Monday, May 20, 2024
Monday, May 20, 2024

బద్దలైన అమిత్‌ షా అబద్ధాల పుట్ట

సాధారణంగా కోర్టుల తీర్పులు, ఆదేశాల మీద ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారు ఉండరు. కోర్టు తీర్పులను సవాలు చేయొచ్చు. కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లొచ్చు. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు చాలా నిక్కచ్చిగా వ్యవహరించింది. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల బాండ్లను రద్దు చేయడంవల్ల నల్లధనం పడగ విప్పుతుందంటున్నారు. అంటే అత్యున్నత న్యాయస్థానం తీర్పునే ఖండిస్తున్నారు. బాండ్ల వివరాలు అందించడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.బి.ఐ.) మొరాయించింది. వచ్చే జూన్‌ 30 నాటికి కానీ వివరాలు అందించలేమని సుప్రీంకోర్టు ఆదేశించిన గడువు తీరడానికి ఒకటి రెండు రోజుల ముందు మరింత గడువు కావాలని అర్జీ పెట్టుకుంది. సుప్రీంకోర్టు ససేమిరా అనడంతో ఒక విడత కొంత సమాచారం అందించింది. కానీ ఏ బాండ్లు ఏ పార్టీకి అందాయో చెప్పలేదు. మళ్లీ సుప్రీంకోర్టు గట్టిగా గద్దిస్తే ఆ వివరాలూ బయట పెట్టింది. సమాచారం అందించడానికి 136 రోజుల గడువు కావాలని కోరిన ఎస్‌.బి.ఐ. రెండు మూడు రోజుల్లోనే ఈ సమాచారం అంతా వెల్లడిరచవలసి వచ్చింది. అంటే అంత సమాచారాన్ని అందించే సామర్థ్యం ఎస్‌.బి.ఐ.కి ఉంది. కానీ జూన్‌ 30 దాకా గడువు కోరడంలో మతలబు లేకపోలేదు. ఈ లోగా ఎన్నికలు ముగుస్తాయి కనక అప్పటిదాకా ఎన్నికల బాండ్ల వివరాలను తొక్కి పెట్టి మోదీ సర్కారును వెనకేసుకు రావాలనుకుంది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశం అమలైంది. నల్ల ధనాన్ని అదుపు చేయడానికి ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టామన్న మోదీ సర్కారు కూట వాదం సుప్రీంకోర్టు జోక్యంతో దూదిపింజల్లా ఎగిరిపోయింది. రాను రాను ఎన్నికల వ్యయాన్ని భరించడం రాజకీయ పార్టీలకు చాలా భారం అయిపోతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఖరీదైనవంటున్నారు. ఎన్నికల బాండ్లపై ఓ పక్క సుప్రీంకోర్టు విచారిస్తుండగానే మోదీ ప్రభుత్వం ఇటీవల మరోసారి ఎన్నికల బాండ్లు జారీ చేసింది. బాండ్లు ముద్రించడానికి అయిన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి భరించారు. అంటే రాజకీయ పార్టీలకు బాండ్లు కొనివ్వడానికి అయ్యే ఖర్చును ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఖర్చు పెట్టడం వింతల్లో కెల్లా వింత. రాజకీయ పార్టీలకు 2018 నుంచి మొన్నటి దాకా నిధులు సమకూరింది కేవలం ఎన్నికల బాండ్ల ద్వారా మాత్రమే కాదు. ఇంకా కొన్ని ట్రస్టులూ ఉన్నాయి. నగదు రూపంలో కూడా జనం రాజకీయ పార్టీలకు విరాళాలు అందించవచ్చు. ఎన్నికల బాండ్ల రూపంలోనే రాజకీయ పార్టీలకు డబ్బు అందలేదు. మన దేశంలో వందలాది రాజకీయ పార్టీలున్నా బాండ్ల ద్వారా విరాళాలందింది కేవలం 20 పార్టీలకే. ఎన్నికలలో పోటీ చేయడానికే కాదు రాజకీయ పార్టీలను నడపడానికి కూడా బోలెడు డబ్బు కావాలి. శక్తి మేరకు రాజకీయ పార్టీలు ఏదో ఓ రూపంలో సమకూర్చు కుంటున్నాయి. ఇలా సమకూర్చుకోవడం ఎంత చెట్టుకు అంత గాలి అన్న రూపంలో సాగుతోంది.
వీటన్నింటినీ పక్కన పెట్టి ఇటీవల కేంద్ర హోం మంత్రి అంతి షా ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడిన అబద్ధం ఆడకుండా మాట్లాడారు. ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం దాదాపు 20,000 కోట్లు సమకూరితే బీజేపీకి అందింది కేవలం 6,000 కోట్లే అని బుకాయించారు. మిగతా 19 పార్టీలకు మిగిలిన 14,000 కోట్లు అందినప్పుడు ఇంకా ఏడుపు ఎందుకు అని కూడా ప్రశ్నించారు. నిజానికి బీజేపీకి అందింది ఆరు వేల కోట్లు కాదు. ఆ మొత్తం 8,252 కోట్ల రూపాయలు. అంటే బాండ్ల రూపంలో అందిన మొత్తంలో బీజేపీకి 50.03 శాతం నిధులు సమకూరాయి. వివిధ రూపాలలో బీజేపీకి అందిన మొత్తం రూ.12,930 కోట్లు. బీజేపీకి 303 మంది లోక్‌సభ సభ్యులున్నందువల్ల కాస్త ఎక్కువ డబ్బు అంది ఉండొచ్చునని అమిత్‌ షా వాదిస్తున్నారు.
కానీ బీజేపీకి 2019లో వచ్చిన ఓట్లు 38 శాతం దాటలేదు. తమ సభ్యులు పోగా మిగతా 242 మంది సభ్యులున్న ఇతర పార్టీలకు 14 వేల కోట్లు అందాయిగా అని అమిత్‌ షా అంటున్నారు. బీజేపీకి లోక్‌సభలో ఆధిపత్యం ఉండొచ్చు. కానీ అనేక రాష్ట్రాలలో ఇతర పార్టీల ప్రభుత్వాలున్నాయి. ఆ పార్టీలకు లోక్‌సభ సభ్యులున్నారు. శాసనసభ్యులూ ఉన్నారు. బీజేపీకి పడని ఓట్లు 62 శాతం పైగా ఉన్నాయి. బాండ్ల రూపంలో అందింది ప్రజాప్రతినిధుల సంఖ్యనుబట్టి కాదు. ఈ వాస్తవాన్ని అమిత్‌ షా ప్రస్తావించరు. ఇది కాక నగదు రూపంలో విరాళాలిచ్చేవారూ ఉంటారు. బీజేపీకే కాదు ఏ రాజకీయ పార్టీకైనా అందిన విరాళాల మొత్తాన్ని కచ్చితంగా చెప్పడానికి మార్గమేలేదు. ఎన్నికల బాండ్లు చట్టబద్ధం కాదని, రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పైగా నల్ల ధనాన్ని అరికట్టడానికి బాండ్లు ఒక్కటే మార్గం కాదనీ ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయని తేల్చి చెప్పింది.
కానీ అమిత్‌ షా మాత్రం ఈ తీర్పునే తప్పుపడ్తున్నారు. ఈ బాండ్లవల్ల నల్ల ధనం బెడద తప్పేదంటున్నారు. బాండ్లు రద్దు చేశారు కనక మళ్లీ నల్లధనం పడగెత్తుతుందని వాదిస్తున్నారు. అంటే ఆయన నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయాన్నే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి బీజేపీ అనేక మార్గాలు అనుసరించింది. అనేక కంపెనీల మీద ముందు దాడులు చేయించింది. ఆ తరవాత ఆ కంపెనీలు బాండ్లు సమర్పించి బీజేపీని ప్రసన్నం చేసుకున్నాయి. అనేక బూటక కంపెనీలూ బాండ్లు కొన్నాయి. వాటిలో ఎక్కువ మొత్తం బీజేపీకే అందింది. ఔషధాలు తయారు చేసే ఏడు కంపెనీలు ఔషధ ప్రమాణాల పరీక్షలో విఫలమైనాయి. అవీ బాండ్ల ద్వారా విరాళాలు సమర్పించుకున్నాయి. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ రీతిలోనే వ్యాపారస్థుల మీద దాడులు చేశాయి. ఆ తరవాతే ఆ వ్యాపారస్థులు బాండ్లు సమర్పించారు. బీజేపీ దాడులకు భయపడి బాండ్ల రూపంలో నిధులు సమకూర్చిన కంపెనీలు వందలాదిగా ఉన్నాయి. వ్యాపార వర్గాలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం కొత్తేమీ కాదు. ఈ రూపంలో అధికారంలో ఉన్న పార్టీలను సంతృప్తి పరచడంలో వ్యాపరస్థులూ ఆరితేరి పోయారు. కాంట్రాక్టులు సంపాదించిన వారూ నిధులు అందిస్తారు. నల్ల ధనం ఇంతకు ముందూ ఉంది. ఇప్పుడూ ఉంది. బూటకపు వాగ్దానాలు చేసే బీజేపీ అండతో ఇది మరింత పెరుగుతూనే ఉంటుంది. నల్లధనం మూలాలను నరికేసే ఉద్దేశం బీజేపీకి ఏ కోశానా లేదు. అందులో ఎక్కువ వాటా తమకే దక్కాలనుకుంటుంది. బంగారు బాతు గుడ్లు పెట్టే బాండ్లు పోయాయన్న చింత బీజేపీని వేధిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img