Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేంద్రం ఉసిగొల్పే వేట కుక్క సీబీఐ

మోదీ సర్కారు తన చేతిలో ఉన్న అనేక వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మీద కసి తీర్చుకోవడానికి దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇలా కత్తిగట్టినట్టు ప్రవర్తించడం ఫెడరల్‌ విధానాలను ధ్వంసం చేయడమే. బెంగాల్‌ విషయంలో మోదీ సర్కారు అనుస రిస్తున్న వైఖరి మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమ రాష్ట్రంలో సీబీఐ కేసులు మోపడానికి అవసరమైన సాధారణ సమ్మతిని బెంగాల్‌ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ బెంగాల్‌లో సీబీఐ దాడులు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఏకపక్షంగా కేసులు మోపడాన్ని నిరోధించేట్టు ఆదేశించాలని బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది. రాజ్యాంగంలోని 131వ అధికరణం కింద ఈ కేసు దాఖలైంది. ఈ అధికరణం కేంద్రానికి, రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య లేదా రాష్ట్రాలకు మధ్య ఉన్న వివాదాలకు సంబంధించిన కేసులను విచారించే అవకాశం సుప్రీంకోర్టుకు ఇస్తుంది. బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ నాయకత్వం లోని బెంచి ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసును సత్వరం విచారించా లని బెంగాల్‌ ప్రభుత్వం ఈ బెంచీని కోరింది. గత ఏప్రిల్‌-మే నెలల్లో బెంగాల్‌ శాసనసభకు ఎన్నికలు ముగిసిన తరవాత జరిగిన దౌర్జన్యకర సంఘటనలపై సీబీఐ కేసులు మోపి విచారించే అధికారాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. బెంగాల్‌కు సంబం ధించిన కేసులను తనంత తాను నమోదు చేయడానికి గతంలో ఉన్న సాధారణ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయినా సీబీఐ ఇష్టానుసారం కేసులు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నందువల్ల బెంగాల్‌ ప్రభుత్వం ఈ పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. మామూలు ఆనవాయితీ ప్రకారం శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోనివి. కానీ శాంతి భద్రతలకు సంబంధించిన సంఘటనలపై కూడా సీబీఐ యదేచ్ఛగా కేసులు నమోదు చేస్తూనే ఉంది. సీబీఐ కేసులు మోపడానికి అంతకు ముందున్న సాధారణ అనుమతిని 2018లోనే బెంగాల్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. పంజాబ్‌, కేరళ, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర కూడా ఇలాగే అనుమతి వెనక్కు తీసుకున్నాయి. అయినా సీబీఐ ధోరణి మారలేదు. మరోవేపు కోల్‌కతా హైకోర్టు ఎన్నికల అనంతరం జరిగిన దౌర్జన్యకర సంఘటనలపై కేసులు నమోదుచేసే అధికారాన్ని సీబీఐకి కట్టబెట్టింది. దీన్నే రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తోంది. 2020 మార్చిలో కోల్‌కతా హైకోర్టు కేసులు నమోదు చేయడానికి సీబీఐని అనుమతించింది. అప్పటి నుంచి బెంగాల్‌లో 12 కేసులు దాఖలైనాయి. ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో అనేకకోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై దాఖలుచేసిన కేసు కూడా ఈ జాబితాలోనే ఉంది. ఈ వ్యవహారంలో కేంద్రం అధీనంలోని ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ (ఇ.డి) డబ్బు అక్రమ చెలామణి ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈ బొగ్గు క్షేత్రాల వ్యవహారంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య మీద ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ కేసు దాఖలు చేసింది. తమ ఎదుట విచారణకు రావాలని బెనర్జీ దంపతులను ఇ.డి. ఆదేశించింది కూడా.
కాంగ్రెస్‌ హయాంలోని కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న వివిధ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి ప్రత్యర్థి రాష్ట్రాల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు మోపుతోందని ప్రధానమంత్రి కాకముందు నరేంద్ర మోదీ గొంతు చించుకుని అరిచేవారు. కానీ 2014లో ఆయన నాయ కత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత తాను ఇంతకు ముందు మోపిన ఆరోపణలను వాటంగా విస్మరించి మోదీ తానూ అదే బాటలో పయనిస్తున్నారు. అనేక విషయాల్లో మోదీ ఒక వేపు మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దుయ్యబడ్తూనే అదే పని చేయడం పరిపాటి అయి పోయింది. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి మోదీ ప్రభుత్వం అందుబాటులో ఉన్న సకల వ్యూహాలనూ అమలు చేస్తోంది. అన్ని రాజ్యాంగ ప్రమాణాలనూ తుంగలో తొక్కుతోంది. సీబీఐ, ఇ.డి., జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌.ఐ.ఎ.) లాంటి వ్యవస్థలన్నింటినీ మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే వినియోగిస్తోంది. ఇవన్నీ మోదీ చేతిలో పరిచారికలుగా మాత్రమే కాకుండా ప్రతిపక్షాలు అధి కారంలో ఉన్న రాష్ట్రాల మీదకు, రాజకీయ ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్ప గలిగే వేటకుక్కలుగా మారిపోయాయి. ఇందులో మమతా బెనర్జీ, ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌కు మరింత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా సరే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొక్కని అడ్డదారీ లేదు. బెంగాల్‌తో సహా అయిదు రాష్ట్రాల శాసనసభలకు గత ఏప్రిల్‌-మేలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయినా కరోనాను నిరోధించడానికి పాటించ వలసిన నియమ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా వేలాది మందిని పోగేసి మోదీ, అమిత్‌ షా లెక్కలేనన్ని బహిరంగ సభలు నిర్వ హించారు. కఠినంగా లాక్‌డౌన్‌ విధించవలసిన సమయంలో మమతా బెనర్జీని ఓడిరచడం కోసం విచ్చలవిడిగా ప్రవర్తించారు. అయినా వరసగా మూడవ సారి మమతా బెనర్జీ అధికారంలోకి రాకుండా నిరోధించడం సాధ్యం కాలేదు. పైగా తృణమూల్‌ కాంగ్రెస్‌ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి బీజేపీ నాయక ద్వయాన్ని బిత్తర పోయేట్టు చేసింది. ఇంకోవేపు రాష్ట్రాలకు పన్నుల ద్వారా సమకూరే రాబడిని కట్టడి చేయడానికి జి.ఎస్‌.టి. లాంటి చట్టాలను ఆమోదింప చేసింది బీజేపీనే. ఆ పార్టీ దుర్వినియోగం చేయని కేంద్ర సంస్థే లేదు. కేవలం రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనే కేంద్రం ఇలా వ్యవహరించడం లేదు. ఆ పార్టీలను బలహీనపరచడానికి, ఫిరా యింపులను ప్రోత్సహించడానికి కూడా కేంద్రం ఇవే పాచికలు ఉపయోగి స్తోంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొందరు ప్రతిపక్ష నాయకుల మీద సీబీఐని ఉసిగొల్పుతారు. వారు అవినీతికో, అక్రమానికో పాల్పడ్డారన్న అభి ప్రాయం ప్రజలలో ప్రబలేలా చేస్తారు. చివరకు ఆ నాయకులే బీజేపీలో చేరిపోతారు. ఆ తరవాత వారి మీద మోపిన కేసుల ఊసే వినిపించదు. ఎంతటి అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న వారైనా బీజేపీలో చేరితే పవిత్ర గంగానదిలో స్నానం చేసి పునీతులైనట్టే. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు కాంగ్రెస్‌ లోపాలను కొండంతలు చేసి చూపించి, ప్రజలను భయభ్రాంతులను చేసి, మంచి రోజులు వస్తాయని నమ్మించి అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే దారిలో నడుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img