Friday, April 26, 2024
Friday, April 26, 2024

మన విజేతలు స్ఫూర్తి ప్రదాతలు

కరోనా మహమ్మారి ముంచుకొచ్చిన వేళ…ఏడాది ఆలస్యమైనా ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌ విజయవంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఎప్పటిలాగానే ఎన్నో ఆశలు, ఆకాంక్షలను మోసుకు వెళ్లిన భారత క్రీడాబృందం ఉన్నంతలో ఏడు పతకాలతో విజయ తీరాలకు చేరింది. కొన్ని క్రీడాంశాల్లో నిస్పృహ కలిగించినా, ఇంకొన్ని అంశాల్లో ఆశలు రేకెత్తించిన మన క్రీడామణులకు, ఘనులకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఎన్నో రాజకీయ కుత్సితాలను అధిగమించి ఈసారి ఏతావాతా 124 మందితో టోక్యో చేరుకున్న భారత కంటింజెంట్‌లో 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత (1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత) హాకీ టీమిండియా కంచు పతకాన్ని ముద్దాడిన తీరు సహజంగానే ఉద్విగ్న క్షణాలను ఆవిష్కరింపజేశాయి. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా ఊహించని స్థాయిలో ఫైనల్‌కు చేరుకొని ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున అసమాన రికార్డును నెలకొల్పాడు. స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకొని, వెన్నువిరిచి, విశ్వక్రీడల్లో మూడురంగుల జెండాను ఎగురవేశాడు. అథ్లెటిక్స్‌లో వందేళ్ల తర్వాత భారత్‌ ఈ ఘనత సాధించడం ఒక గొప్ప విశేషం. ఈ పోటీని కన్నార్పకుండా చూసిన భారత క్రీడాభిమానులకు ఆఖరి క్షణంలో ఒళ్లు గగుర్పొడిచే మహోన్నత సన్నివేశాన్ని సాక్షాత్కరింపజేసింది. అంతేగాకుండా, మహిళా హాకీ బృందం ఓటమి చవిచూసినప్పటికీ, కనీవినీ ఎరుగనిరీతిలో అద్భుతమైన ప్రదర్శనతో నాల్గవ స్థానంలో నిలిచి కొత్త భవిష్యత్‌కు సత్సంకేతాలను పంపించింది. రియోడిజినీరో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం కైవసం చేసుకున్న పి.వి.సింధు ఇప్పుడు స్వర్ణం లక్ష్యంగా దిగినప్పటికీ, కాంస్య పతకం సాధించి పరువు నిలిపింది, యువతకు స్ఫూర్తి నింపింది. తన లక్ష్యం ఇంకా నెరవేరలేదని ప్రకటిస్తూనే వచ్చే పారిస్‌ ఒలింపిక్స్‌పై గురిపెట్టింది. రెజ్లింగ్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ దహియా ఓ పట్టుపట్టి రజతాన్ని ఒడిసి పట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌ మహిళల 49 కిలోల విభాగంలో సాయికోమ్‌ మీరాబాయి చాను తృటిలో స్వర్ణం మిస్సయినా రజతంతో ఈయేడు క్రీడలకే శుభారంభం పలికింది. బాక్సింగ్‌ మహిళల వెల్టర్‌వెయిట్‌ విభాగంలో లవ్లీనా బోర్గొయిన్‌ కంచుమోత మోగించింది. రెజ్లింగ్‌ పురుషుల 65 కిలోల విభాగంలో బజరంగ్‌ పూనియా స్వర్ణం చేజార్చుకున్నా, కాంస్య పోరులో దుమ్మురేపి, దమ్ము చూపించాడు. గోల్ఫ్‌లో అదితి, బాక్సింగ్‌లో మేరీకోమ్‌లాంటి క్రీడాకారులు కొద్ది తేడాలో పతకాలను పోగొట్టుకున్నా, పోరాట పటిమతో ప్రశంసలు అందుకున్నారు.
విశ్వక్రీడా యవనికపై త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడిరచిన భారత ధీరులంతా తమ కృషి, అంకితభావం, పట్టుదల, దీటైన పోరాట పటిమతో విజేతలుగా నిలిచినవారే. భారత ప్రభుత్వం గొప్పగా ప్రోత్సహించడం వల్ల ఈ పతకాలు లభించాయని చెప్పుకోవడానికి వీల్లేదు. నిజానికి ఒలింపిక్స్‌లోనైనా, కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడల్లోనైనా, ఇంకే ప్రపంచ వేదికపైనైనా ఉడుకు రక్తంతో, ఉర్రూతలూగే ఉత్సాహంతో నెగ్గుకొచ్చిన యోధుల్లో ఏ ఒక్కరికీ విజయాలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహా లందిన సందర్భాలంటూ ఏమీ లేవు. పతకం సాధించిన తర్వాత చప్పట్లు కొట్టి, ఫోన్లు చేసి ఇదేదో తమ విజయంలా కీర్తించుకోవడానికి సిద్ధంగా ఉండటంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. టీమిండియా హాకీ విజయానికి, కశ్మీర్‌ 370కి, అయోధ్యకు ‘ఆగస్టు 5’తో లంకె పెట్టిన ఘనత మన మోదీ గారిదే. ఇండియాలో క్రీడారంగానికి కేవలం రోజుకు 3 పైసలు మాత్రం వెచ్చిస్తున్న వైనం మోదీకి తెలియనిది కాదు. 2016లో కేవలం రూ. 97.52 కోట్లు క్రీడా రంగానికి కేటాయించిన ఇదే మోదీ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత గత బడ్జెట్‌లో ఉన్నట్టుండి రూ. 890.92 కోట్లు కేటాయించి అత్యద్భుతమని చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నది. వాస్తవానికి ఈ బడ్జెట్‌లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రయోజనార్థం పైసా విదిల్చిన పాపానపోలేదు. ఈ రోజున ఒలింపిక్స్‌లో అత్యధిక విజయాలతో పతకాల పట్టికలో అగ్రభాగాన సగర్వంగా నిలిచిన చైనా మన దేశం కన్నా 200 రెట్లు నిధులను క్రీడలకు వెచ్చిస్తున్నది. ఒలింపిక్స్‌కు సన్నాహకంగా కేవలం శిక్షణ పేరుతో చైనా 2013లో దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక 2019లో కరోనా సెగ మొదలైనప్పటికీ, ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా దాదాపు వెయ్యికోట్లు ఖర్చుతో టోక్యోకు తన క్రీడాకారులను సిద్ధం చేసిన చైనా విధానం అత్యంత స్ఫూర్తిదాయకం. చైనా ఏటా 3,00,000 కోట్ల రూపాయలను క్రీడలకు వెచ్చిస్తున్నది. ఇవి మన మోదీగారిలాగ కేటాయింపులు కావు…ఖర్చుచేసినవి. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకైక స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా జీవితంలోకి తొంగిచూస్తే, ప్రభుత్వ సాయం పొందిన సందర్భాలే లేవని చెప్పవచ్చు. భారత్‌కు పతకం అందించాలన్న కాంక్షే అతన్ని ముందుకు నడిపించింది. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలన్న కోరిక మాత్రం అంతిమంగా మోదీదే.
నార్మన్‌ ప్రిచర్డ్‌ 1900 నాటి ఒలింపిక్స్‌లో అన్నీ తానై భారత్‌కు తొలిసారిగా రెండు పతకాలు సాధించిపెట్టాడు. ధ్యాన్‌చంద్‌ వంటి ఉద్ధండుల నేతృత్వంలో భారత హాకీ జట్టు ఇప్పటివరకు 8 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలు గెల్చుకున్నది. 2008లో అభినవ్‌ బింద్రా షూటింగ్‌లో పసిడి పట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు అథ్లెటిక్స్‌ (జావెలిన్‌ త్రో)లో నీరజ్‌ చోప్రా ‘బంగారుకొండ’గా అవతరించాడు. ఈ మధ్య కాలంలో పసడి కేరింతలు లేకపోయినా, ఏదోఒక పతకంతో ఎవరో ఒకరు భారత ప్రతిష్టను కాపాడుతూనే వున్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించి, భారత్‌కు తొలి పతకం అందించిన మహిళామణిగా చరిత్రపుటల్లోకి ఎక్కింది. విజేందర్‌సింగ్‌, సుశీల్‌కుమార్‌, సైనా నెహ్వాల్‌, సాక్షిమాలిక్‌, పి.వి.సింధు…ఇలా ఎందరో ఆటగాళ్లు వారి వారి క్రీడాంశాల్లో పతకాలతో ‘ప్రథములు’గా నిలిచారు. ఏదేమైనప్పటికీ మన విజేతలు స్ఫూర్తిప్రదాతలు.
రాజకీయాలు, క్రీడలు వేర్వేరు. కానీ క్రీడల్లో రాజకీయాలనేవి ఇండియాలో కోకొల్లలు. అవి ‘మన ప్రత్యేకం’ అంటూ ప్రతి ప్రభుత్వమూ నిరూపించుకుంటున్నది. మోదీ ఎంతగానో భుజానకెత్తుకున్న అంబానీ, అదానీలు ఒక్క క్రీడాకారుడికైనా ప్రోత్సహించారా? రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చడంలో రాజకీయ దురుద్దేశం లేదంటే నమ్ముతామా? గెలిచాక కానుకలివ్వడమే తప్ప మట్టిలో మాణిక్యాలను వెలికితీసే స్పోర్ట్స్‌ ప్రాజెక్టు ఒక్కటైనా ప్రభుత్వం ఫైళ్లలో వుందా? ఇవన్నీ సర్కార్ల వద్ద సమాధానాలు లేని ప్రశ్నలే! స్వతహాగా హాకీ మాజీ గోల్‌ కీపర్‌ అయిన నవీన్‌ పట్నాయక్‌ ప్రస్తుత హాకీ జట్టుపై రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. టీమీండియా తిరిగి గాడిన పడిన ఘనత పూర్తిగా ఆయనదే. ఆయన బాటలో ఇంకే ప్రభుత్వమైనా నడుస్తుందేమో వేచిచూద్దాం! భారత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ (2024)లో మరిన్ని పతకాలు సాధిస్తుందని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img