Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఫలితం కనిపించని అమిత్‌ షా కశ్మీర్‌ పర్యటన

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం, 35ఎ అధికరణం రద్దు చేస్తే అక్కడ పరిస్థితి కుదుటపడ్తుందని, సత్వరం అభివృద్ధి సాధిస్తుందని మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి చెప్తూనే ఉంది. 370వ అధికరణం రద్దు చేసిన తరవాత కశ్మీర్‌లో భయపడినంత అల్లకల్లోలమైతే చెలరేగలేదు. అయితే ప్రశాంతతా నెలకొనలేదు. గత నెల రోజుల నుంచి కొత్త తరహాలో రాష్ట్రేతరు లను, హిందువులను, సిక్కులను హతమారుస్తున్నారు. ఈ హత్యా కాండకు బాధ్యులెవరో ప్రభుత్వం ఇప్పటికీ ఇదమిథంగా తేల్చలేదు. పాత తీవ్రవాద సంస్థలే కొత్త రూపంలో వస్తున్నాయని మాత్రమే అంటున్నారు. విచిత్రం ఏమిటంటే జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర ప్రతిపత్తిని లాగేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినప్పుడు అను వైన సమయంలో మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కానీ సమీప భవిష్యత్తులో ఆ జాడే కనిపించలేదు. జమ్మూ-కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతా లుగా మార్చి రెండేళ్లైన తరవాత కానీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కశ్మీర్‌లో పర్యటించలేదు. ప్రధాని ఎటూ వెళ్లలేదు. ఇటీవలే కొందరు కేంద్ర మంత్రులు వెళ్లొచ్చారు. అమిత్‌ షా మూడు రోజులు పర్య టించిన తరవాత కశ్మీర్‌ పరిస్థితి అమాంతం మారుతుందన్న భరోసా ఏమీ కలగడం లేదు. కశ్మీర్‌లో ప్రస్తుతం ఒక రకమైన వైరాగ్యం రాజ్యమేలు తున్నట్టు కనిపిస్తోంది. ఒక వేపున పర్యాటకుల సంఖ్య పెరుగుతోందను కుంటున్న దశలో మళ్లీ పౌరుల మీద దాడులు పెచ్చరిల్లాయి. రెండేళ్ల పై నుంచి జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారాలు నేరుగా అమిత్‌ షా పరిధిలోనే ఉన్నాయి. గూఢచార సంస్థలు కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. కానీ మళ్లీ నెమ్మది నెమ్మదిగా తలెత్తుతున్న తీవ్రవాద కార్యకలాపాలకు కారకు లెవరో మాత్రం గూఢచార సంస్థలు కనిపెట్టలేకపోయాయి. గూఢచార శాఖల వైఫల్యాన్ని అమిత్‌ షా కూడా నివారించలేక పోయారు. అఫ్గాని స్థాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తరవాత కశ్మీర్‌లో మును పటి దారుణ పరిస్థితులు పునరావృతం అయితే ఎంత ప్రమాదమో ప్రభుత్వం గుర్తించడం లేదనలేం. కానీ స్పష్టమైన నిరోధక చర్యలేవీ కని పించడం లేదు. జమ్మూ-కశ్మీర్‌ రాజకీయ వ్యవస్థను అమాంతం మార్చేసిన తరవాత అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండాలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సరైన అంచనా ఉన్నట్టు కనిపించడం లేదు. కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి తీసుకున్న లేక తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలూ లేవు. నిజానికి 2018 నుంచి జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పరిపాలనలోనే ఉంది. 2019 ఆగస్టు అయిదవ తేదీ తరవాత మోదీ-షాద్వయం కలిసి సాధించింది ఇదీ అని నిర్దిష్టంగా చెప్పే అవకాశమూ లేదు. బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యమైన 370వ అధికరణం రద్దు చేయగలిగామన్న సంతృప్తి మిగిలితే మిగిలి ఉండవచ్చు. కానీ కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితి సంపూర్ణంగా మెరుగుపడి ప్రజలు నిర్భయంగా బతకగలిగిన పరిస్థితులు ఏర్పడకపోతే సంఫ్‌ు పరివార్‌ ఇంతకాలం కశ్మీర్‌ అశాంతికి 370వ అధికరణమేకారణం అని చేసిన ప్రచారంలోని డొల్లతనం బయటపడక మానదు.
మూడు కుటుంబాలు కలిసి కశ్మీర్‌ను ఇన్ని దశాబ్దాలుగా కొల్లగొట్టా యని, అభివృద్ధి కుంటుపడేట్టు చేశాయని సంఫ్‌ు పరివార్‌ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. గత రెండేళ్ల కాలంలో కశ్మీర్‌లో గణనీయమైన అభివృద్ధి సాధించిన దాఖలాలు లేవు. అభివృద్ధికి సంబంధించిన అనేక సూచికల్లో కశ్మీర్‌ మిగతా అనేక రాష్ట్రాలకన్నా ఎప్పటి నుంచో మెరుగ్గానే ఉంది. ఉదా హరణకు దేశవ్యాప్తంగా సగటు పేదరికం 21.92 శాతం అయితే కశ్మీర్‌లో అది 10.35 శాతమే. అభివృద్ధికి 370వ అధికరణానికి లంకె పెట్టడం ఎప్పుడైనా వృథా ప్రయాసగా మిగిలిపోక తప్పదు. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతి పత్తి కనుచూపు మేరలో లేనట్టే. 370వ అధికరణం రద్దు చేసిన సమయంలో జమ్మూ-కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పరిధిలో పని చేసే రాజకీయ పార్టీల నాయకులందరినీ నిర్బంధించారు. క్రమంగా ముఖ్యమైన నాయకు లను విడుదలచేసినా ఇంకా వేలాది మంది రాజకీయ కార్యకర్తలు నిర్బంధం లోనే ఉన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను లేకుండా చేశారు. ఈ నిషేధాలన్నీ చేదు మాత్రల్లాంటివని అమిత్‌ షా అంటున్నారు. రోగం ముదిరినప్పుడు చేదుమాత్రలు మింగక తప్పకపోవచ్చు. కానీ చేదు మాత్రలు, కఠిన పథ్యం శాశ్వతమైతే రోగం కుదరనట్టే లెక్క. కశ్మీర్‌ పర్యటన తరవాత పాకిస్తాన్‌తో కశ్మీర్‌వ్యవహారం చర్చించే ప్రసక్తేలేదని షా చెప్పడాన్ని తప్పుపట్టలేం. కశ్మీర్‌ వ్యవహారం మన అంతర్గత వ్యవహారం అయితే పరిష్కరించుకోవడానికి ఇతర దేశాలతో చర్చించవలసిన అగత్యం లేదు. కానీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి ప్రభుత్వం చర్చలు జరపడానికి అవకాశం ఉండాలంటే ఎవరితో చర్చించాలో తెలి యాలి. యువతతో చర్చిస్తామని షా అంటున్నారు. యువత అనేది రాజ కీయ చర్చలకు సంబంధించినంత మేరకు అమూర్తమైన వ్యవహారం. ప్రధాని నరేంద్ర మోదీ గత జూన్‌లో కశ్మీర్‌ రాజకీయ పార్టీల నేతలతో దిల్లీలో చర్చలు జరిపారు. కానీ ఆ తరవాత ఆ క్రమం కొనసాగనే లేదు. అమిత్‌ షా పర్యటన సందర్భంగా 700 మందిని నిర్బంధించవలసి వచ్చిం దంటేనే అక్కడ పరిస్థితి సవ్యంగా లేదనడానికి ఇంకా ఏం రుజువులు కావాలి. కేంద్ర హోం మంత్రే స్వేచ్ఛగా పర్యటించలేనప్పుడు అక్కడ పరిస్థితి మెరుగుపడిరదని నమ్మడం సాధ్యం కాదు. జమ్ము-కశ్మీర్‌ ప్రజల మధ్య అంతరాలను షా నొక్కి చెప్పడం దీర్ఘకాలికంగా ఉపకరించేది కాదు. రాజకీయ ప్రక్రియ ద్వారా తప్ప కశ్మీర్‌ కుదుటపడడం సాధ్యం కాదు. అక్కడి రాజకీయ పార్టీలను ఎందుకూ కొర గాకుండా చేయడం వల్ల సాధించేది శూన్యం. రాష్ట్ర ప్రతి పత్తిని పునరుద్ధరించడానికన్నా ముందు శాసన సభనైనా పునరుద్ధరిస్తే ప్రజల భాగస్వామ్యానికి కొంతైనా అవకాశం ఉంటుంది. రెండేళ్ల కింద కేంద్రం తీసుకున్న చర్యలు సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను అమలు చేశామన్న సంతృప్తి మిగల్చవచ్చు. కానీ అది పరిష్కారం కాదు. ప్రధాన స్రవంతిలోని రాజకీయ పార్టీలకు అవకాశం ఉండి తీరవలసిందే. కొత్త రాజకీయ వ్యవ స్థను ఏర్పాటు చేయాలనుకుంటే అదేమిటో కేంద్రం చెప్పి తీరాలి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లాంటి, పి.డి.పి., కాంగ్రెస్‌ లాంటి పక్షాలు రాజకీయ కార్య కలాపాలు కొనసాగించడానికి అవకాశం ఉంటే తప్ప ప్రజాభిప్రాయం వ్యక్తం కాదు. జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా దిగ జారిస్తే కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగడానికి అవకాశం ఉండొచ్చు కానీ అది జనాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎలాంటి పంథా అనుసరించినా విలోమ ఫలితాలు అనివార్యం అవుతాయి. మొత్తంమీద అమిత్‌ షా పర్యటన నిర్దిష్ట ఫలితాలు సాధించిన జాడలే లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img