Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రతిపక్ష ఐక్యతపై కొత్త ఆశలు

లక్ష్య శుద్ధి ఉంటే గమ్యం చేరడం అసాధ్యం కాదు. మోదీ- అమిత్‌ షా ద్వయం పరిపాలనకు తిరుగులేదనీ, మోదీ ఉంటే అన్నీ సాధ్యమే అన్న ప్రచారార్భాటాలూ కొనసాగుతున్నా జనంలో మాత్రం మోదీ మీద వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. 2019 సార్వ త్రిక ఎన్నికలకు ముందూ ఇలాంటి వాతావరణమే ఉన్నా ప్రతిపక్షాల అనైక్యత కారణంగా మోదీ నాయకత్వంలో బీజేపీ అంతకు ముందు కన్నా ఎక్కువ మెజారిటీతో అధికారం సంపాదించింది. 2024లో సార్వత్రిక ఎన్నికలలో మోదీని గద్దె దించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు కూడా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడంలోనూ ప్రతిపక్షాల ఐక్యతా యత్నం కనిపించింది. ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సైతం ప్రతిపక్ష ఐక్యత గురించే మాట్లాడారు. కానీ రాష్ట్రపతి ఎన్నికలలో ఓటమి తరవాత ఆయన మాటే వినిపించడం లేదు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర రావు (కె.సి.ఆర్‌.) మొదలైన వారు ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. కె.సి.ఆర్‌. కొన్ని రాష్ట్రాలలో పర్య టించారు కూడా. అయితే మమత, కె.సి.ఆర్‌. ప్రతిపక్ష ఐక్యతా యత్నాలలో ఓ సమస్య ఉంది. ఆ రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలకు బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్‌. అందుకని మమత, కె.సి.ఆర్‌. కాంగ్రెస్‌తో కూడిన ప్రతిపక్ష ఐక్యతకు సుముఖంగా లేరు. వీరు ప్రాంతీయ పార్టీల ఐక్య సంఘటనకు మొగ్గు చూపుతున్నారు. కానీ దేశమంతటా కాంగ్రెస్‌కే ప్రాబల్యం ఉంది. వచ్చే లోకసభ ఎన్నికలలో బీజేపీతో ఒక వేపు కాంగ్రెస్‌, మరో వేపు ఏదో ఒక రూపంలో ఐక్యమయ్యే ప్రతిపక్ష కూటమి పోటీ పడితే ముక్కోణపు పోటీ తప్పదు. ఇది అంతిమంగా బీజేపీకే ఉపకరిస్తుంది. అన్నింటికన్నా మించి కె.సి.ఆర్‌., మమతా బెనర్జీ తామే ప్రధానమంత్రి కావా లని భావిస్తున్నట్టున్నారు. వారిద్దరూ బహిరంగంగా ఆ మాట ఎన్నడూ చెప్పకపోయినా ఆంతర్యం అదే. మరో వేపు ఇటీవల పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా మోదీని ఢీకొనే ప్రయత్నంలోనే ఉన్నారు. ఆయనతో రెండు సమస్యలున్నాయి. కేజ్రీవాల్‌ ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసే ఆలోచనలో లేరు. ఆయన విమర్శలు మొన్న మొన్నటిదాకా కాంగ్రెస్‌ మీదే ప్రధానంగా ఎక్కుపెట్టే వారు. ఇటీవలి కాలంలోనే మోదీతో తలపడే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులను సహించే లక్షణం ఏ మాత్రం లేని మోదీ ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర కుమార్‌ జైన్‌ను కొద్ది నెలల కింద జైలులో పెట్టడం, మొన్నమొన్ననే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా మీదకు సీబీఐని ఉసిగొల్పడంవల్ల కేజ్రీవాల్‌ మోదీ వ్యతిరేక వైఖరి అనుసరించక తప్పలేదు. రెండవది సైద్ధాంతికంగా కేజ్రీవాల్‌ పార్టీ బీజేపీకి అనుకూలమైందే తప్ప మతతత్వాన్ని ఎదిరించే ఆలోచన ఉన్నది కాదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ పలుకుబడి పెరగడానికి ప్రధాన కారణం కేజ్రీవాల్‌ కల్పించే ఉచిత సదుపాయాలేనని మోదీ భావిస్తున్నట్టున్నారు. వీటినే ఆయన తాయిలాల సంస్కృతి అని ఈసడిరచారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఉచితాలకు దూరంగా లేదు. ఆ మాటకు వస్తే అన్ని ప్రభుత్వాలూ ఏదో ఒకటి ఉచితంగా అందిస్తూనే ఉన్నాయి. మోదీని గద్దె దింపాలన్న ఆశ అనేక పార్టీలలో ఉన్నప్పటికీ ఏక సూత్రత లేదు.
బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రతిపక్ష ఐక్యతపై కొత్త ఆశలు చిగురింప చేసింది. నితీష్‌ సోషలిస్టు భావాలు ఉన్నవారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం నడిపినన్నాళ్లూ ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కడకు ఆయన చేరవలసిన గూటికి చేరారు. మూడు రోజులు దిల్లీలో పర్యటించి కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీల నాయకులను సంప్రదించారు. ఇంకా ఆ దారిలోనే ఉన్నారు. ప్రతిపక్ష కూటమికి ఆయనే నాయకుడవుతాడు, ప్రతిపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనేనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ నితీశ్‌ ఆ ఛాయలేమీ కనిపించనివ్వడం లేదు. సోమవారం ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ నాయకుడు చౌతాలా ఏర్పాటు చేసిన సమావేశానికి నితీశ్‌ హాజ రయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు, మమతా బెనర్జీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.సి.ఆర్‌., సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ హాజరు కాలేదు. వీరందరూ కాంగ్రెస్‌ రహిత ప్రతిపక్ష ఐక్యత కోరు కుంటున్నారు. అది వారి రాష్ట్రాలలో ఉన్న పరిస్థితికి అనుగుణమైన వ్యూహం అయితే కావచ్చు కానీ దేశవ్యాప్తంగా మోదీని ఓడిరచడానికి ఎంత మాత్రం ఉపకరించదు. లాలూ ప్రసాద్‌తో కలిసి నితీశ్‌ సోమవారం సోనియాగాంధీనీ కలుసుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు పూర్తి అయిన తరవాత మాట్లాడదాం అని సోనియా చెప్పారు. నితీశ్‌ వ్యూహం ప్రకారం ప్రతిపక్ష ఐక్యత అంటే కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన ఐక్యతే. ఇప్పుడు ఏర్పడవలసింది మూడవ ఫ్రంట్‌ కాదు. ప్రతిపక్షాల ఫ్రంట్‌ మాత్రమేనన్న స్పష్టమైన అవగాహన నితీశ్‌కు ఉంది. ఈ ధోరణి కె.సి.ఆర్‌. లాంటి వారికి నచ్చకపోవచ్చు. బెంగాల్‌ రాజకీయాల దృష్టితో చూస్తే మమతా బెనర్జీకి కాంగ్రెస్‌, వామపక్షాలతో మైత్రి అసౌకర్యంగా ఉండొచ్చు. కానీ బీజేపీని ఓడిరచాలని కనక గట్టిగా భావిస్తే మమత దిగిరాక తప్పదు. ఎటొచ్చీ మోదీ మీద ఒంటికాలి మీద లేస్తున్న కేజ్రీవాల్‌ ఇతర ప్రతిపక్షాలతో కలిసి నడవడానికి అంగీకరించకపోవడం అంతిమంగా బీజేపీకి అను కూలాంశం కావచ్చు. బీజేపీ ఇప్పటికే పటిష్ఠంగా ఉంది. తాను ఎప్పుడూ గెలవని స్థానాలలో విజయం సాధించడానికి అనువైన వ్యూహాలను రూపొందించడంలో బీజేపీ నిమగ్నమై ఉంది. కానీ దేశంలో హిందూ-ముస్లింల మధ్య ఏ గొడవా లేదనీ, అదంతా కృత్రిమగా సృష్టిస్తున్నారని బీజేపీ నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారని నితీశ్‌ కుమార్‌ చెప్తున్నారు. నితీశ్‌ అకాలీ నాయకుడు సుఖ్బీర్‌ బాదల్‌ను కూడా కలుసుకున్నారు. శివసేన, జె.డి.(యు), అకాలీ దళ్‌ లాంటివే అసలైన ఎన్‌.డి.ఎ. అని సుఖ్బీర్‌ కరాఖండిగా చెప్తున్నారు. వాస్త వానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేరుకే ఎన్‌.డి.ఎ. సర్కారు. అందులో చెప్పుకోదగ్గ రాజకీయ పార్టీలు ఏమీ మిగల లేదు. తమకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలను మింగేసే పథకాన్ని బీజేపీ పకడ్బందీగా అమలు చేస్తోందని అకాలీ దళ్‌, శివసేన లాంటివి అనుభవ పూర్వకంగా గ్రహించాయి. మోదీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు ఒక్కు మ్మడిగా పోరాడితే అసాధ్యం కాకపోవచ్చు. ప్రతిపక్షాలు విజయం సాధిస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న చర్చ ప్రస్తుతానికి అనవసరం. నితీశ్‌ ఇదే మాట చెప్తున్నారు. విస్తృతమైన ప్రతిపక్ష ఐక్యత సాధ్యమైతే మోదీని ఓడిరచడం కష్ట సాధ్యం కావచ్చు కానీ అసాధ్యం అయితే కాదు. నితీశ్‌ నడుస్తున్న దారి ఆ దిశగానే ఉంది. ఆయనకు లక్ష్య శుద్ధి ఉంది. కావలసింది లక్ష్య సిద్ధి. అది బీజేపీకి వ్యతిరేకం అని చెప్పుకుంటున్న పార్టీల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img