Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ మార్కు ప్రతీకారం

	అడుగడుగునా ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దయనీయస్థితిలో పడిపోయినప్పుడు కసిగా, నిష్కారణంగా, అడ్డంగా దాడికి దిగడం మోదీ వ్యవహార శైలి. తనను ప్రశ్నించే వారిని మోదీ ఏ మాత్రం సహించలేరు. విమర్శలను ఎదుర్కునే లక్షణం ఏ నియంతకూ ఉండదు. సరిగ్గా ఇరవైఏళ్ల కింద జరిగిన గుజరాత్‌ మారణకాండపై బ్రిటిష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బి.బి.సి.) వరసగా రెండు వీడియోలు విడుదల చేసి మోదీని బోనెక్కించింది. ఆయనలో గూడు కట్టుకున్న మతతత్వాన్ని ఎండగట్టింది. సహజంగానే ఇది మోదీకి మింగుడు పడలేదు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆదాయపు పన్ను శాఖను, సీబీఐని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌(ఇ.ది.)ను ప్రయోగించిన, ప్రయోగిస్తున్న రీతిలోనే మంగళవారం ఉదయం నుంచి తనకు వ్యతిరేకంగా డాక్యుమెంటరీలు విడుదల చేసిన బీబీసీ మీద ఆదాయప పన్ను శాఖ చేత దాడులు చేయించారు. మొదట ఈ డాక్యుమెంటరీలను ట్విట్టర్‌ లాంటి వేదికల మీద నిషేధించారు. ఈ సాంకేతిక యుగంలో ఇలాంటి నిషేధాలవల్ల ప్రయోజనం ఉండదని మోదీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. నిషేధం ఉన్నా అనేక మంది ఈ డాక్యుమెంటరీ చిత్రాలను చూశారు. చూడకూడదన్న హెచ్చరికలు పెచ్చరిల్లుతున్న కొద్దీ వీటిని సామూహికంగా చూడడం తమ హక్కు అని జనం భావించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జె.ఎన్‌.యు), బెంగాల్‌ లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిషేధాన్ని ధిక్కరించి మోదీకి సవాలు విసిరారు. ఆ డాక్యుమెంటరీలలో ఉన్న వాస్తవం జనానికి తెలియక కాదు. ఇంతకు ముందే గుజరాత్‌ మారణకాండ మీద అనేక నివేదికలు వచ్చాయి. అవన్నీ మారణకాండకు అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలోఉన్న మోదీ మద్దతిచ్చిన వైనాన్ని విప్పిచెప్పాయి. తాజాగా బీబీసీ విడుదల చేసిన రెండు డాక్యుమెంటరీలు ఆ కిరాతక పాలనకు నాయకత్వం వహించిన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుకుబడి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశాయి. ఇదెంత అవమానకరమో  మోదీ గ్రహించకుండా ఉండరుగదా! మోదీ తొమ్మిదేళ్ల పాలనలో గోదీ మీడియా అంతా నిస్సిగ్గుగా మోదీకి మోకరిల్లింది. నిజాన్ని కప్పిపుచ్చే ఈ మీడియా బండారం బయట పెట్టడానికి శక్తి మేరకు ప్రయత్నిస్తున్న మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు చేయని ప్రయత్నం లేదు. కానీ గుత్త పెట్టుబడిదారుల గుప్పెట్లో ఉన్న మీడియా సంస్థలతో పోలిస్తే ప్రశ్నించే మీడియా సంస్థల గొంతు పీలగానే ఉంది. ఈ దశలో బి.బి.సి. అహం దెబ్బతిన్న మోదీ ఈ ఆరోపణలకు సమాధానంచెప్పే శక్తి లేనందువల్ల తన చేతిలో ఉన్న ప్రభుత్వ విభాగాలను బి.బి.సి. పైకి ఉసిగొల్పారు. ఇది ఆయనను ఆవహించిన భయవిహ్వలతకు చిహ్నం. దిల్లీలో బీబీసీ కార్యాలయం మీద దాడిచేసినవారు దాదాపు రెండు డజన్లు. ముంబైలోని బి.బి.సి. కార్యాలయం మీద దండెత్తిన వారూ దాదాపు అంతే మంది. ముంబై వెళ్లిన అధికారులు అక్కడి వారు కాదు. దిల్లీ నుంచి వెళ్లారు. అంటే ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని బధిరాంధులకు కూడా అర్థం అవుతుంది. 
ఆదాయపు పన్నుశాఖ అధికారులు తాము చేసిన పనిని దాడి అనడం లేదు. దీనికి వారు పెట్టిన ముద్దు పేరు సర్వే. అదే నిజమైతే అక్కడ సిబ్బంది కంప్యూటర్లను, లాప్‌టాప్‌లను ఎందుకుస్వాధీనం చేసుకున్నట్టు! ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇలాంటి సందర్భాలలో ఏ వస్తువునూ ఏ పత్రాలనూ స్వాధీనం చేసుకోకూడదు. అక్కడ ఉన్న సమాచారం నకళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు వ్యవహారం అంతా కంప్యూటర్ల ద్వారా కొనసాగుతుంది కనక దాడిచేసినచోట ఉన్న సమాచారం నకళ్లు సేకరించవచ్చు. కానీ ఆదాయపు పన్ను శాఖ ఏకంగా జప్తు చేసింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవుండదుగా! ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అధికారంలోకి వచ్చిన నియంతలూ రాజుల్లాగే నిరంకుశంగా వ్యవహరిస్తారు. మోదీ ఈ ధోరణికి ప్రతిరూపం. మోదీ సూత్రీకరణ ప్రకారం తన ప్రతిష్ఠకు భంగం కలగడం అంటే దేశ ప్రతిష్ఠకూ భంగం కలగడమే. అయితే ప్రజాస్వామ్యం పరిఢవిల్ల వలసిన చోట తాను నియంతృత్వం చెలాయిస్తుండడం దేశ ప్రతిష్ఠను దిగజారుస్తోందని మోదీ ససేమిరా అంగీకరించరు. ఆయన మూర్తీ భవించిన అహంభావి. దెబ్బకు దెబ్బకు తీయడమే ఆయన విధానం. ఆయన నియంతృత్వ పోకడ కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. తనను ప్రశ్నించే వారిని సహించే సంస్కారమూ ఆయనకు లేదు. అందుకే బి.బి.సి. మీద ఆదాయపు పన్ను శాఖను ప్రయోగించారు. 
బీబీసీ ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వసనీయత ఉన్న వార్తా వ్యవస్థ. ప్రపంచమంతా 50 కోట్ల మంది బీబీసీ వార్తలను ఆదరిస్తారనుకుంటే అందులో భారతీయుల సంఖ్య ఏ దేశంలోనూ లేనట్టుగా ఆరున్నర కోట్ల దాకా ఉంది. బీబీసీలో ప్రసారమైందే నిఖార్సైన వార్త అన్న అభిప్రాయం ఇప్పటికీ మన దేశవాసుల్లో ఉంది. అలాంటి వార్తా వ్యవస్థ మోదీ కీర్తికి కళంకం కల్గిస్తే సహిస్తారా? ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభం అయిన తరవాత రష్యా బి.బి.సి. ప్రసారాలను అనుమతించడం లేదు. చైనాలోనూ అదే పరిస్థితి. అంటే తమ లోపాలు బయటకు పొక్కకూడదనుకునే వారు బి.బి.సి. ప్రసారాలకు కళ్లెం వేస్తున్నారు. మోదీ ఒక అడుగు ముందుకేసి ఏకంగా దాడి చేయించారు. బి.బి.సి. ఆదాయపు పన్ను ఎగవేస్తోందనీ, బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని, ఆ సంస్థ పత్రికా రచన వెనక ఒక నిర్దిష్ట ఎజెండా ఉందని ప్రచారం చేయడం మోదీ సర్కారు ఉద్దేశం. మోదీ సర్కారును మరో అంశం నిరంతరం వ్యాకులపరుస్తోంది. జి20 అధ్యక్ష స్థానం ఈ సారి భారత్‌కు దక్కింది. ఇది మోదీకి ఏనుగెక్కినంత సంతోషం కలిగించింది. 
ఈ ఏడాది పొడవునా జి20కి సంబంధించి సభలు, సమావేశాలు, సందర్శనలు మన దేశంలో జరగనున్నాయి. అలాంటప్పుడు బి.బి.సి. డాక్యుమెంటరీవల్ల ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం మోదీకి బొత్తిగా మింగుడు పడడం లేదు. గోదీ మీడియా గీసిన మోదీ చిత్రం రాను రాను వికృతం అయిపోతోంది. డాక్యుమెంటరీల గొడవ సద్దు మణగక ముందే అదానీ కుంభకోణం, అందులో మోదీ సర్కారు పాత్ర ఉందన్న ఆరోపణలు మోదీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా తనకు ఉందను కుంటున్న ఆదరణను ధ్వంసం చేస్తాయన్న బాధ మోదీని అమితంగా పీడిస్తోంది. బి.బి.సి.మీద ఉన్న అనుమానాలు ఆర్థిక సంబంధమైనవి అయితే ఆదాయపు పన్నుశాఖ ఆ మేరకే పరిమితం కాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది మొబైల్‌ ఫోన్లనూ స్వాధీనం చేసుకోవడం మోదీ వెన్నులో పుట్టిన వణుకుకే సంకేతం. బలహీనం అవుతున్నవారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టే మోదీలో ప్రతీకారేచ్ఛ పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img