Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒకడుగు ముందుకు

మహిళా మల్ల యోధుల ఉద్యమం పరిష్కారం అయిన జాడలు లేకపోయినా దాదాపు 38 రోజులుగా వీరి ఉద్యమాన్ని ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం లొంగిరాక తప్పలేదు. మల్లయోధుల ఉద్యమం ఏ పరిష్కారం లేకుండానే అర్థాంతరంగా ఆగిపోయిందా, వారు మోస పోయారా అన్న ప్రశ్నలు చెలరేగాయి. శనివారం రాత్రి పొద్దుపోయిన తరవాత సాక్షీ మాలిక్‌, బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగాట్‌, సత్యవ్రత్‌ కడియాన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గంటకు పైగా చర్చించారు. అయితే ఈ చర్చల్లో ఏం జరిగిందో బయటకు చెప్పకూడదని అమిత్‌ షా కోరారట. అందువల్ల ఈ చర్చలలో అడుగు ముందుకు పడలేదన్న సంకేతాలైతే వచ్చాయి కాని అవాంతరం ఎక్కడ ఎదురైందో తెలియలేదు. ఆ తరవాతి సోమవారం రోజు మల్ల యోధులు రైల్వేలో తమ విధుల్లో చేరిపోయారు. ఈ పరిణామాలన్నీ మల్ల యోధుల సమ్మె ఆగిపోయిందా, నిలిచి పోయిందా అన్న అనుమా నాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే బహరంగ్‌ పునియా బుధవారం ఉద్యమం ఆగలేదని, మహిళా మల్ల యోధులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ మీద చర్య తీసుకోవాలన్న తమ డిమాండులో మార్పు ఏమీలేదని బజరంగ్‌ పునియా ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నిచెప్పినా మల్లయోధుల ఉద్యమంపై అనుమానాల క్రీనీడలు మాత్రం పరుచుకున్నాయి. ఈ లోగా మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మరోసారి చర్చలకు రావాలని నిరసన తెలియజేస్తున్న మల్ల యోధులను కోరారన్న వార్త పొక్కింది. దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ మంగళవారం అర్థరాత్రి తరవాత క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చర్చలకు రావాలని ట్విట్టర్‌లో మల్ల యోధులను ఆహ్వానించారు. ఆ మేరకు బుధవారం అనురాగ్‌ ఠాకూర్‌తో చర్చలు జరిగాయి. అవీ పరిష్కారం కుదరడానికి ఉపకరించినట్టు లేదు కానీ ప్రభుత్వం ఒక అడుగు దిగివచ్చి చర్చలకు సిద్ధపడితే మల్ల యోధులు కూడా చర్చలలో పాల్గొనడం ఒక అడుగు ముందుకు వేసినట్టే. చర్చలంటూ ప్రారంభం అయినాయి కనక త్వరలో ఈ సమస్య ఒక కొలిక్కి రావచ్చునన్న ఆశ లేకపోలేదు. ఇన్నాళ్లూ మల్లయోధుల ఉద్యమాన్ని ఎంతమాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే న్యాయమైన ఉద్యమాలనైనా పట్టించుకుని, సంప్రతింపుల ద్వారా పరిష్కరించాలన్న ధ్యాస మోదీ ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. మరీ అపఖ్యాతి పాలు అయిపోతామన్న భయం, లేదా సమీప భవిష్యత్తులో ఎక్కడైనా ఎన్నికలు జరగవలసి ఉంటే ప్రతికూల ప్రభావం తప్పదేమోనన్న భయం పీడిరచినప్పుడు మాత్రమే ఎన్ని మెట్లయినా దిగి తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నించడం ఈ ప్రభుత్వ లక్షణం. రైతుల ఉద్యమ సమయంలోనైతే 13 నెలలు మోదీ సర్కారు ఆ ఉద్యమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌ ఒకటి రెండు సార్లు చర్చలకు ముందుకొచ్చినా వివాదాస్పదమైన ఆ మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ తప్ప ఏ విషయమైనా చర్చిస్తామని భీష్మించడంవల్ల ఆ సంప్రదింపులు ఒక్క అంగుళం కూడా ముందుకు వేయలేదు. కానీ ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు ముందు మోదీ స్వయంగా వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకుంటామని చెప్పడమే కాదు రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.
మల్ల యోధుల పోరాటంలో అలాంటి పరిణామాలకు అవకాశం లేదు కానీ మే 28వ తేదీన మల్లయోధుల విషయంలో దిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు, శాంతియుతంగా నూతన పార్ల మెంటు వేపు వెళ్తున్న వారిని రోడ్డుమీద నుంచి ఈడ్చుకెళ్లి, పోలీసు వ్యాన్లలో కుక్కడం తీవ్ర నిరసనకు దారితీసింది. అంతర్జాతీయ క్రీడా సంస్థలు, అంతర్జాతీయ ఒలంపిక్‌ సంఘం కూడా ఈ దౌర్జన్యాన్ని తీవ్రంగా నిరసించాయి. స్వదేశంలో పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా విదేశాల్లో తనకు బ్రహ్మరథం పడుతున్నారని నిరూపించడానికి నానా తంటాలు పడ్తున్న మోదీకి ఇలాంటి విమర్శలు ఇబ్బందికరంగానే ఉంటాయి. అందుకే మొదట అమిత్‌ షాను చర్చలకు పురమాయించినట్టున్నారు. తరవాత క్రీడల శాఖమంత్రి చర్చించారు. బజరంగ్‌ పునియా, సాక్షీ మాలిక్‌ బుధవారం మధ్యాహ్నం క్రీడా శాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తో చర్చలకు హాజరయ్యారు. మల్ల యోధుల ఉద్యమంలో అందరికన్నా ఎక్కువ క్రియాశీలంగా కనిపించిన వినేశ్‌ పోఘాట్‌ మాత్రం తొలి విడత అమిత్‌ షాతో చర్చల్లోనూ, బుధవారం అనురాగ్‌ ఠాకూర్‌తో సంప్రదింపుల్లోనూ ఎక్కడా కనిపించలేదు. ఆమె ముందే నిర్ణయమైన కార్యక్రమం ప్రకారం పంచాయత్‌ సమావేశానికి హాజరవడానికి వెళ్లారంటున్నారు. అనురాగ్‌ ఠాకూర్‌తో చర్చించినప్పుడు మల్ల యోధులు ప్రధానంగా అయిదు డిమాడ్లు ముందుంచారు. మల్ల యోధుల సంఘాల సమాఖ్యకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని, ఒక మహిళను ఈ సమాఖ్య అధ్యక్ష స్థానంలో నియమించాలన్నది వీరి ప్రధానమైన కోరిక. అలాగే నూతన పార్లమెంటు భవనం ప్రారంభమైన రోజున పంచాయత్‌ నిర్వహించడానికి తాము వెళ్తున్న సందర్భంగా తమపై నమోదైన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసం హరించుకోవడం రెండో కోరిక. అలాగే బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలన్న డిమాండును పునరుద్ఘాటించారు. ఇదొక్కటే తమ పార్టీ నేతలు ఎంత పెద్ద తప్పుచేసినా వారిని వెనకేసుకు వచ్చే విధానాన్ని మోదీ సర్కారు అనుసరిస్తోంది కనక ఎలాంటి వైఖరి అనుసరిస్తోందో తెలియదు. మల్ల యోధుల ఇతర డిమాండ్లను అంగీకరించడానికి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ను అరెస్టు చేయడం బీజేపీ ప్రతిష్ఠకు సంబ ంధించిన అంశం. ఇన్నాళ్లూ ప్రభుత్వం మల్ల యోధుల నిరసనను పట్టించుకోకపోవడానికి ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కుస్తీ పోటీల్లో పతకాలు సంపాదించిన వారిని గౌరవించాలన్న ధ్యాస మోదీ సర్కారుకు లేదు. అహంకారమే తమ బలం అన్న భ్రమలో మోదీ సర్కారు ఉంది. జనం సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం పంతం కొద్ది కాలం కొనసాగ వచ్చునేమో కానీ అంతిమంగా ప్రభుత్వాన్నే దెబ్బ తీస్తుంది. ఇప్పటిదాకా సాధించిన ఎన్నికల విజయాలు మోదీని ఈ వాస్తవం గుర్తించడానికి నిరాకరించేలా చేశాయి. ఏడాది ఆఖరులోగా జరగ వలసిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్నిబట్టి చూస్తే బీజేపీ జారుడు మెట్ల మీదే ఉంది. అందువల్ల ఏదో ఒక రకంగా జటిల సమస్యలు పరిష్కరించడం అనివార్యం అన్న అభిప్రాయం మోదీ సర్కారుకు కలిగి ఉండొచ్చు. మల్ల యోధుల సమస్యను తెగలాగడం రెండు పక్షాలకూ చేటే చేస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img