Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్వేష రాజకీయాలను ఎండగట్టిన భారత్‌ జోడో

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా 130 రోజులపాటు 4080 కిలో మీటర్ల పొదవున రాహుల్‌ గాంధీ కొనసాగించిన భారత్‌ జోడో యాత్ర ఆదివారం సంపూర్ణమైంది. లాల్‌ చౌక్‌ దగ్గర రాహుల్‌ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 75 ఏళ్ల కింద నెహ్రు చేసిన పనే రాహుల్‌ చేశారు. సోమవారం సమాపనోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి 21 పార్టీల వారిని ఆహ్వానిస్తే 12 పార్టీలవారు మాత్రమే హాజరయ్యారు. సమాజ్‌ వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు రాహుల్‌ ఆహ్వానాన్ని బాహాటంగానే తిరస్కరించాయి. ఈ యాత్రకు రాజకీయ లక్ష్యాలు లేవని, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించింది కాదని రాహుల్‌తోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే సహా ఎంతమంది చెప్పినా రాజకీయాలపై ఈ యాత్ర ప్రభావం కచ్చితంగా కనిపించింది. ఈ యాత్ర పొడవునా రాహుల్‌ బీజేపీపై ప్రత్యక్షంగా ఎక్కడా విమర్శలు చేయకపోయినా బీజేపీ అనుసరిస్తున్న విద్వేష రాజకీయాల దుష్పరిణామాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. విద్వేషాన్ని ఎదిరించడానికి తాను ప్రేమ సందేశాన్ని తీసుకొచ్చానని రాహుల్‌ పదే పదే చెప్పిన మాట జనం చెవికెక్కింది. భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పగలిగారు. నిరుద్యోగం, సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న తీరును విడమర్చి చెప్పడంద్వారా ఆర్థికఅంతరాలు పెరుగుతున్నవైనాన్ని విడమర్చగలిగారు. కుల, మతాల ఆధారంగా సమాజాన్ని చీల్చడానికి జరుగుతున్న భీకర ప్రయత్నాలలో పొంచిఉన్న ప్రమాదాన్ని ఎత్తి చూపించగలిగారు. న్యాయవ్యవస్థ సహా, మీడియాను, చట్టాలను అమలుచేసే యంత్రాంగాలను బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌ గుప్పెట్లో పెట్టుకోవడంవల్ల ఎదురవుతున్న దుష్ఫలితాలనూ వివరించ గలిగారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఈ యాత్ర సాగిన 14 రాష్ట్రాలు, 75 జిల్లాల స్థానిక భూసమస్యలు, నీటి సమస్యలు, వనరుల లేమిని కూడా రాహుల్‌ లేవనెత్తారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికను సవాలుచేస్తూ ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రతి పాదించడంలోనూ ఈ యాత్ర సఫలమైనట్టే. అన్ని రాష్ట్రాలద్వారా ఈ యాత్ర జరగకపోయినా ఆ ప్రకంపనలు మాత్రం అన్ని చోట్లా కనిపించాయి. సకల పాలనా యంత్రాంగాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మోదీ విధానాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని రాహుల్‌ ప్రజల ముందుంచారు. ఈ యాత్ర పొడవునా కాంగ్రెస్‌తో ఏ సంబంధమూ లేని సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, కళా కారులు, రచయితలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగ విరమణచేసిన సైనికాధికారులు, ఒకప్పుడు గూఢచారులుగా పనిచేసిన వారు కూడా మమేకం అయ్యారు. ఇది విద్వేష రాజకీయాలతో భిన్నవర్గాలు ఎంతగా విసిగిపోయాయన్న వాస్తవానికి నిదర్శనం. అదే సమయంలో ఉపేక్షకు గురైన, అణగారినవర్గాల వారి గుండె చప్పుడును కూడా రాహుల్‌ శ్రద్ధగావిన్నారు. ఇది  వర్గాలలో విశ్వాసం కలిగించింది. ముఖ్యంగా యాత్రసమాప్తం అయిన శ్రీనగర్‌లో మూడేళ్లుగా ఊపిరాడని పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలు తమ గోడు వినిపించే అవకాశం వచ్చింది. రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని తమ ప్రభుత్వం రద్దు చేసినందువల్లే రాహుల్‌ యాత్ర ప్రశాంతంగా ముగిసిందని బీజేపీ స్వోత్కర్షల సారాన్ని జనం గ్రహించక పోరు. 

పాత రాహుల్‌ను అంతమొందించాను అని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ యాత్ర ఆయన వ్యక్తిత్వంలో, దృక్పథంలో వచ్చిన మార్పుకు సంకేతం. ఆనువంశింక రాజకీయాల వారసుడు అన్న ముద్ర చెరిపేసుకునే ప్రయత్నం కనిపించింది. రాహుల్‌కు నైతిక శక్తి పెరిగింది. ప్రజలను జాగృతం చేయడానికి ఈ యాత్ర ఉపకరించింది. అయిదు నెలలుగా పడ్డ శ్రమ పర్యవసానం ఏమిటోకూడా తేలాల్సిఉంది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలలో దీని ప్రభావం ఎంతుందో తెలుసుకోవడానికి ఒక కొలమానంగా ఉపకరిస్తుంది. ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగినా కలగకపోయినా ప్రత్యామ్నాయ రాజకీయ దృక్కోణాన్ని అందించడానికి మాత్రం ఇది బాగా ఉపయోగపడిరది. ఈ యాత్ర సమాపనోత్సవానికి సి.పి.ఐ. ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు, డి.ఎం.కె. అధినేత స్టాలిన్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, బీ.ఎస్‌.పి., ఆర్‌.ఎస్‌.పి., ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, తదితర నాయకులు హాజరు కావడం బీజేపీ రాజకీయాల మీద ఉన్న వ్యతిరేకతను ప్రతిఫలిస్తోంది. కశ్మీర్‌లోని ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ముగింపు ఉత్సవానికి పాల్గొనడం సానుకూల పరిణామమే. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి సిద్ధమైన కొంతమంది ప్రతిపక్ష నాయకులు వివిధ కారణాలవల్ల హాజరై ఉండకపోవచ్చు. దేశంలోని సెక్యులర్‌ పార్టీలన్నీ సమైక్యం కావాలని సీ.పి.ఐ. అగ్ర నాయకుడు డి. రాజా పిలుపు ఇచ్చారు. దేశ స్వాతంత్య్రంకోసం మనం అందరం కలిసి పోరాడి దేశాన్ని వలసవాదం నుంచి విముక్తం చేసుకున్నామనీ, ఇప్పుడు బీజేపీ నుంచి విముక్తం కావడానికి పాటు పడాల్సిన ఆవశ్యకతను రాజా గుర్తు చేశారు. మోదీని గద్దె దించాలన్న సంకల్పం ప్రధాన ప్రతిపక్షపార్టీలలో ఉన్నా, కొన్ని ప్రాంతీయ పార్టీలు సమైక్య ప్రతిపక్షానికి సహకరించడం లేదు. ప్రతిపక్షపార్టీలతో పాటు కలిసి ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే తప్ప మోదీని గద్దె దించాలన్న లక్ష్యం నెరవేరదు. ప్రతిపక్షాలకు నాయకత్వం ఎవరిది అన్న చర్చ ఈ దశలో అనవసరం. రాహుల్‌యాత్ర ప్రారంభమైనప్పుడు పెదవి విరిచిన వారందరూ వచ్చిన ఆదరణచూసి అవాక్కై పోవలసి వచ్చింది. ఈ యాత్రను రాహుల్‌ నదీ ప్రవాహంతో పోల్చారు. అది అక్షరాలా నిజమైంది. కేవలం పాదయాత్ర సఫలమైనంత మాత్రాన ఫలితం ఉండదు. సైద్ధాంతిక స్పష్టత అన్నింటికన్నా ముఖ్యం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కనిపించిన సిద్ధాంత నిబద్ధత మధ్యలో మటుమాయమైంది. దాన్ని పునరుద్ధరించడానికే రాహుల్‌ విశ్వప్రయత్నం చేశారు. ఈ యాత్ర ప్రకంపనలు కాంగ్రెస్‌ను ఏ మాత్రం ప్రభావితం చేస్తాయి, వాటిని సంఘటితం చేయడంలో కాంగ్రెస్‌ ఏ మేరకు సఫలం అవుతుందన్నది వేచి చూడవలసిన అంశమే. యాత్ర పొడవునా రాహుల్‌ ఎక్కడా బీజేపీని నేరుగా సవాలుచేయకుండా జాగ్రత్త పడ్డారు. యాత్రచూపిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రజలు ఏ మేరకు ఆహ్వానిస్తారో కూడా భవిష్యత్తులో నిర్ధారణ కావలసిందే. ముందు అసలు ప్రజల ఆలోచన ఏమిటో తేలాలి. యాత్ర సఫలమైనా అసలు కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. భవిష్యత్‌ కార్యాచరణకు ఈ విజయం నిర్దిష్ట మార్గాన్ని నిర్దేశించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img