Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యడియూరప్ప ఔట్‌

కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప సోమవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా యడియూరప్పను బీజేపీ కేంద్ర నాయకత్వం తొలగిస్తుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఆయన పదవి నుండి తప్పుకోవలసిన తప్పని పరిస్థితి ఏర్పడిరది. అసందిగ్ధత తొలగింది. తాను ‘స్వచ్చందంగా’ రాజీనామా చేశానని ఆయన చెప్పినప్పటికీ అది నిజం కాదని అందరికీ తెలుసు. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని పైరవీలు చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నందున ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ పార్టీ, ప్రభుత్వం లోపల, వెలుపలి నుండి ఎక్కువైందే కానీ తగ్గలేదు. యడియూరప్పపైన కూడా అవినీతి, ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలున్నాయి. అనేక విషయాలలో బీజేపీది కాంగ్రెస్‌ కంటే భిన్నమైన సంస్కృతి కాదని యడియూరప్ప ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.
తదుపరి ముఖ్యమంత్రిని ప్రజలెన్నుకున్న శాసనసభ్యులు ఎన్నుకో వలసి ఉంటుంది. ప్రజాస్వామ్య పాలనలో ఇదే జరగాలి. ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్‌, బీజేపీలు వ్యవహరించాయి. ఇంకా ఇదే విధానం సాగుతోంది. విఫలమైన బీజేపీ ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. అంతేకాదు పరిపాలన, విధాన నిర్ణయాలు, విఫలమైన ముఖ్యమంత్రులను తప్పించడంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లో రెండేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను నియమించిన ‘ఘనత’ కూడా మోదీదే. యడి యూరప్ప రాజీనామాను గవర్నర్‌ థావర్‌చంద్‌ గెల్హాట్‌ ఆమోదించారు. ఇది ముందుగా జరిగిన ఏర్పాటే గనుక గవర్నరు ఆమోదం లాంఛనమే. 2022 ప్రారంభ నెలల్లో యుపి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యోగి తొలగింపు పెను సమస్యగా మారవచ్చు. అలాగే తప్పు సంకేతాలు వెళతాయి.
మోదీ ముఖ్యమంత్రులనే కాదు పార్టీ సీనియర్‌ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, కేశూభాయ్‌ పటేల్‌ లాంటి అనేకమందిని తొలగించి తన దారికి అడ్డు రాకుండా చేసుకున్నారు. ఏడేళ్ల కాలంలో ఇతర పార్టీల నుండి ఎంఎల్‌ఎల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, వారికి కావలసిన ఇతర ప్రయోజనాలు కల్పించడం ద్వారా ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను నెలకొల్పిన చరిత్ర మోదీ, అమిత్‌షాలది. కర్నాటకలో 2019లో జనతాదళ్‌కాంగ్రెస్‌ సెక్యులర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి, యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనతాదళ్‌ కాంగ్రెస్‌ల నుండి 17మంది ఎంఎల్‌ఎలను పార్టీ ఫిరాయింపు చేయించారన్నది రహస్యమేమీ కాదు. ఫిరాయింపుదారుల్లో అత్యధికులు యడియూరప్ప మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. మరికొందరికి ఇతర పదవులు కల్పించారు. 75 ఏళ్లకు పైబడిన వారందరినీ పదవులకు దూరంగా ఉంచాలన్న నిబంధనను తోసిరాజని ఇంకా ఎక్కువ వయసున్న యడియూరప్పను తెరపైకి తీసుకురావడం వెనుక బలమైన కారణమే ఉంది. యడియూరప్ప లింగాయత్‌. ఆయన కులం వారు 16`17 శాతం వరకు రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో యడియూరప్పను అనుసరించే వారు ఎక్కువ. అందువల్ల వారందరినీ ఆకట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలంటే యడియూరప్ప అవసరం బీజేపీకి ఉంది. జనతాదళ్‌ నేత కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్‌ స్పైవేర్‌ను మోదీ అండ్‌ కో వినియోగించారన్న బలమైన ఆరోపణలున్నాయి. యడియూరప్ప వయస్సు 78 సంవత్సరాలు. నాలగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సోమవారంతో రెండేళ్లయిన సందర్భంగా ‘విజయోత్సవం’ నిర్వహించాలని నిర్ణయంచుకొన్నారు. వేడుకలు జరగ కుండానే ఆయన రాజీనామాకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఈ రెండేళ్లలో ఆయన ‘నిరంకుశ’ పాలన పట్ల ఎంఎల్‌ఎలు, చివరకు మంత్రులు, పార్టీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనను తప్పించాలని కేంద్ర నాయకత్వాన్ని కలుసుకొని కోరిన రాష్ట్ర నాయకులున్నారు. అవినీతి ఆరోపణలపై డిమాండ్‌ పెరుగుతుండటంతో తాను పదవినుండి వైదొలగవలసి వస్తుందని తెలుసుకొన్న యడియూరప్ప ఆకస్మికంగా ఛార్టడ్‌ విమానంలో హడావిడిగా దిల్లీకి చేరుకుని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామాపై చర్చ జరగలేదన్న యడియూరప్ప కొద్దిరోజులు జరిగాక కేంద్ర నాయకత్వం రాజీనామా చేయమంటే చేస్తానని మాట్లాడారు.
రాజకీయ నాయకులు మాట్లాడేదానికి, చేసే పనులకు సంబంధం ఉండదని యడియూరప్ప మాటలు తెలియజేస్తాయి. పదవిలో కొనసాగడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 450 మంది లింగాయత్‌ సాధువులు ఆదివారం సమావేశమై యడియూరప్పను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని బీజేపీ నాయకత్వాన్ని కోరుతూ, తీర్మానం చేశారు. లింగాయత్‌ కులం బలమైంది గనుక తమ డిమాండ్‌ను ఆమోదించగలరన్న ఆశాభావంతోనే ఈ తీర్మానం చేశారు. రాజకీయాల్లో కులాలు, మతాల ప్రభావం బీజేపీ అధికారంలోకి వచ్చాక మరింత పెరిగిందేకానీ తరగలేదని అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న పద్ధతులు, ఎత్తుగడలు రుజువు చేస్తాయి. యడియూరప్ప గడచిన రెండేళ్లలో వరదల సమయంలోనూ, కరోనా నియంత్రణ చర్యల్లో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు రాష్ట్రంలో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల గడువు ఉన్నప్పటికీ మరో నాయకుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. తాను మరో 15 ఏళ్లు పార్టీకి సేవ చేస్తానని యడియూరప్ప చెప్పారు. లింగాయత్‌ల్లో మరో బలమైన నాయకుడు లభించకపోతే బీజేపీకి ఆదరణ తగ్గే అవకాశాలు లేకపోలేదు. యడియూరప్ప నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎప్పుడూ పూర్తిగా ఐదేళ్లు పాలించిన సందర్భం లేదు. 2007 నవంబరులో ముఖ్యమంత్రిగా ఏడు రోజులే పనిచేశారు. 2008లో మూడేళ్ల రెండునెలలు, 2018మేలో కేవలం మూడురోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. నాలగవసారి 2019 జులై 26న ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు మాత్రమే కొనసాగి రాజీనామా చేశారు. ఆయన నిరంకుశ వైఖరే పదవిలో కొనసాగడానికి వీలులేకుండా చేసి ఉండవచ్చు. పూర్తికాలం పదవిలో ఉండలేని వ్యక్తి సమర్ధ పాలన అందించానని చెబితే నమ్మేవారు ఆయన భక్తులు మాత్రమే కావచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img