Friday, April 26, 2024
Friday, April 26, 2024

కశ్మీర్‌ జడ్జీ నియామకానికి మోకాలు అడ్డుతున్న కేంద్రం

కశ్మీర్‌ హైకోర్టులో 17 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ 11 మంది న్యాయమూర్తులే ఉన్నారు. కశ్మీర్‌లో ఏ విచారణా లేకుండానే ముందు జాగ్రత్తగా జరిగే నిర్బంధాలు కొల్లలు. ఈ నిర్బంధాలను రద్దు చేయాలని 250 మందికి పైగా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు పెట్టుకున్నారు. కానీ న్యాయమూర్తులు తగినంత మంది లేనందువల్ల హెబియస్‌ కార్పస్‌ రిట్లను విచారించడానికి ఇద్దరే న్యాయమూర్తులను కేటాయించారు. న్యాయమూర్తుల మీద పని భారం అపారం. అయినా న్యాయమూర్తుల నియామకం మీద శ్రద్ధ లేదు. జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టుకు గీతా మిత్తల్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 2019లో రెండుసందర్భాలలో న్యాయమూర్తుల నియామకానికి ఏడుగురి పేర్లు సుప్రీంకోర్టు కొలీజియంకు ప్రతిపాదించారు. ఆ సమయంలో ఒక్కరినీ నియమించలేదు. కథ అక్కడితో ముగియలేదు. 2019 అక్టోబర్‌ 15న అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నాయకత్వంలోని కొలీజియం మోక్ష ఖజురియా-కాజ్మీ, రాజేశ్‌ ఓస్వాల్‌ పేర్లను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. న్యాయవాది అయిన మోక్ష ఖజురియా-కాజ్మీని న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తిప్పి పంపింది. రెండేళ్ల కాలంలో జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం ఇది నాల్గవ సారి. ఖజూరియా నియామక ప్రతిపాదనను నిరాకరిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆ ఫైలును కొలీజియంకు తిప్పి పంపింది కానీ కారణమేమిటో చెప్పలేదు. ఖజూరియా-కాజ్మీ సీనియర్‌ న్యాయవాది. 2016లో జమ్మూ-కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన కొనసాగినప్పుడు ఆమె అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా కూడా పని చేశారు. ఆ తరవాత మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పి.డి.పి.-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆమె అదే బాధ్యతల్లో కొనసాగారు. ఆ తరవాత ఆమెను ఆ స్థానం నుంచి తొలగించారు. విచిత్రం ఏమిటంటే 2019 మార్చిలో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నలుగురు న్యాయవాదులను న్యాయ మూర్తులుగా నియమించాలని ప్రతిపాదించినప్పుడు ఓస్వాల్‌, జావేద్‌ ఇక్బాల్‌ వని, రాహుల్‌ భారతితో పాటు ఖజూరియా – కాజ్మీ పేరు కూడా సుప్రీంకోర్టు కొలీజియంకు పంపించారు. 2019 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కొలీజియం మొదట ఖజూరియా-కాజ్మీ, ఓస్వాల్‌ పేర్లను పరిశీలించింది. 2019 జనవరిలో వనీ పేరును, 2021 మార్చి 2న రాహుల్‌ భారతి పేర్లను పరిగణనలోకి తీసుకుంది. వనీని 2020 జూన్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. భారతికి సంబంధించిన ఫైలు ఇప్పటికీ కేంద్రం దగ్గరే మూలుగుతోంది. ఖజూరియా-కాజ్మీ పేరును కొలీజియం సిఫార్సు చేసిన తరవాత జడ్జీలైన వినోద్‌ కౌల్‌, సంజయ్‌ ధార్‌, పునీత్‌ గుప్తాను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన మరో ముగ్గురు న్యాయవాదులైన సాదిఖ్‌ నర్గల్‌, నజీర్‌ అహమద్‌ బేగ్‌, షౌకత్‌ అహమద్‌ మర్కూను న్యాయమూర్తులుగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. 2018 ఏప్రిల్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్‌, గోగోయ్‌తో కూడిన కొలీజియం నలుగురు న్యాయమూర్తులు లేదా న్యాయాధికారుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. అప్పుడు న్యాయవాది సింధు శర్మ, న్యాయాధికారి రషీద్‌ అలీ ధార్‌తో పాటు నర్గల్‌, బేగ్‌, మక్రూ పేర్లను కూడా ప్రతిపాదించింది. వీరిలో ధార్‌, శర్మను మాత్రమే న్యాయమూర్తులుగా నియమించారు. మిగతా ముగ్గురి పేర్లను అప్పుడు కూడా కేంద్రం తిప్పికొట్టింది. ఇందులో మరో తిరకాసు ఉంది. 2019 జనవరిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ నాయకత్వంలోని కొలీజియం జమ్మూ-కశ్మీర్‌ మాజీ సీనియర్‌ అదనపు అడ్వోకేట్‌ జనరల్‌ పేరు సిఫార్సు చేయడాన్ని వాయిదా వేసింది. నర్గల్‌ పేరును ఏ ప్రాతిపదికన సిఫార్సు చేశారో నిర్దిష్టమైన సమాచారం ఇవ్వాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. బేగ్‌, మక్రూ పేర్లను మాత్రం ఏ కారణం చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు.
న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. ఎవరినైనా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేయదలచుకుంటే ఆ ప్రక్రియను ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే మొదలు పెడ్తారు. ఆ ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్‌కు కూడా పంపిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు కూడా పంపిస్తారు. గవర్నర్‌ సిఫార్సుతో పాటు గూఢచార శాఖ నివేదికలతో సహా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు కొలీజియం ముందుంచుతుంది. అంతిమ నిర్ణయం కొలీజియం తీసుకుని రాష్ట్రపతికి నియామక ఉత్తర్వుల కోసం పంపుతుంది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం కనక ఎవరి పేరునైనా ఆమోదించకపోతే మళ్లీ ఆ ఫైలును కొలీజియంకు పంపుతుంది. అప్పుడు కొలీజీయం తన సిఫార్సులను పునః పరిశీలించవచ్చు లేదా మళ్లీ మార్చకుండా అవే పేర్లను ప్రతిపాదించవచ్చు. అప్పుడు ప్రభుత్వం అంగీకరించక తప్పదు. జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టులో 17 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇందులో 13 మంది శాశ్వత న్యాయమూర్తులైతే నలుగురు అదనపు న్యాయమూర్తులు. అయితే ప్రస్తుతం జమ్ము-కశ్మీర్‌ హైకోర్టులో ఉన్నది 11 మంది న్యాయమూర్తులే. అంటే మరో ఆరు ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది. తాము పంపిన సిఫార్సుల మీద ఏ నిర్ణయమూ తీసుకోకుండా ప్రభుత్వం సాచివేత ధోరణి అనుసరించడం ఆందోళన కలిగిస్తోందని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బోబ్డే, న్యాయమూర్తులు ఎస్‌.కె.కౌల్‌, సూర్యకాంత్‌తో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. ఇంకా ఆశ్చర్యకరమైంది ఏమిటంటే మోక్ష ఖజూరియా-కాజ్మీ పేరును కొలీజియం ప్రతిపాదించిన 22 నెలలకు గానీ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించలేదు. రంజన్‌ గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కశ్మీర్‌కు సంబంధించిన పిటిషన్లను విచారిస్తున్న క్రమంలో అప్పటి జమ్మూ- కశ్మీర్‌ ప్రధాన న్యాయమూర్తి మిత్తల్‌ను హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విచారణల పరిస్థితి ఏమిటి అని వాకబు చేశారు. విచారణలో తాత్సారం తీవ్రమైన అంశమని అవసరమైతే తానే వెళ్లి పరిస్థితి తెలుసుకుంటాననీ అన్నారు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నప్పుడు విచారణ కచ్చితంగా నత్త నడకే నడుస్తుంది. న్యాయమూర్తులను ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వమే నియమించేది. కానీ ఇందిరా గాంధీ హయాంలో న్యాయమూర్తుల నియామకంలో అవకతవకలు, పక్షపాత ధోరణి ఉంటోందన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో న్యాయమూర్తులుగా ఎవరిని నియమించాలన్న బాధ్యతను సుప్రీంకోర్టే చేపట్టింది. దాని కోసమే కొలీజియం ఏర్పాటు చేశారు. అయినా విమర్శలు వస్తూనే ఉన్నాయి. జమ్ము-కశ్మీర్‌లో న్యాయమూర్తుల నియామకం మీద మోదీ ప్రభుత్వం అంత పట్టుదలగా ఎందుకుందో అంతుపట్టని వ్యవహారమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img