Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రాల మధ్య తంపులు పెడ్తున్న బీజేపీ

జనాన్ని చీల్చడానికి ఉన్న సకల అవకాశాలను వినియోగించు కోవడంలో బీజేపీ ఆరితేరిపోయింది. మత విద్వేషాలు పెంచి పోషించడం బీజేపీకి నరనరాన జీర్ణించుకుపోయిన వ్యవహారం. ముఖ్యంగా ముస్లింల మీద ద్వేషం పెంచడానికి బీజేపీ ఏ అవకాశాన్ని వదలదు. మన దేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని సైతం ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ఉపయోగించుకుంటూనే ఉంది. హిందీని రుద్దబోము అని చెప్తూనే హిందీని బలవంతాన వ్యాపింప చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ మరో కొత్త ఆయుధానికి పదును పెడ్తోంది. వలస కార్మికులను వేధిస్తున్నారని తమిళనాడు మీద నిరాధార ఆరోపణలు మోపుతున్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉపాధి అవకాశాలు కనిపించే రాష్ట్రాలకు పేద రాష్ట్రాల నుంచి వలస వెళ్లడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల వారు పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లడం అత్యంత సహజమైన పరిణామం. జనం మధ్య తంపులు పెట్టడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకున్న తరవాత ఇప్పుడు తమిళనాడులో బిహార్‌ నుంచి వలసవచ్చిన వారిని వేధిస్తున్నారన్న ప్రచారం మొదలు పెట్టారు. ఒకప్పుడు మహారాష్ట్రలో ఇలాంటి ప్రచారమే బాలా సాహెబ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన జోరుగా సాగించింది. ఇతర రాష్ట్రాల వారిని భయకంపితుల్ని చేసింది. కానీ మహారాష్ట్రను దేశ ఆర్థిక రాజధానిగా భావిస్తాం కనక అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వలసవెళ్లి పొట్టపోసుకునే వారు గణనీయమైన సంఖ్యలోనే ఉంటారు. మహారాష్ట్ర మహారాష్ట్రీయులదే అన్న భావనను బాలాసాహెబ్‌ ఠాక్రే శివసేనను బలోపేతం చేయడానికి బాగా వినియోగించుకున్నారు. క్రమంగా అక్కడ ఆ పరిస్థితి మారింది. ప్రస్తుతం తమిళనాడులో బిహార్‌ నుంచి వలస వచ్చిన కార్మికులను వేధిస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ కరోనా సమయంలో వేలు, లక్షల సంఖ్యలో కాలి నడకన సొంత రాష్ట్రాలకు వలస కార్మికులు వెళ్తుంటే మోదీప్రభుత్వం చేసిందేమీలేదు. కనీసం ఎంతమంది వలసకార్మికులు అలా వలస వెళ్లారో సమాచారం ఇవ్వడం కూడా మోదీ ప్రభుత్వానికి సాధ్యంకాలేదు. ఇప్పుడు మాత్రం తమిళనాడులో అధికారంలో ఉన్నది బీజేపీకి వ్యతిరేకమైన డి.ఎం.కె. కనక, బిహార్‌లోనూ నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని మహాగట్బంధన్‌ ప్రభుత్వం తమకు వ్యతిరేకమైంది కనక వలస కార్మికుల ఆసరాగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులకు ఈ దుష్ప్రచారం చేయాలన్న ఆలోచన వారి బుర్రకు తట్టిన మహదాలోచన ఏమీ కాదు. దీనివెనక కచ్చితంగా మోదీ, అమిత్‌షా ద్వయం ప్రేరేపణ ఉండే ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి కొరుకుడు పడడంలేదు. 2024 ఎన్నికలలో ఎదురుగాలి తప్పదని బీజేపీ అగ్ర నాయకత్వం గ్రహించింది కనకే వలస కార్మికుల భుజంమీద తుపాకిమోపి తమిళనాడు, బిహార్‌ ప్రభుత్వాలను భ్రష్టు పట్టించాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించడమే మోదీకి సర్వస్వం కనక ఎంత నీచానికైనా దిగజారడంలో ఆశ్చర్యపడ వలసింది ఏమీలేదు. అందుకే బీహారీలకు, తమిళులకు మధ్య కుంపటి రాజేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ 2024 సార్వత్రిక ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడిరచడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి సకల ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇది మోదీ, అమిత్‌ షా వెన్నులో ఒణుకు పుట్టిస్తోంది. ప్రతి పక్షాలను ఐక్యం చేయడానికి సాహసిస్తున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను అపఖ్యాతిపాలు చేయడానికి వలస కార్మికులను వేధిస్తున్నారన్న హేయమైన నిరాధార ఆరోపణలకు దిగారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 ఎన్నికలలో ఓటమి అనివార్యం అన్న వాస్తవం మోదీకి తెలుసు. అందుకని నానావిధ దుష్ట పన్నాగాలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు అవినీతిపరులు అని నిరూపించడానికి ఆదాయపు పన్నుశాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటి వ్యవస్థలను మోదీ సర్కారు పరిచారికలుగా మార్చేసింది. ఎన్నికల కమిషన్‌ మినహాయింపులు లేకుండా మోదీ సర్కారుకు దాసోహం అనే స్థాయికి దిగజారిన తరుణంలో ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని, ఇతర కమిషనర్లను నియమించడానికి ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పడాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన తరవాత మోదీ సర్కారును ఓటమి భయం మరింత పీడిస్తున్నట్టుంది. 

తమిళనాడులో బిహార్‌ నుంచి వలస వచ్చిన కార్మికులను హతమారు స్తున్నారన్న వదంతి వ్యాపింప చేయడానికి బీజేపీ నాయకులు సర్వ నియమ నిబంధనలను, నైతిక ప్రమాణాలను గాలికి వదిలేశారు. పైగా ఇలాంటి వదంతి ప్రచారంలో పెడ్తే స్టాలిన్‌ గానీ, నితీశ్‌ కుమార్‌ గానీ తమ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించలేరన్న ధర్మ సూక్ష్మం గ్రహించిన బీజేపీ బాహాటంగా అసత్య ప్రచారానికి తెగబడిరది. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవదానికి ప్రయత్నించడం అత్యంత సహజం కనక ప్రతిపక్షాల ఐక్యతకు వీరు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టడానికి వలస కార్మికుల భద్రత గురించి అవాస్తవాలు ప్రచారంలో పెట్టడమే ఉత్తమ మార్గం అన్న హేయమైన కుతంత్రానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో దేశ ఐక్యతకు భంగం కలిగినా బీజేపీ పట్టించుకునే స్థితిలో లేదు. ఎక్కడ ఏ పద్ధతిలో ప్రజల మధ్య తంపులు పెట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ అగ్రనేతల ప్రధాన లక్ష్యం. ఈ పన్నాగాన్ని గ్రహించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తమ రాష్ట్రంలో పనిచేస్తున్న బిహార్‌నుంచి వలస వచ్చిన కార్మికులు సురక్షితంగానే ఉన్నారని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అభయం ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారెవరూ తమిళనాడుకు వలసవచ్చి పని చేయడానికి భయపడవలసిన అవసరం లేదని స్టాలిన్‌ భరోసా ఇచ్చారు. బిహార్‌లో బీజేపీ నాయకులు వలస కార్మికుల ఇళ్లకువెళ్లి తమిళనాడులో బిహారీలను హతమారుస్తున్నారని, దాడులు చేస్తున్నారని దుష్ప్రచారానికి దిగారు. ఈ మొత్తం గాఢాంధ కారంలో ఒక కాంతి రేఖ కూడాఉంది. ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రి మీద విమర్శలు గుప్పించే స్వభావం ఉన్న బీజేపీకి అనుకూలుడైన తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి కూడా తన జగడాలమారి స్వభావాన్ని పక్కనబెట్టి బిహార్‌ నుంచి వలస వచ్చిన కార్మికులకు ఎలాంటి భయంలేదని అధికారిక ప్రకటన విడుదల చేయడం సంతోషించదగిన పరిణామం. తమిళనాడు ప్రజలు స్నేహశీలురని, మంచివారని గవర్నర్‌ చెప్పడం ఆయన వివేకానికి ప్రతీక. బీజేపీ నాయకుల కుత్సిత ప్రచారాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు గ్రహించరనుకోవడం భ్రమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img