Friday, April 26, 2024
Friday, April 26, 2024

దళితులంటే ఎంత కసో!

ఇటీవల దళితుల మీద రెండు ఏహ్యమైన దాడులు జరిగాయి. మొదటిది దేశ రాజధాని దిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి, హతమార్చి, తల్లిదండ్రుల ప్రమేయమైనా లేకుండానే అంత్యక్రియలు చేసేశారు. దిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధీనంలో ఉంటారు. అయినా ఆయన ఈ అఘాయిత్యాన్ని ఖండిరచరు. కనీసం సానుభూతి అయినా తెలియజేయలేదు. రెండవది టోక్యో ఒలంపిక్‌ క్రీడల్లో పాల్గొంటున్న మహిళల బృందం అర్జెంటీనాచేతిలో ఓడిపోయినందుకు, అందులో సభ్యురాలిగా ఉన్న ఒక మహిళ స్వస్థలంలో దళితులకు ఆ బృందంలో చోటిచ్చినందువల్లే భారత్‌ ఓటమి పాలైందని అవహేళన చేశారు. వెటకారంగా నృత్యాలు చేశారు. ఆ క్రీడాకారిణి పేరు వందనా కటారియా. వజ్రోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్న స్వతంత్ర భారత దేశంలో దళితుల, పేదల పరిస్థితి ఇది. దళితులు, గిరిజనుల మీద అత్యాచారాలను నిరోధించడానికి చట్టం ఉంటుంది. పోలీసులుంటారు. కోర్టులుంటాయి. వారి మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరిగినప్పుడు నిరసన తెలియజేసే వారు కొందరైనా ఉంటారు. కుల వివక్ష నేరం అని హితబోధలు పలికే వారూ ఉంటారు. దళితోద్ధరణకు పాటుబడ్డ నాయకులు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. అయినా దళితుల మీద అత్యాచారాలు ఆగవు. నేరారోపణ వచ్చినప్పుడు నిందితులమీద కేసులు నమోదు చేయడం పోలీసుల బాధ్యత. కానీ బడుగు వర్గాలకు చెందిన వారెవరైనా సాహసించి పోలీసు స్టేషన్‌ మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే అక్కడున్న ‘‘రక్షక భటులు’’ కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తారు. అదేమంటే బెదిరిస్తారు. అదరగొడ్తారు. మరీ మాట్లాడితే పోలీసు స్టేషన్లో నిర్బంధిస్తారు. బాధితులకు కాలం కలిసి రాకపోయినా, పోలీసు స్టేషన్‌ సిబ్బందిలో కుల దురహంకారం ప్రకోపించినా పోలీసుల నిర్బంధంలో ఉన్న వ్యక్తి నిర్బంధంలోనే మరణిస్తాడు. హరిజనులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవచ్చు. వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేసే వారిలో కొందరైనా ఉన్నత స్థాయికి చేరవచ్చు. అయినా వారిని పై కులాల వారు చిన్న చూపే చూస్తారు. పేదల పరిస్థితీ అదే. మన చట్టాలు మౌలికంగా కలిగిన వారి ఆస్తుల, హక్కుల పరిరక్షణకే ఉపకరిస్తాయి. ఈ మాట చెప్పినందుకే కేరళ ముఖ్యమంత్రిగా పని చేసిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ మీద కోర్టు ధిక్కార కేసు మోపారు. ఆయనను దోషి అని తేల్చారు. పై కోర్టుకెళ్తే దయతో జరిమానా, శిక్ష తగ్గించారు. కడకు తేలిందేమిటంటే చట్టాలు నిరుపేదలకు, బడుగు వర్గాలకు, దళితులకు గిరిజనులకు ఏమాత్రం ఉపకరించవనే. దిల్లీ కంటోన్మెంట్‌ సమీపంలో నివసిస్తున్న తొమ్మిదేళ్ల బాలిక మీద శ్మశాన వాటికలో ఉత్తర క్రియలు చేయించే పూజారులు అత్యాచారం చేసి, హతమార్చి, చితి పేర్చి అంత్యక్రియలు కూడా చేసేశారు. ఆ బాలిక చేసిన తప్పల్లా శ్మశాన వాటిక బయట ఉన్న వాటర్‌ కూలర్‌ నుంచి రోజూ వెళ్లినట్టుగానే ఈ దురంతం జరిగిన రోజూ వెళ్లడం. ఆ పసి కూన మీద అత్యాచారం చేశారు. విషయం తెలిసి వచ్చిన తల్లిదండ్రులు వచ్చి మొత్తుకున్నా వినకుండా అంత్యక్రియలు కూడా చేసేశారు. జనం పోగై నిరసన తెలిపే సమయానికి ఆమెశరీరంలో కాళ్లు తప్ప సకల అవయవాలూ దగ్ధమై పోయాయి. ఫారెన్సిక్‌ పరీక్ష లాంటిదేదో జరుగుతోంది. పైగా ఆ అమ్మాయి తల్లిదండ్రులను దాదాపు ఒక రోజంతా ఇంటికెళ్లనివ్వనివ్వకుండా అక్కడే ఉంచేశారు. ఈ విషయం బయటపెడ్తే అనవసరంగా కోర్టు కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆ బాలిక మీద అత్యాచారం చేసిన వారిలో ఒకరు నేరం చేసినట్టు అంగీకరించారంటున్నారు. కానీ ఇలాంటి కేసులలో బాధితులకు న్యాయం జరగడం అరుదాతి అరుదు. ఒక్క ఉదాహరణ చాలు.
విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలంలోని వాకపల్లి గ్రామంలో 11 మంది కోందు మహిళల మీద గ్రే హౌండ్‌ పోలీసులు అత్యాచారం చేశారన్న ఆరోపణ వచ్చింది. ఇంతవరకు ఆ కేసు తేలలేదు. పౌర హక్కుల కోసం పాటు పడేవారు సుప్రీంకోర్టుకు వెళ్తే రెండున్నరో, మూడేళ్ల కిందో విచారణ ప్రారంభంఅయింది. ఈ 11మందిమహిళల్లో ఇద్దరు మరణించారు. మిగతా తొమ్మిదిమంది ధైర్యంగా కోర్టుమెట్లెక్కి వాంగ్మూలాలిచ్చారు. చివరకు ఎప్పుడో ఒకప్పటికి కేసు తేలి నిందితులకు శిక్ష పడితే తప్ప ఏమీ తేలదు.
రెండవ సంఘటన హాకీ క్రీడాకారిణి వందనా కటారియాను అవహేళన చేయడం. ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే స్థాయికి ఒక దళిత యువతి వెళ్తే ఆనందించాలి. కుల దురహంకారం రాజ్యమేలుతున్న మన సమాజంలో సరిగ్గా దానికి విరుద్ధంగా జరిగింది. అర్జెంటీనా చేతిలో మన జట్టు ఓడిపోవడానికి దళితులను మహిళా క్రీడా జట్టులో చేర్చుకోవడమే కారణం అని వాదించే వారు దళితుల మీద ఏహ్యభావం ఉన్న వర్గాల వారే. అర్జెంటీనాచేతిలో మన హాకీజట్టు ఓడిపోయిన తరవాత ఇద్దరు యువకులు ఆమె స్వస్థలమైన రోషనా బాద్‌లో ఆమె ఇంటిదగ్గర చేరి అవహేళనగా నాట్యం చేశారు. టపాకాయలు పేల్చారు. ఇంటి బయట సందడి చూసి బయటికొచ్చిన వందన తల్లిదండ్రులను అవమానించారు. కులంపేరుతో దూషించారు. ఒలంపిక్‌ క్రీడల్లో పాల్గొనే స్థాయికి చేరిన వందన ఆర్థికంగా మరీ బలహీనురాలు అయి ఉండక పోవచ్చు. కానీ ఆమె వాల్మీకి సామాజికవర్గానికి చెందింది అయినందువల్లే ఆమె తల్లి దండ్రులు అవమానం భరించవలసి వచ్చింది. ఈ ఇద్దరు యువకుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరొకరిని ఇంకా అరెస్టు చేయవలసిఉంది. అదీ వందన సోదరుడు ఫిర్యాదు చేస్తే. అంటే ఆర్థిక స్తోమత కూడా దళితులకు రక్షణ కల్పించడం లేదు. వారు కిందికులానికి చెందిన వారైనందువల్ల అవమానాలు ఎదుర్కోవలసి వస్తోంది. హాకీ జట్టు ఓటమికి ఆ జట్టులో దళితులు ఉండడమే కారణం అనుకునే స్థాయి నుంచి మన సమాజం ఇంకా ఎదగలేదు. అందుకే పేదలన్నా, ముఖ్యంగా దళితులన్నా పై కులాల వారికి చులకన మాత్రమే కాదు, ఏహ్యభావం కూడా ఉంటుంది. పోలీసు స్టేషన్లలో కస్టడీలో మృతి చెందే వారిలో దళితులే ఎక్కువమంది అని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో నేరాల చిట్టా రూపొందించే సంస్థ (ఎన్‌.సి.ఆర్‌.బి.) లెక్కల ప్రకారమే గత కొద్ది సంవత్సరాలుగా దళితుల మీద అత్యాచారాలు దాడులు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జరిగే నేరాల్లో 26శాతం దళితుల మీదే కొనసాగుతున్నాయి. అందులోనూ మహిళ మీదే కిరాతకాలు ఎక్కువ. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేరాలలో దళిత మహిళల మీద అఘాయిత్యాలే 15 శాతం. మిగతా రాష్ట్రాలలో పరిస్థితి మెరుగ్గా ఉందని కాదు. కుల దురహంకారం వదిలించుకునే సంస్కారం మన సమాజానికి ఇప్పటికీ అలవడకపోవడం దారుణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img