Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్ఫూర్తితో సరితూగని పని తీరు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు బయట సభల్లో సమావేశాల్లో చాలా ఉదారంగా, కొన్ని సార్లు విప్లవాత్మకంగా మాట్లాడతారు. అలాంటి ప్రసంగాలు విన్నప్పుడు వారికి ఎంత నిబద్ధత ఉందో అని ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ న్యాయ నిర్ణయ పీఠం మీద ఉన్నప్పుడు చాలా మంది న్యాయమూర్తుల్లో ఈ ధోరణి కనిపించదు. శుక్రవారం పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ సైతం దీనికి అతీతం కాదు అనిపించారు. కోర్టు వెలుపల ఆయన మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా, ఉద్వేగభరితంగా ఉండేవి. పౌరుల హక్కుల గురించి, రాజకీయ వ్యవస్థలో ప్రతిపక్షాలు అంతకంతకూ బలహీనపడడం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది అని ఆయన అన్నప్పుడు ఆయన హయాంలో వీటికి రక్షణ ఉంటుందని అనుకున్నాం. న్యాయ స్థానాల్లో జడ్జీలను సమయానికి నియమించనందుకు, న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాలు కొరవడుతున్నందుకు, కేసులు పేరుకు పోతున్నందుకు న్యాయమూర్తి రమణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ధోరణిలోనే మాట్లాడారు. సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం అందాలని పదే పదే చెప్పారు. దేశద్రోహ చట్టం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆచరణలో మార్పు వస్తుందన్న ఆశ చిగురింప చేశాయి. కానీ ఆ కిరాతక చట్టం అలాగే ఉంది. అంతకు ముందు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న దీపక్‌ మిశ్రా, రంజన్‌ గొగోయ్‌, ఎస్‌.ఎ.బోబ్డే హయాంలో జరగని న్యాయం జరుగుతుం దనుకున్నాం. కానీ ఆయన ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన 16 నెలల కాలంలో ఇచ్చిన తీర్పులు ఆ ధోరణిలో లేవు. కీలకమైన చాలా కేసులను ఆయన హయాంలో పరిష్కరించకుండానే వదిలేశారు. చాలా ముఖ్యమైన, రాజ్యాంగపరమైన కేసులను ముట్టుకోనే లేదు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపం, హిజాబ్‌ పై కర్నాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ లాంటివి కూడా న్యాయమూర్తి రమణ పదవీకాలంలో చర్చకే రాలేదు. కశ్మీర్‌ కు వర్తించే 370వ అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం లాంటి కీలకమైన అంశాలను విచారిస్తామని ఆయన ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. ప్రజల ప్రాథమిక హక్కులకు రమణ పూచీ పడతారన్న ఆశా నెరవేరలేదు. హరిద్వార్‌ ధర్మ సన్సద్‌ లో విద్వేష ప్రసంగం చేసి మైనారిటీలలో అభద్రతను సృష్టించిన వ్యక్తికి మాత్రం సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. భీమా కోరేగావ్‌ కేసులో అనేకమంది ప్రముఖులు నాలుగేళ్లుగా నిర్బంధంలోనే ఉన్నారు. ఈ విషయం చర్చకే రాలేదు. ఈ కేసులో నిందుతుడైన స్టాన్‌ స్వామి నిర్బంధంలోనే ప్రాణాలు విడిచినా ఈ కేసును సత్వరం విచారించడానికి ప్రయత్నమే జరగలేదు. పైగా గుజరాత్‌ మారణ కాండ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ ను జైలులో పెడ్తే సుప్రీంకోర్టు చలించనే లేదు. గిరిజనులను చట్టబాహ్యంగా ఎన్‌ కౌంటర్లలో హతమార్చడాన్ని సవాలు చేస్తూ హిమాంశు కుమార్‌ పెట్టుకున్న పిటిషన్‌ తో మేలు జరగకపోగా న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్విల్కర్‌, జె.బి.పార్దీవాలా పిటిషనర్‌ కు అయిదు లక్షల రూపాయల జరిమానా విధించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ తీర్పుతో న్యాయమూర్తి రమణకు సంబంధం లేకపోవచ్చు కానీ ఆయన హయాంలో వెలువడిరదే. డబ్బు అక్రమ చెలామణిని నిరోధించే చట్టాన్ని (పి.ఎం.ఎల్‌.ఎ.) ప్రభుత్వం విపరీతంగా దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను అణచడానికి వినియోగిస్తోంది. 2011 తరవాత ఈ చట్టం కింద నిర్బంధానికి గురి అవుతున్న వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2019 లో ఈ చట్టాన్ని సవరించి కొత్త కోరలు సమకూర్చినప్పటినుంచి ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ఇది బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడ్తోంది. ఈ కేసుల్లో శిక్ష పడిరది మాత్రం తొమ్మిది మందికే. ఈ చట్టాన్ని సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఆ కిరాతక చట్టాన్నే సమర్థించింది. ఇది న్యాయమార్గ పాలనను మంటగల్పుతోంది. ఈ కేసూ న్యాయమూర్తి రమణ హయాంలో తేలనే లేదు.
రాజకీయ నాయకులు, పత్రికా రచయితలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఇలా అనేక మంది మీద నిఘా వేయడానికి ప్రభుత్వం పెగాసస్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ను వినియోగిస్తోందన్న కేసు న్యాయమూర్తి రమణ పదవీ విరమణ చేయడానికి ఒక రోజు ముందు ప్రస్తావనకు వచ్చింది. కానీ గురువారం జరిగిందల్లా పెగాసస్‌ పై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్‌ నాయకత్వంలో నియమించిన కమిటీ నివేదికను ప్రస్తావించడంతోనే సరిపోయింది. ఈ కమిటీ నివేదికలో కొత్తగా తెలిసిన విషయమల్లా ప్రభుత్వం ఈ కమిటీకి సహకరించలేదనే. నిజానికి ఇదీ కమిటీ కనిపెట్టిన బ్రహ్మ రహస్యమేమీ కాదు. ఇదివరకు సుప్రీంకోర్టులో పెగాసస్‌ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దేశ భద్రత చాటున గూఢచర్యాన్ని కప్పిపుచ్చుకుంది. కనీసం ప్రమాణ పత్రం (అఫిడవిట్‌) దాఖలు చేయడానికీ మోదీ సర్కారు అంగీకరించలేదు. ఒత్తిడి చేసిన తరవాత దాఖలు చేసిన పరిమితమైన అఫిడవిట్‌ లోనూ అసలు విషయం చెప్పనే లేదు. వివరమైన అఫిడవిట్‌ దాఖలు చేయడం కుదరదని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు కిమ్మనలేదు. పైగా పెగాసస్‌ రగడపై దర్యాప్తు చేయడానికి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ విచారణా సంఘాన్ని నియమిస్తే ఆ సంఘం పని చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయమూర్తి రమణ హయాంలోనే. పెగాసస్‌ వాడారా లేదా అన్న ఒకే ఒక్క ప్రశ్నకు కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టలేకపోయింది. సమాధానం ఇవ్వకపోవడమే ప్రభుత్వం పెగాసస్‌ ను వినియోగిస్తుందనడానికి తార్కాణం అయినా చేసిందేమీ లేదు. అయితే ఈ కేసు విచారణ పూర్తి కాలేదు కనక మోదీ సర్కారు బోనులోంచి బయటపడ్డట్టు కాదు. పౌరుల హక్కులను కాల రాస్తుంటే సుప్రీంకోర్టు నిశ్చేష్టంగా మిగిలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 370వ అధికరణం, పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన న్యాయమూర్తి లలిత్‌ పదవీ కాలంలో తేలే అవకాశాలు తక్కువ. న్యాయమూర్తి రమణ హయాంలో జరిగిందల్లా న్యాయవ్యవస్థకు కొన్ని మౌలిక సదుపాయాలు సమకూరాయి. డాదాపు 11 మంది న్యాయ మూర్తులను నియమించగలిగారు. హైకోర్టుల్లోనూ ఖాళీలు తగ్గాయి. అన్నింటికన్నా మించింది ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులయ్యారు. ఉపన్యాసాలకు తీర్పులకు సంబంధం ఉండదన్న అపప్రథను న్యాయమూర్తి రమణ కూడా తొలగించలేకపోయారు. ఆయన ఆలోచనలు ఆచరణలోకి రాకపోవడం నిరాశనే మిగులుస్తుంది. హక్కులకు భంగం కలిగించే చర్యలు నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడడం, రాజ్యాంగ పరిరక్షణ, న్యాయమార్గ పాలన కొనసాగేట్టు చూడడమూ సుప్రీంకోర్టు బాధ్యతే. ఫ్రజలకు ఆఖరి దిక్కు అత్యున్నత న్యాయస్థానమే అన్న భరోసా స్ఫూర్తిదాయకమైన న్యాయమూర్తి హయాంలో కూడా కలగకపోవడం పెద్ద లోటే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img