Friday, April 26, 2024
Friday, April 26, 2024

గెహ్లాట్‌ కనికట్టు విద్య

రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజా స్వామ్యాన్ని నామరూపాలు లేకుండా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సిన సంకల్పం అనేక అవాంతరాల పాలవుతోంది. అక్టోబరు 17న కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరుగుతాయని తెలిసిన తరవాత సీనియర్‌ నాయకులు శశిథరూర్‌ పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటానని సోనియాగాంధీ చెప్పినప్పటికీ అధిష్ఠానం తరపున రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కావడం సమ్మతమే కానీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగాలను కున్నారు. అయితే, రాహుల్‌ గాంధీ ఒకే వ్యక్తికి ఒకే పదవి అని ప్రకటించ డంతో జోడు పదవుల్లో కొనసాగడానికి గెహ్లాట్‌ తన మద్దతుదారులు అయిన శాసనసభ్యులను పరోక్షంగా రంగంలోకి దించారు. ఆదివారం కాంగ్రెస్‌ అధిష్ఠానం తరపున రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ వెళ్లిన సీనియర్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మకెన్‌లకు అవరోధం ఎదురైంది. గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న 92మంది శాసన సభ్యులు ఆదివారం సాయంత్రం ఖర్గే, మకెన్‌ ఏర్పాటు చేసిన శాసనసభా పక్షం సమావేశానికి హాజరుకాలేదు. వారు శాసనసభ స్పీకర్‌ సీపీ జోషీ దగ్గరకు వెళ్లి తమ రాజీనామా లేఖలు అందజేశారు. వీటిని స్పీకర్‌ ఆమోదించలేదు. కానీ, గెహ్లాట్‌ స్థానంలో సచిన్‌ పైలెట్‌ను ముఖ్య మంత్రి స్థానంలో కూర్చోబెట్టాలన్న అధిష్ఠానం ఆలోచనకు ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఊహించని పరిణామం. గెహ్లాట్‌కు సచిన్‌ పైలెట్‌కు మధ్య ఎప్పటి నుంచో ఉప్పు`నిప్పు సంబంధమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను సచిన్‌ పైలెట్‌ ముఖ్యమంత్రి కాకూడదన్నది గెహ్లాట్‌ ఎత్తుగడ. ఇలాంటి వ్యక్తిని నమ్మి కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానం అప్పగించకూడదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు సోనియాగాంధీని గట్టిగా కోరారు. గెహ్లాట్‌ దక్షత గల రాజకీయ నాయకుడే. అయినా ఆయన మదిలో మెదిలే ఆలోచనలను పసిగట్టడం సులభం కాదు. జోడు పదవులమీద ఆశ కొద్ది ఆయన తనకు మద్దతు ఇచ్చే శాసనసభ్యులను లోపాయకారీగా ఉసిగొల్పి ఏమీ ఎరగనట్టు నటించారు. గెహ్లాట్‌ తండ్రి కనకట్టు విద్య (మేజిక్‌)లో నేర్పరి. చిన్నప్పుడు గెహ్లాట్‌ తండ్రితో కలిసి ఈ మ్యాజిక్‌ ప్రదర్శనల్లో పాల్గొన్నారు కూడా. ఆ విద్యనే ఇప్పుడు ఆయన ప్రదర్శించారు. దీనితో ఖంగుతినడం అధిష్ఠానం వంతైంది. విధిలేక అధిష్ఠానం ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. దిగ్విజయ్‌ సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌లాంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. నిజానికి సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానం మీద మక్కువ లేకపోలేదు. ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ తానూ పోటీ పడతానని చెప్పలేదు కానీ, పోటీ చేయడానికి ఏ మాత్రం విముఖత చూపలేదు. పైగా ఆయన చాలా కాలం నుంచి ఇందిరాగాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగానే మసలుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే కాకుండా కాంగ్రెస్‌ వ్యవహారాలు చక్కబెట్టవలసి వచ్చిన సందర్భాల్లోనూ అధిష్ఠానం ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే మెదిలారు.
మూడేళ్లుగా సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగు తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైన తరవాత రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన గత 7వ తేదీన భారత్‌ జోడో యాత్ర ప్రారంభించన తరవాతే 11 రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీలు రాహుల్‌ గాంధీ మళ్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తీర్మానాలు ఆమోదించినా, రాహుల్‌ మనసు మార్చుకోలేదు. పైగా కొంతకాలం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులే సోనియా గాంధీ కుటుంబానికి చెందనివారు కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉండాలని గట్టిగానే కోరారు. రాహుల్‌ సంసిద్ధంగా లేకపోవడం, సోనియా గాంధీ ఆరోగ్యం అంతంతమాత్రం కావడంతో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిపి, తామూ అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తామని సోనియా గాంధీ కుటుంబం చాటిచెప్పదలచుకుంది. అంతర్గత ప్రజా స్వామ్యాన్ని ధ్వంసం చేయడం సులభమే కానీ, పునరుద్ధరించడం అంత సులువైన పని కాదని, ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలిసొచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కచ్చితమైన ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించడం చాలా ప్రధానం. కానీ, మనం అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీల మీద ఆధారపడిరది. అలాంటప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడితే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థమీదే ఆ దుష్ప్రభావం పడితీరుతుంది. కాంగ్రెస్‌ బలహీన పడడానికి అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఆ మాటకొస్తే, మనకున్న అనేకకానేక రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యానికి ఇస్తున్న ప్రాధాన్యం నామమాత్రమైందే. ‘దమ్ముంటే సోనియా కుటుంబానికి చెందని వారిని కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఎన్నుకుని చూపించండి’ అని ప్రధానమంత్రి మోదీ ఇటీవలే సవాల్‌ విసిరారు. అక్కడికి బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరిజిల్లుతోందని కాదు. మోదీ ఎప్పుడూ కాంగ్రెస్‌ వంశపారంపర్య పాలనను కొనసాగిస్తుందని దెప్పిపొడుస్తుంటారు. బీజేపీలో కూడా వంశ పారంపర్య పాలనకు తక్కువ ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీల్లో అనేకం ఆ పార్టీలను నెలకొల్పిన నేతల కుటుంబం గుప్పెట్లో ఉన్నవే. ఈ విషయంలో చాలా పార్టీలది గురవింద తత్వమే. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఏఐసీసీ సమావేశంలో ఎన్నికల నిర్వహణ అనే తంతు జరగక పోలేదు. కానీ, తనతో పాటు ప్రధానమంత్రి పదవికి పోటీదారులు అనుకున్న శరద్‌ పవార్‌, నారాయణదత్‌ తివారీ, అర్జున్‌ సింగ్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైతే పీవీ వారిచేత రాజీనామా చేయిం చారు. మళ్లీ తానే ఈ ముగ్గురినీ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా నామినేట్‌ చేసి, తన ఆధిపత్యం చాటుకున్నారు. కాంగ్రెస్‌ను తమ జేబు సంస్థగా దిగజార్చిన ఘనత నిస్సందేహంగా ఇందిరాగాంధీదే. అదే విధానాన్ని రాజీవ్‌గాంధీ కూడా కొనసాగించారు. సోనియా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అయిన తరువాత ఆమే సర్వాధికారి. ఈ ఏకపక్ష ధోరణిని ఇప్పటికైనా విరమించాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు రావడం హర్షించదగింది. అనుకున్న సమయంలో గెహ్లాట్‌ అత్యాశ ఆ ప్రక్రియను అపహాస్యంపాలు చేసింది. అధ్యక్ష స్థానానికి నామినేషన్‌ల గడువు ముగియడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఆలోగా సొంత ఇంటిని చక్కబెట్టుకోకపోతే కాంగ్రెస్‌ నవ్వులపాలు కాకతప్పదు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ఇతర పార్టీలకు ఆదర్శప్రాయంగా మెలగడం అలవాటు చేసుకోవడం ఒక్కటే మార్గం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img