Friday, April 26, 2024
Friday, April 26, 2024

సర్కారు దేవులాట – ప్రజల నిర్లక్ష్యం

రెండోవిడత కరోనా తగ్గుముఖంపడ్తున్న ఛాయలు కనిపిస్తున్న తరుణంలో కొన్ని ప్రాంతాలలో కరోనా కేసులు పెరగడం ఆందోళనకరంగా ఉంది. దేశ జనాభాలోని 67.6శాతం మందికి కరోనాను నిరోధించగలిగే ప్రతిరక్షక పదార్థం ఉందని ప్రభుత్వం అంచనా. అయినా ఈశాన్య రాష్ట్రాలలో, కేరళలో కొత్త కేసులు పెరుగుతున్నాయన్న దిగులు పెరుగుతున్న దశలో కర్నాటక కూడా ఇదే జాబితాలో చేరడం భయం గొల్పే పరిణామమే. మే నెలలో దేశ వ్యాప్తంగా రోజుకు నాలుగు లక్షల మందికి కరోనా సోకిన తీవ్ర దశ నుంచి చాలా తక్కువ కేసులు నమోదు అయ్యే స్థితికి చేరుకోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. మరో వేపున మూడో దశ ముప్పు ఉండనే ఉందన్న సమాచారంతో పాటు ఈ దశ అంత ప్రమాదకరం కాదన్న వార్తలు కొంత ఊరట కలిగించాయి. కానీ నెమ్మదిగా మళ్లీ కరోనా కేసులు రోజుకు 44,000కి చేరడంవల్ల భయం వెంటాడుతూనే ఉంది. కేరళలో మళ్లీ రోజుకు 20-22 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల్లో కేరళలోని కేసులే 37 శాతం ఉన్నాయి. దీనితో లాక్‌ డౌన్‌ విధించవలసి వస్తే మరి కొన్ని రాష్ట్రాలలో నిబంధనలు అమలు చేయక తప్పలేదు. కేరళలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి తోడ్పడేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపవలసి వచ్చింది. కర్నాటకలో సైతం రెండు రోజుల కింద కేసులు ఒక్కుమ్మడిగా పెరిగాయి. బెంగళూరులో ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ఇంతవరకు 45.55 కోట్ల డోసుల టీకాలు వేయించారు. అయితే ఇందులో రెండు డోసులూ టీకా వేయించుకున్న వారు తక్కువే. కేసులు పెరుగుతున్న బెడద ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కూడా ఉంది. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అస్తవ్యస్త విధానాల నుంచి బయటపడనే లేదు. టీకా ధరల్లోనే కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు మరికొంత ఎక్కువ ధర, ప్రైవేటుకైతే మరింత అధిక ధర అనుమతించడం విమర్శలకు దారి తీసింది. ఒకసారి 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు టీకా వేసే బాధ్యత అప్పగించడం లాంటి విధానాలు అనుసరించింది. తీరా టీకాలు వేయించుకోవడానికి జనం బారులు తీరగానే అన్ని చోట్ల టీకా ఔషధ కొరత ఆవహించింది. మొదటి దశ టీకా వేయించుకున్న వారు సమయానికి రెండో దశ టీకా వేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఈ కొరత కారణంగా టీకాలు సేకరించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని మొరపెట్టు కోవడంతో మోదీ సర్కారు తన విధానాన్ని మార్చుకోక తప్పలేదు. ఏ రాష్ట్రమూ టీకాలు వేయించే బాధ్యత మేం తీసుకుంటామని చెప్పలేదు. మీ వల్ల కాకపోతే మాకైనా అవకాశం ఇప్పించండి అని కొన్ని రాష్ట్రాలు కోరడం నిర్వేదం కారణంగానే. ఇతర దేశాల టీకాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతించినప్పుడు ఆ దేశాలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే టీకా ఔషధం ఎగుమతిచేస్తామని చెప్పడంతో కేంద్ర మళ్లీవిధానం మార్చుకోవలసి వచ్చింది. ప్రైవేటురంగానికి 25శాతం టీకాలు వేసే అవకాశం కల్పించినా ప్రైవేటు ఆసుపత్రులనూ కొరత వెంటాడుతూనే ఉంది.
టీకాలు వేయించే విధానాన్ని సమీక్షించడానికి మోదీ మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కరోనాను ఎదుర్కోవడానికి కేటాయించిన రూ. 30,000 కోట్లు ఏ పద్ధతిలో ఎందుకోసం ఖర్చు పెట్టారో తెలియదు. పి.ఎం.కేర్స్‌ నిధులకైతే లెక్కా పత్రం అడిగే అవకాశమే లేదు. ఈ పథకం నుంచి వెంటిలేటర్లు మొదలైనవి కొంతమేర సరఫరా చేశారట. అయితే అవి లోపభూయుష్టంగా ఉండడం, మొరాయించడం, శిక్షణ పొందిన నిపుణులు లేనందువల్ల నిరుపయోగంగా పడి ఉండడం వంటి ఫిర్యాదులు జోరుగా వినిపించాయి. ఆక్సిజన్‌ దొరకక వందలు, వేల సంఖ్యలో కరోనా రోగులు వివిధ ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలితే మరణానికి కారణాలను పేర్కొనేటప్పుడు కానీ, శవ పరీక్షలు జరిపినప్పుడు కానీ ఆక్సిజన్‌ కొరతతో మరణించినట్టు నమోదు చేసే విధానం లేదట. దీన్ని ఆసరాగా చేసుకుని కేంద్రం ఆక్సిజన్‌ అందక ఒక్కరు కూడా మరణించలేదు అని బుకాయించింది. మరణాల సంఖ్యను తగ్గించి చూపడం ఈ బుకాయింపులో భాగమే. శ్మశానాల్లో కూడా చోటు దొరకని విచిత్ర పరిస్థితి దాదాపు అన్ని నగరాల్లో ఎదురైంది. ఏప్రిల్‌లో టీకాల కొరత విపరీతంగా ఉండడంతో మోదీ ప్రభుత్వం హఠాత్తుగా విధానాన్ని మార్చింది. రాష్ట్రాలకు బాధ్యత అప్పగించడంవల్ల ఉపయోగం లేదని తెలిసిన తరవాత విధానం మరోసారి మారింది. ప్రభుత్వ విధానం కరోనా దారిపొడవునా గందరగోళంగా, చిక్కుముడులతో కూడి ఉంది. సవ్యమైన విధానాన్ని అనుసరించిన దాఖలాలే లేవు. కడకు సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సి వచ్చింది. తాము అస్తవ్యస్త విధానాలను అనుసరించినట్టు మోదీ సర్కారూ ఎన్నడూ ఒప్పుకోదు కాని మారిన విధానమల్లా తమ ఘనతే అన్న రీతిలో వ్యవహరిస్తుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా టీకాలు వేయించుకునే సదుపాయాన్ని మాత్రం వెనక్కు తీసుకోలేదు. ప్రైవేటు ఆసుపత్రులు అధిక ధర వసూలు చేయడానికి కల్పించిన అవకాశాన్ని సవరించనే లేదు. ప్రైవేటు రంగానికి 25 శాతం టీకాలు అందుబాటులో ఉంచినప్పటికీ మే ఒకటి నుంచి జులై 15 దాకా ఆ రంగం వినియోగించుకున్నది కేవలం ఏడుశాతమే. అందుకని ప్రైవేటుఆసుపత్రుల కోటా తగ్గించనూ వచ్చు. అదే జరిగితే మోదీ సర్కారు ఇంకా చీకట్లో దేవులాడుతున్నట్టే. చాలా దేశాలు టీకాలు ఉచితంగానే వేయిస్తున్నాయి. అమెరికాలాంటి దేశాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు వేయించుకున్నా ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది. ప్రజలు డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు వేయించుకునే అవకాశం కల్పిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని, టీకా ఔషధోత్పత్తీ పెరుగుతుందని మోదీ సర్కారు వాదించింది. తీరా జరిగిందేమిటంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవాలంటే అధికమొత్తం చెల్లించక తప్పలేదు. కలిగిన వారికి కూడా ప్రైవేటులో చెల్లించవలసిన ధరఎక్కువే అనిపించింది. ఇలాంటివిపత్తులు ఎదురైనప్పుడు అందరికీ టీకాలు అందుబాటులో ఉంచే బాధ్యత ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని సర్కారు ఎన్నడూ పట్టించుకోలేదు. పోలియో టీికాలు ఉచితంగా వేయిస్తున్నప్పుడు కరోనా టీకా విషయంలో వివక్ష ఎందుకో! ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందన్న కారణంగా సినిమా హాళ్లతో సహా ఒక్కో రంగాన్నీ బార్లా తెరవడంతో జన సంచారం విచ్చలవిడి అయింది. 40 శాతం మంది నిబంధనలను ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలకు జనం నిర్లక్ష్యం తోడైతే పరిస్థితి విషమించక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img