Friday, May 10, 2024
Friday, May 10, 2024

ఎన్నికల కమిషన్‌ పాక్షిక ధోరణి

ఎన్నికల తేదీలు నిర్దిష్టంగా నిర్దేశిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేయకపోయినా స్థూలంగా ఎన్నికల కార్యక్రమం ప్రకటించగానే నైతిక ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. ఫలానా తేదీన, ఫలాన చోట పోలింగ్‌ జరుగుతుందని ముందు ప్రకటించి ఆ తరవాత సవివరమైన ఎన్నికల కార్యక్రమం ప్రకటిస్తుంది. ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్‌ అధికారులు గత 12వ తేదీన ప్రకటించారు. అప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఈ సారి ఏడు దశలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ దశలు రాష్ట్రాల వారీగా నిర్ణయించినవి కావు. ఒక్కో రాష్ట్రంలో అనేక దశల్లో పోలింగ్‌ జరగొచ్చు. కొన్ని చోట్ల ఒకే రోజున పోలింగ్‌ పూర్తి కావచ్చు. తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న మొదలవుతుంది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. కశ్మీర్‌లో అయిదు లోక్‌సభ సీట్లు ఉంటే అయిదు దశల్లో పోలింగ్‌ నిర్వహించడం గమనించదగిన విశేషం. జార్ఖండ్‌లో ఉన్న 14 సీట్లకు నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఫలితాలు జూన్‌ నాలుగవ తేదీన వెల్లడవుతాయి. ఒక్కో దశ పోలింగ్‌కు సగటున వారం రోజుల అంతరం ఉంది. అంటే ఏడు వారాలపాటు పోలింగ్‌ కొనసాగుతుంది. ఆఖరి ఫలితం వెలువడే దాకా ఎన్నికల నైతిక ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి చట్టబద్ధమైంది కాదు. కానీ దీనిని ఉల్లంఘించిన సందర్భాలలో రాజకీయ పార్టీల మీద, అభ్యర్థుల మీద చర్య తీసుకునే అధికారాన్ని ఎన్నికల కమిషన్‌ వినియోగించుకుంటూనే ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సందర్భాల గురించి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతాయి. చర్యలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడకుండా నిరోధించి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి నైతిక ప్రవర్తనా నియమావళి ఉపకరిస్తుంది. ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఎన్నికల కమిషన్‌ నిఘా వేసి ఉంచుతుందన్న భరోసా జనానికి ఉండడంవల్ల ఎన్నికలు సజావుగా జరుగుతాయని విశ్వసిస్తారు కూడా. నైతిక ప్రవర్తనా నియమావళి ప్రకారం నిషేధించదగిన కొన్ని అంశాలు నేర నిరోధక చట్టం, ఇతర చట్టాల ప్రకారం కూడా నేరం కిందకే వస్తుంది. ఎన్నికల ప్రక్రియ ఇంత సుదీర్ఘ కాలం నిర్వహించడానికి కారణం ఏమిటి అంటే దేశం సువిశాలమైందని, బందోబస్తుకు భద్రతా దళాలను ఒక చోటి నుంచి మరో చోటికి పంపడానికి ఎక్కువ సమయం పడ్తుందని ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల కార్యక్రమం ప్రకటించిన రోజు తెలియజేశారు. అందులో కొంత నిజం ఉండొచ్చు కానీ ఉత్తర ప్రదేశ్‌ లాంటి విశాల భూభాగం ఉన్న రాష్ట్రాన్ని వదిలేస్తే ఎక్కువ దశల్లో పోలింగ్‌ జరిగే రాష్ట్రాలు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నవే. ఇంత పకడ్బందీగా ఎన్నికల కార్యక్రమాన్ని ఖరారు చేశారంటే ఎన్నికల కమిషన్‌ తన మీద ఉన్న బాధ్యతను ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తోందో అనుకునే అవకాశమూ ఉంది. ఎన్నికల కమిషన్‌ సర్వ స్వతంత్ర వ్యవస్థ. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవలసిన అగత్యం లేదు. కానీ ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని, మిగతా ఇద్దరు కమిషనర్లను నియమించే సర్వాధికారాలను ఇటీవల మోదీ ప్రభుత్వం హస్తగతం చేసుకున్న తరవాత ప్రభుత్వ ఆజ్ఞ జవదాటని వారే ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతారన్న అభిప్రాయం బలంగా ఉంది.
ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎన్నికల కమిషన్‌ పీఠం మీద ఆశీనులైన వారి వ్యవహార సరళి ఎన్నికల కమిషన్‌ కూడా మోదీ హయాంలో ఆయన మాట జవదాటలేదని రుజువవుతోంది. మొన్నటికి మొన్న అరుణ్‌ గోయల్‌ పదవీ కాలం దాదాపు రెండేళ్లు ఉండగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయనకు రుజువర్తన కలిగిన ప్రభుత్వాధికారి అన్న పేరుంది. ఆయన రుజువర్తనకు ఎన్నికల కమిషన్‌లో అవకాశం లేదేమోనన్న అనుమానం కలుగుతోంది. అంతకు ముందే ముగ్గురు కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారు. గోయల్‌ రాజీనామాతో రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు. ఒక కమిషనర్‌ ఉద్యోగ విరమణ చేసినా ఆయన స్థానంలో మరొకరిని నియమించడం గంటల్లో అయ్యే పనికాదు. కానీ గంటల్లో తమకు నచ్చిన వారిని ఎన్నికల కమిషనర్‌ స్థానంలో కూర్చో పెట్టగలమని గోయల్‌ను నియమించినప్పుడే మోదీ నిరూపించారు. ఆయన కాస్తా జారుకున్నారు. ఆయన స్థానంలో నియమితుడైన కమిషనర్‌ నియామకానికి విధిగా పాటించవలసిన విధానాన్ని పాటించారా అన్న అనుమానం రాక మానదు. ఎన్నికల ఉత్తర్వు జారీ చేయాల్సి ఉన్నందువల్ల ఇద్దరు కమిషనర్లను మోదీ ప్రభుత్వం హడావుడిగా నియమించేసింది. అంటే అనుసరించవలసిన విధి విధానాలను పట్టించుకోలేదనుకోవాలి. ఈ అంశం కూడా సుప్రీంకోర్టు కెక్కింది. ఎన్నికల కమిషన్‌ నడవడిక ప్రశ్నార్థకం అయింది కనకే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి మోదీ స్వయంగా నైతిక ప్రవర్తనా నియమావళిని ఏకరువు పెడ్తూ అనేక మంది ఫిర్యాదులు చేశారు. కానీ ఎన్నికల కమిషన్‌ చూపు ఈ ఫిర్యాదుల మీద సోకిన దాఖలాలూ లేవు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తరవాత రాహుల్‌ గాంధీని విమర్శించడం కోసం మోదీ బాహాటంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగిసిన తరవాత ముంబైలోని శివాజీ పార్కులో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో రాహుల్‌ గాంధీ వచ్చే ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్నవి కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న ‘‘శక్తి’’కి వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలు అన్నారు. అంతే మోదీకి రాహుల్‌ మీద విరుచుకు పడడానికి కావలసిన ముడి సరుకు దొరికింది. రాహుల్‌ వాడిన మాట ఆంతర్యం దుష్ట శక్తి అయితే మోదీ దాన్ని సునాయాసంగా హిందూ మతానికి అంటగట్టారు. మాతృ శక్తి, నారీ శక్తి లాంటి మాటలు సునాయాసంగా దొర్లించేశారు. రాహుల్‌ స్త్రీ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నట్టుగా ‘‘శక్తి’’ అన్న మాట కాళ్లు, కీళ్లు విరిచేశారు. తాను మహిళలను ఎంతగా ఆరాధిస్తానో, శక్తి అన్న మాటకు హిందూ మతంలో ఉన్న విశిష్టత గురించి మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. ఇలా మాట్లాడడం, మతపరమైన అంశాలను ప్రస్తావించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడేమేనని బాధ్యతగల పౌరుడు, కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిలో పనిచేసిన ఇ.ఎ.ఎస్‌. శర్మ ఎన్నికల కమిషనర్లు ముగ్గురికీ ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. పట్టించుకున్న నాథుడే ఉన్నట్టు లేడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img