Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాంగ్రెస్‌లో తెమలని అంతః కలహాలు

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అంతః కలహాలను పరిష్కరించే శక్తి నాయకత్వం కోల్పోయినట్టుగా ఉంది. పంజాబ్‌, ఛత్తీస్‌ గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తల బొప్పి కట్టిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ వేరుకుంపట్లు ఉన్నాయి. అయితే వాటి తీవ్రతలో తేడాలు ఉండవచ్చు. రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌కు సచిన్‌ పైలెట్‌కు మధ్య సఖ్యత లేదు. అనునయింపులేవీ సచిన్‌ పైలెట్‌కు సంతృప్తి కలిగించడం లేదు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహమద్‌ పటేల్‌ ఉన్నంత కాలం ఇలాంటి వ్యవహారాలు పరిష్కరించే వారు. ఇప్పుడు సోనియా గాంధీకి అలాంటి వారెవరూ ఉన్నట్టు కనిపించడం లేదు. పరస్పరం కలహించుకుంటున్న కాంగ్రెస్‌ వర్గాల నాయకులు కాంగ్రెస్‌ అధినాయకులు అనుకుంటున్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ చుట్టు తిరుగుతున్నారు. అయినా ఈ అధిష్ఠానత్రయం ఏ వర్గాన్నీ శాంతింప చేయలేకపోతోంది. పంజాబ్‌లో వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్నిలలో కాంగ్రెస్‌కు విజయావకాశాలున్నాయి. కానీ ఇంటిపోరు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌కు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమరేంద్ర సింగ్‌ మీద అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధూ పోరు పడలేక అధిష్ఠానం ఆయనకి పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానం కట్టబెట్టింది. అయినా సిద్ధూ ముఖ్యమంత్రి మీద దాడి ఆపడం లేదు. ఆయనే కాకుండా ఆయన సలహాదారులు కూడా అనుచిత వ్యాఖ్యల ద్వారా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానం కట్టబెట్టిన తరవాత వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఎన్నికలు అమరేంద్ర సింగ్‌ నాయకత్వంలోనే జరుగుతాయి అని అధిష్ఠానం స్పష్టంగా చెప్పినా సిద్ధూ విమర్శలు ఆపడం లేదు. సిద్ధూ అత్యుత్సాహం, ఆత్రుత ఒక వేపుÑ తానే సర్వస్వం అనుకుంటున్న అమరేంద్ర సింగ్‌ ధోరణిÑ ఆం ఆద్మీ పార్టీ పంజాబ్‌లో క్రమంగా పుంజుకుంటున్న తీరు వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పరిస్థితిని అగమ్య గోచరంగా మారుస్తున్నాయి. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పుడు సిద్ధూ కనక తన మీద చేసిన అనుచిత విమర్శలకు క్షమాపణ చెప్తే తనకేమీ అభ్యంతరం లేదని అమరేంద్ర సింగ్‌ అన్నారు. కానీ సిద్ధూ ఆ పని చేయనే లేదు. అత్యవసరంగా అమరేంద్ర సింగ్‌ను గద్దె దించి తనకు పంజాబ్‌ ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలన్నది సిద్ధూ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. అధిష్ఠానం హామీ ఇచ్చిన తరవాత కూడా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో నిరూపించుకోవలసిన విపరీత పరిస్థితి కొనసాగుతోంది. గురువారం చండీగఢ్‌లో జరిగిన కాబినెట్‌ సమావేశానికి ముగ్గురు మంత్రులు హాజరు కాలేదు. తన బలమేమిటో రుజువు చేసుకోవడానికి అమరేంద్ర సింగ్‌ మంత్రివర్గ సభ్యుడు రాణా గుర్మీత్‌ సింగ్‌ ఇంట్లో విందు ఏర్పాటు చేయవలసి వచ్చింది. దీనికి 50 మంది శాసనసభ్యులు, ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారంటున్నారు. తిరుగుబాటు మంత్రుల్లో ఒక్క చరన్‌ జిత్‌ సింగ్‌ చెన్నీ మాత్రమే మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. పైగా తిరుగుబాటు వర్గానికి చెందిన త్రిప్త్‌ రాజేందర్‌ బజ్వా, సుచ్‌ జిందర్‌ సింగ్‌ రణ్‌ ధావా, సుఖ్బిందర్‌ సింగ్‌ సర్కారియా గురువారం నాడు అధిష్ఠానాన్ని కలవడానికి దిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ను తొలగించాలన్నది వీరి కోరిక. గత శాసనసభ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమరేంద్ర సింగ్‌ నెరవేర్చలేదు కనక ఆయన కొనసాగితే వచ్చే ఎన్నికలలో గెలవడం అసాధ్యమని వీరి వాదన. మల్విందర్‌ సింగ్‌ మాలి లాంటి సిద్ధూ సలహాదారులు భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు కశ్మీర్‌ను అక్రమించాయి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా రాహిత్యానికి పరాకాష్ఠ. ఈ సలహాదార్లను తొలగించాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాలు పర్యవేక్షించే హరీశ్‌ రావత్‌ హెచ్చరించినా సిద్ధూలో చలనం కనిపించడం లేదు. కశ్మీర్‌ విషయంలో సిద్ధూ సలహాదార్లు చేసిన వ్యాఖ్యలు పంజాబ్‌ సుస్థిరతకే కాక దేశ భద్రతకు కూడా ప్రమాదకరమైనవి. పాకిస్తాన్‌, కశ్మీర్‌ విషయంలో మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరికి పూర్తి వ్యతిరేకమైనవి. ఇలాంటి వ్యాఖ్యలు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను తూర్పార బట్టడానికి బీజేపీకి మంచి ముడిసరుకుగా ఉపకరిస్తాయి.
గత ఎన్నికలలో ఛత్తీస్‌ గఢ్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అయినా అక్కడ ముఖ్యమంత్రి భూపేశ్‌ బగేల్‌ కూడా తీవ్రమైన అసమ్మతి ఎదుర్కోక తప్పడం లేదు. బగేల్‌కు మద్దతిస్తున్న 55 మంది ఎమ్మెల్యేలు దిల్లీ వెళ్లి ముఖ్యమంత్రికి ఎంత బలం ఉందో నిరూపించే ప్రయత్నం చేశారు. రాహుల్‌ గాంధీ రమ్మన్నారు కనకే మేము దిల్లీ వచ్చాం అని ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి బగేల్‌ చెప్పారు. బగేల్‌ మంత్రివర్గ సభ్యుడు టి.ఎస్‌. సింగ్‌ దేవ్‌ అసమ్మతివర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఛత్తీస్‌ గఢ్‌లో మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు రెండున్నర సంవత్సరాలు బగేల్‌ ముఖ్యమంత్రిగా ఉంటే మిగతా రెండున్నర సంవత్సరాలు సింగ్‌ దేవ్‌ ఆ పదవిలో ఉండాలని ఒప్పందం కుదిరిందట. 2018లో తనకు ఈ హామీ ఇచ్చారని, బగేల్‌ రెండున్నరేళ్ల కాలం జూన్‌లో ముగిసింది కనక ఆయనను తొలగించాలన్నది సింగ్‌ దేవ్‌ వాదన. బగేల్‌, సింగ్‌ దేవ్‌ కూడా గత మంగళవారం రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. తన బలం నిరూపించుకోవడానికి బగేల్‌ రాయపూర్‌ తిరిగొచ్చి 55 మంది ఎమ్మెల్యేలతో పాటు దిల్లీ వెళ్లారు. సింగ్‌ దేవ్‌ మాత్రం ఈ వ్యవహారం తేలేదాకా దిల్లీలోనే ఉంటానని భీష్మించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో మొత్తం 90 స్థానాలలో 70 సీట్లను కైవశం చేసుకుని కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. బీజేపీకి 14 సీట్లు మాత్రమే దక్కాయి.
‘‘సోనియా గాంధీ లేదా రాహుల్‌ గాంధీ ఎప్పుడు తప్పుకోమంటే అప్పుడు తప్పుకోవడానికి సిద్ధం’’ అని బగేల్‌ అంటున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంత బలహీనం అయిపోయిందో అర్థం అవుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినప్పటికీ జనానికి కనిపించేది రాహుల్‌ గాంధీ మాత్రమే. కేరళ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించకపోవడంÑ బెంగాల్‌, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించకపోవడంవల్ల రాహుల్‌ రాజకీయ అధికారం చెలాయించే స్థితిలో లేరేమోననిపిస్తోంది. అందుకే స్థానిక నాయకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్‌ సంస్కృతి అంటే అంతఃకలహాలు, అసమ్మతి రాజకీయాలు మాత్రమే అన్న నిందను బలోపేతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img