మూడుసార్లు వీటో అవకాశాన్ని ఉపయోగిం చుకుంది. ఈ సారి అమెరికా గైరుహాజరైనందువల్ల కనీసం రంజాన్‌ పండగ ముగిసే దాకా అయినా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయిల్‌ను నిర్దేశిస్తూ తీర్మానం ఆమోదించగలిగారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ పశ్చిమాసియా ప్రాంతంలో ఇటీవలే పర్యటించారు. గాజా, ఈజిప్టు సరిహద్దులోని రఫాలో మానవతావాద దృష్టితో తక్షణం కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ కాల్పుల విరమణ తీర్మానాన్ని అమలు చేయాలని గుటెరెస్‌ గట్టిగా కోరారు. ఈ తీర్మానాన్ని అమలు చేయించలేకపోతే అది క్షమించరాని తప్పిదం అవుతుందని కూడా ఆయన అన్నారు.
భద్రతా సమితి తీర్మానం మీద వోటు వేయకుండా గైరుహాజరైన అమైరికాను మినహాయిస్తే మిగిలిన 14 దేశాలు తీర్మానాన్ని సమర్థించాయి. అయితే భద్రతా సమితి తీర్మానం రంజాన్‌ పండగదాకానే కాల్పుల విరమణ జరగాలని కోరడం ఐక్య రాజ్య సమితి బలహీనతనే నిరూపిస్తోంది. యుద్ధ రంగంలో చిక్కుకున్న వారికి వైద్య సేవలు అందించడంతో సహా ఇతర మార్గాల్లో మానవతావాద దృష్టితో సహాయాన్ని అందించడానికి కూడా ఇజ్రాయిల్‌ అడుగుడగునా ఆటంకాలు కల్పిస్తోంది. యుద్ధ సమయంలో పౌరుల మీద దాడి చేయడాన్ని కూడా భద్రతా సమితి ఖండిరచింది. కానీ గత అయిదు నెలలపై నుంచి ఇజ్రాయిల్‌ ఒక తీవ్రవాద దేశంగా వ్యవహరిస్తూ పలస్తీనియన్లందరినీ తుడిచి పెట్టాలని కసిగా ప్రయత్నిస్తోంది. ఈజిప్టు, ఖతార్‌ లాంటి దేశాల శాంతి యత్నాలను కూడా ఇజ్రాయిల్‌ వ్యతిరేకిస్తూనే ఉంది. నెతన్యాహూ ఇంత మంకుపట్టు పట్టడానికి పలస్తీనియన్లంటే ముందు నుంచి ఉన్న ద్వేష భావం ఒక కారణం కావచ్చు. అంతకు మించి ఆయుధ వ్యాపారంతో కడుపు నింపుకునే అమెరికా మద్దతు ఇజ్రాయిల్‌కు ఉంది. నెతన్యాహూ అమానుష యుద్ధ కాండను నిలిపివేయించడానికి అమెరికా ప్రయత్నించిన దాఖలాలే లేవు. అమెరికా చరిత్రలో ఆ దేశం ఇంతవరకు తన గడ్డ మీద ఒక్కసారి కూడా యుద్ధం చేయలేదు. కానీ ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా యుద్ధోన్మాదుల పక్షాననే నిలబడుతుంది. యుద్ధాలను సమర్థించడం ద్వారా ఆయుధ వ్యాపారం కొనసాగించడానికే అమెరికా ప్రాధాన్యం ఇస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలలో అమెరికా ఈ దుష్ట పాత్రే పోషిస్తోంది. తీవ్రవాదాన్ని మట్టుబెట్టడానికి ఏ అవకాశమూ వదలం అని చెప్పుకునే అమెరికా ప్రపంచంలోకెల్లా ఒకే ఒక తీవ్రవాద దేశం అయినా ఇజ్రాయిల్‌కు అండగా నిలవడాన్ని మించిన దుర్నీతి ఏదీ ఉండదు. మొజాంబిక్‌ ఈ తీర్మాన ముసాయిదా సిద్ధం చేసింది. గాజా నది తీరంలో జరుగుతున్న మారణకాండ ఇక ఎంత మాత్రం కొనసాగనివ్వకూడదని మొజాంబిక్‌ వాదించింది. యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా కాల్పుల విరమణ అన్న ప్రస్తావననే వ్యతిరేకిస్తూ వచ్చింది. తనకు మిత్ర దేశమైన ఇజ్రాయిల్‌ రక్త పిపాస తీర్చడానికి ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంది. అమెరికా అండ నిండుగా ఉన్న నెతన్యాహూ యుద్ధంలో చిక్కుకున్న వారికి ఆహారమైనా అందకుండా చేసి పలస్తీనియన్లను ఆకలికి మాడ్చి చంపాలనుకుంటున్నాడు. భద్రతా మండలిలో ప్రతిపాదించే తీర్మానాన్ని వీటో చేయకపోతే అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని ఈ తీర్మానం ప్రతిపాదించక ముందే నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా ఈ సారి వీటో చేయకుండా గైరుహాజరైంది కనకే తీర్మానం ఆమోదించడం సాధ్యమైంది. గాజా నది తీరంలో మారణహోమం కొనసాగిస్తున్న ఇజ్రాయిల్‌ అధినేత నెతన్యాహూ ఐక్య రాజ్య సమితి తీర్మానాన్ని ఏ మేరకు అమలుకు చేస్తారో ఇప్పటికైతే తెలియదు. ఇజ్రాయిల్‌ పలస్తీనా భూభాగాల మీద బాంబుల వర్షం కురిపించడం, రోజూ వందలాది మందిని బలిగొనడంతో ఆగడం లేదు. కనీసం 70,000 మంది పలస్తీనియన్లు ఈ అమానుష దాడిలో గాయపడ్డారు. రోజూ పలస్తీనియన్లను ఇజ్రాయిలీ బలగాలు అరెస్టు చేస్తూనే ఉన్నాయి. ఐక్య రాజ్య సమితి భద్రతా సమితి తీర్మానం ఆమోదించి ఒక రోజు గడిచిన తరవాత కూడా యుద్ధ రంగంలో పరిస్థితి మారిన దాఖలాలైతే లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img