Friday, April 26, 2024
Friday, April 26, 2024

శరద్‌ పవార్‌ అంతరంగ మథనం

అరవై మూడేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.) అధినేత శరద్‌ పవార్‌ ప్రవర్తన ఇటీవల అంతుపట్టకుండా తయారైంది. శరద్‌ పవార్‌ రాజకీయాలలోకి ప్రవేశించి 63 ఏళ్లు అయిన సందర్భంగా ఒక భారీ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సభలోనే పవార్‌ ఆత్మకథ కూడా ఆవిష్క రించారు. అంతా పండగ వాతావరణం, సందడి అలుముకుని ఉన్న సమయంలో ఎన్‌.సి.పి. అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి శరద్‌ పవార్‌ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన రాజీనామా చేయడానికి వీలు లేదని పార్టీలోని ప్రముఖ నాయకులతో పాటు కార్యకర్తలు పట్టుబట్టారు. ఒక వేళ శరద్‌ పవార్‌ కనక రాజీనామా ఉపసం హరించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కొందరు కార్యకర్తలు సిద్ధ పడ్డారు. దీనితో శరద్‌ పవార్‌ తన నిర్ణయాన్ని రెండు మూడు రోజుల్లో పునరాలోచించుకుంటానని చెప్పాల్సి వచ్చింది. 38వ ఏట ముఖ్యమంత్రి అయి ఆ పదవిని నాలుగు సార్లు నిర్వహించిన పవార్‌ ఇలాంటి నిర్ణయం ప్రకటించడం, అందులో ఊగిసలాట ధోరణి కనిపించడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఎన్‌.సి.పి. మీద ఇప్పటికీ పవార్‌కు తిరుగులేని పట్టు ఉంది. ఆయన మాటకు ఎదురు లేదు. కానీ ఆయన అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ ధోరణి ఎన్‌.సి.పి.లో విభేదాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలకు తావిస్తోంది. 2019నవంబర్‌ 23న బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆశ్చర్య పరచింది. తాను కూడా దిగ్భ్రాంతికి గురయ్యానని శరద్‌ పవార్‌ తన ఆత్మకథలో కూడా రాశారు. ఇటీవల శరద్‌ పవార్‌ ప్రవర్తన కూడా ఆయన సైద్ధాంతిక నిబద్ధతలో మార్పు వస్తోందని సూచనప్రాయంగా అనిపించింది. ఆయన అదానీని వెనకేసుకొచ్చారు. పైగా అదానీ స్వయంగా శరద్‌ పవార్‌ ఇంటికొచ్చి వెళ్లారు. అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి సం యుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి.) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో కోరితే దానివల్ల అట్టే ప్రయోజనం ఉండదని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. అజిత్‌ పవార్‌ బీజేపీతో చేతులు కలుపుతారేమోనన్న సంకేతాలూ వచ్చాయి. వీటిని పరిశీలిస్తే శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌.సి.పి. బీజేపీకి చేరువ అవుతుందేమోనన్న అనుమానాలూ కలిగాయి. అజిత్‌ పవార్‌ ఏమైనా సరే అధికారంలో ఉండాలనుకుంటున్నట్టు స్పష్టం అవుతూనే ఉంది. శరద్‌ పవార్‌కు ఉన్న బీజేపీ వ్యతిరేకత అజిత్‌ పవార్‌కు ఉందనుకోవడానికి ఆస్కారం లేదు. 82 ఏళ్ల శరద్‌ పవార్‌ రాజకీయాలలో చేపట్టిన పదవులు చిన్నవేం కావు. కేంద్రంలో ఆయన సుదీర్ఘ కాలం మంత్రిగా ఉన్నారు. అదీ కీలక శాఖలే నిర్వహించారు. ఒక దశలో అయితే ఆయన ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నారన్న వార్తలూ వచ్చాయి. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రధాని పదవిని ఆశించడం అత్యాశ ఏమీ కాదు. శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ నుంచి విడిపోయి ఎన్‌.సి.పి.ని ఏర్పాటు చేయడానికీ ప్రబలమైన కారణమే ఉంది. సోనియా గాంధీ విదేశీ మహిళ కనక ఆమె ప్రధాని పదవిని చేపట్టడానికి ఆయన విముఖంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. కానీ ఎన్‌.సి.పి. సిద్ధాంతాలకు, కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు పొసగనిది అంతగా ఏమీ లేదు. అందుకే చాలా కాలం నుంచి పవార్‌ పార్టీ కాంగ్రెస్‌తో సఖ్యంగానే ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్‌తో విభేదాలున్న దాఖలాలేమీ లేవు.
అత్యంత క్లిష్ట సమయంలో మహారాష్ట్ర రాజకీయాలలో శరద్‌ పవార్‌ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల తరవాత ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం ఉదంతం తరవాత ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేనను, కాంగ్రెస్‌ ను కలిపి మహా వికాస్‌ అగాధీని ఏర్పాటు చేసి మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన సూత్రధారి శరద్‌ పవారే. ఏక్‌ నాథ్‌ షిండే తిరుగుబాటు చేయడంవల్ల గత సంవత్సరంలో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తరవాత కూడా మహా వికాస్‌ అగాధీని కలిపి ఉంచడానికి శరద్‌ పవార్‌ తీవ్రంగానే ప్రయత్నించారు. శివసేనలోని ఉద్ధవ్‌ వర్గం, ఏక్‌ నాథ్‌ షిండే వర్గం మధ్య రగడ సుప్రీంకోర్టుకు ఎక్కింది. వచ్చే 15వ తేదీ లోగా తీర్పు వెలువడవలసి ఉంది. విచారణ క్రమంలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు షిండేను నిలదీసేవిగానే ఉన్నాయి. షిండే చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి అప్పటి గవర్నర్‌ కోషియారీ అనుసరించిన విధానాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. సుప్రీంకోర్టు కనక షిండేకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే ఆ ప్రభుత్వమూ పడిపోవచ్చు. అలా జరుగుతుందన్న ఆశతోనే అజిత్‌ పవార్‌ ఈ మధ్యే బీజేపీతో చేయి కలపడానికి ప్రయత్నించారు. అజిత్‌పవార్‌ వైఖరి శరద్‌ పవార్‌కు నచ్చినట్టు లేదు. కానీ బహిరంగంగా అజిత్‌పవార్‌ను అభిశంసించిన సందర్భమూ లేదు. నిజానికి ఎన్‌.సి.పి.లో అజిత్‌పవార్‌కు సముచిత స్థానమే ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడల్లా ఆయనకు మెరుగైన పదవులే కట్టబెట్టారు.
అజిత్‌పవార్‌ మీద శరద్‌పవార్‌కు అపనమ్మకం ఉందని అనుకోవ డానికి వీలు లేకపోయినా అజిత్‌ చూపుతున్న ఆత్రుత ఆయనను కలవర పెడ్తున్నట్టు ఉంది. అయితే ఎన్‌.సి.పి. అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని ప్రకటించడానికి ఎంపిక చేసుకున్న సమయం అనువైంది కాదనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల మహారాష్ట్ర సహకార సంఘాలకు జరిగిన ఎన్నికలలో మహా వికాస్‌ అగాధీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్షంలో ఉన్న సంఘటనకు ఇది ఉత్సాహకరమైన పరిణామమే. అలాంటప్పుడు అనుకూల వాతావరణం ఉన్న సమయంలో పవార్‌ ఎందుకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనుకున్నారో ప్రశ్నగానే మిగిలిపోతోంది. అధ్యక్షస్థానం నుంచి తప్పుకున్నా రాజకీయాలలో, ప్రజా జీవనంలో కొనసాగుతానని కూడా శరద్‌ పవార్‌ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కమిటీ ఏర్పాటు చేయాలనీ, అందులో ఫలానా వారు ఉండాలనీ శరద్‌పవార్‌ సూచించారు. అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో శరద్‌ పవార్‌ దిట్ట. మరి ఆయన రాజీనామాచేయాలని అనుకోవడానికి కారణంఏమిటి అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అజిత్‌ పవార్‌ లాంటి వారి అత్యుత్సాహం వల్ల పార్టీ విచ్ఛిన్నం కాకూడదని శరద్‌ పవార్‌ అనుకున్నట్టున్నారు. కార్యకర్తల ఒత్తిడికి లొంగి పునరా లోచిస్తానని చెప్పారంటే అధ్యక్షస్థానంలో కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినిబట్టి చూస్తే పవార్‌ తీవ్ర అంతరంగ మథనానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఉద్ధవ్‌ ఠాక్రేకు ఉన్న జనాదరణ పదిలం గానే ఉంది. అలాంటప్పుడు తాను శ్రమపడి ఏర్పాటు చేసిన కూటమికి నష్టం కలిగించే అలోచన శరద్‌ పవార్‌కు ఉంటుందనుకోలేం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img