Friday, September 22, 2023
Friday, September 22, 2023

సమష్టి యత్నమే శ్రీలంకకు మార్గం

శ్రీలంక భౌగోళికంగానే కాదు రాజకీయంగా నడిసంద్రంలో ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం క్రమంగా ఆ దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. సర్వాధికారాలు ఉన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికి రాజీనామా చేయలేదు కాని ఆయన ఆచూకీ కూడా తెలియడం లేదు. దేశం వదిలి పారిపోవడానికి మార్గాన్వే షణలో ఉన్నట్టున్నారు. ఆయన వీసాను అమెరికా తిరస్కరించింది. అయితే బుధవారం అధ్యక్ష స్థానానికి గొటబాయా రాజీనామా చేయవచ్చునంటున్నారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష స్థానం ఖాళీ అయితే తాత్కాలికంగా ప్రధానమంత్రి ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. ఇటీవలే ప్రధానమంత్రిగా నియమితులైన రణిల్‌ విక్రమ సింఘే భవిష్యత్తు కూడా పదిలంగా లేదు. రాజీనామా చేయాలని ఆయన మీదా విపరీతమైన ఒత్తిడి ఉంది. శనివారం ప్రజలు భారీ సంఖ్యలో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. అంతకు ముందే అధ్యక్షుడు అధ్యక్ష స్థానం వదిలి వెళ్లారు. ఆయన సామాన్లు కూడా తరలించారని చెప్తున్నారు. గొటబాయా ఇంట్లో ఉంటే ప్రజల ప్రవర్తన ఎలా ఉండేదో ఏమో కానీ లేరు కనక అక్కడ గొటబాయా గడిపిన విలాసవంతమైన జీవన సరళి ప్రజలకు ఆశ్చర్యంతో పాటు జుగుప్స కూడా కలిగించింది. కొందరికి అధ్యక్ష భవనంలో ఉన్న ఖరీదైన పడకలు, సోఫాల మీద పడి దొర్లడం సరదా అయిపోయింది. మొత్తం మీద ఇంతవరకు ప్రజలు శాంతియుతం గానే వ్యవహరిస్తున్నారు. రణిల్‌ విక్రమ సింఘే ఒక్కడే తమ పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అయినా ఆయనకు పరిపాలనానుభవం ఉంది కనక దేశాన్ని గట్టెక్కిస్తారని గొటబాయా రాజపక్స ఆశించినట్టున్నారు. కానీ మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మీదే ప్రజలకు ఆగ్రహం ఉంది కనక రణిల్‌ విక్రమ సింఘేను కూడా భరించే స్థితిలో లేరు. కానీ అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేస్తే ప్రధానమంత్రి స్థానంలో కూడా ఎవరూ లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ మొత్తంగా పతనం అయినట్టు అవుతుంది. అరాచకం రాజ్యమేలు తుంది. అలాంటి స్థితిలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నా ఆశ్చర్య పడవలసింది లేదు. సైన్యాధ్యక్షుడు ఇప్పటికే ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలా సైన్యాధ్యక్షుడు ప్రకటించడం అసాధారణం. అందువల్ల ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశ సైన్యానికి ఉందేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. బలమైన రాజపక్స వంశం 2019లోనే మంచి మెజారిటీతోనే అధికారంలోకి వచ్చింది. కానీ త్వరలోనే ప్రజాభిమానాన్ని కోల్పోయింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇవి పరస్పర ఆధారితమైనవి. రాజపక్స కుటుంబం శ్రీలంకను తమ సొంత జాగీరుగా మార్చేసింది. ప్రత్యక్షంగా ఆ వంశానికి చెందిన 18 మంది మంత్రులుగానో మరో బాధ్యతాయుతమైన పదవుల్లోనో ఉన్నారు. అంత కీలకం కావనుకున్న పదవులను కూడా లెక్కలోకి తీసుకుంటే రాజపక్స కుటుంబానికి చెందిన 40 మందికి ఏదో ఓ పదవి ఉంది. దీనితో వారం దరికీ అధికార మదాంధత తలకెక్కినట్టుంది. తమకు ఎదురు లేదనుకు న్నారు. రెండవది నికరమైన ఆర్థిక విధానాల మీద ఏమాత్రం శ్రద్ధ చూప లేదు. అంతా విచ్చలవిడితనమే. ఇతర దేశాలకు చెల్లించవలసిన అప్పులు బకాయి పడ్డారు. విదేశీ మారక ద్రవ్య నిలవలు ఒట్టి పోయాయి. శ్రీలంక ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడిన దేశం. ఆహార పదార్థాలతో సహా అనేక నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకుంటే తప్ప రోజు గడవని స్థితి. విదేశీ మారక ద్రవ్య నిలవలు ఇంకి పోవడంవల్ల దిగుమతు లకు అవకాశం లేకుండా పోయింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక దివాలా ఎత్తింది. అయితే సార్వభౌమాధికారం ఉన్న దేశం కనక నోట్లు ముద్రించి దివాలా ఎత్తకుండా చూసుకున్నారు. ఇది సహజంగానే భరించ లేని ద్రవ్యోల్బణానికి దారి తీసి ప్రజల నిత్య జీవితం దుర్భరమైంది. దీనితో ప్రజలు ఇక ఎంత మాత్రం రాజపక్స కుటుంబాన్ని సహించలేని స్థితికి వచ్చేశారు.
గొటబాయ రాజపక్స రేపో మాపో రాజీనామా చేయవచ్చు. ప్రత్యా మ్నాయం ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న. ప్రతిపక్షానికి కూడా అధికారం చెలాయించేంత బలం లేదు. అంటే అన్ని పక్షాలు కలిసి ప్రస్తుతానికి జాతీయ ప్రభుత్వంలాంటిది ఏర్పాటు చేసి కనీస ఉమ్మడి కార్యక్రమం ఏదో రూపొందించుకుని తక్షణ సంక్షోభం నుంచి బయటపడడం ఒక్కటే మార్గం. ఆ దిశగా అన్ని పక్షాలు కదలకపోతే సంక్షోభం మరింత తీవ్రం కావడమే కాదు అల్లకల్లోల పరిస్థితి అనివార్యం అవుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు కూడా ఈ ఆపత్కాలంలో శ్రీలంకను ఆదుకునే పరి స్థితి కనిపించడం లేదు. శ్రీలంకలో మెజారిటీ పౌరులు బౌద్ధులు. అక్కడి పాలకులు ఆ దేశాన్ని బౌద్ధుల ఆధిపత్యం ఉండే దేశంగా మార్చేశారు. దీనితో హిందువులు, ముస్లింలు రెండో శ్రేణి పౌరులుగా బతకవలసి వస్తోంది. జాతుల సమస్య ఎప్పటి నుంచో ఉంది. తమిళ తీవ్రవాదం శ్రీలంకను ఏ స్థితికి తీసుకొచ్చిందో అధికారంలో ఉన్నవారు మరిచిపోయి నట్టున్నారు. జాతి, మత వైషమ్యాలు ఈ దశలో పెచ్చరిల్లితే శ్రీలంక ఎందుకూ కొరగాకుండా పోవడం ఖాయం. ప్రజోద్యమం ఇప్పటివరకు శాంతియుతంగానే కొనసాగుతోంది కనక ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఇప్పటికీ అచంచల విశ్వాసం ఉందని వాదించే పరిశీలకులు బలంగానే ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళన కేవలం జనశక్తికి నిదర్శనం అంటున్నారు. వీలైనంత త్వరలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వ హిస్తే మెరుగైన ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం లేకపోలేదు. అయితే ప్రజలకు ఆ అవకాశం కల్పించే రాజకీయ నాయకత్వం కావాలి. కొరతల్లా అక్కడే కనిపిస్తోంది. ఈ దశలో అయితే సంపూర్ణంగా ప్రజల మద్దతు ఉన్న నాయకుడు ఎవరూ కని పించడం లేదు. అన్ని ప్రయోగాలు పూర్తి అయిన తరవాత సజిత్‌ ప్రేమ దాస కొత్త నాయకుడిగా అవతరించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయన కుటుంబమూ ఒకప్పుడు అధికారంలో ఉన్నదే. సమస్యల్లా రాజపక్స కుటుంబం శ్రీలంకను తమ సొంత ఆస్తిగా పరిగణిం చడమే. అయితే సజిత్‌ ప్రేమదాసకు అలాంటి అవకాశం లేదు కనక ఎన్నికలు జరిగే దాకా ఆయనో మరొకరో ముందుకొచ్చి జాతీయ ప్రభుత్వం లాంటిది ఏర్పాటు చేస్తే తప్ప పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోకుండా కాపాడడం సాధ్యం కాదు. ఇప్పుడు శ్రీలంకకు కావలసింది తక్షణ ఉప శమనం. ఆ ఉపశమనం కలిగించడం అన్ని పక్షాల సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని కరోనా మరింత తీవ్ర చేస్తే అధికారంలో ఉన్న కుటుంబం మొత్తం దేశాన్ని పెనం మీంచి పొయ్యిలో పడేసే రీతిలో వ్యవహరించింది. సమయానికి రుణాలు తీర్చకపోవడంవల్ల కొత్త అప్పులు పుట్టే అవకాశం ఎంత తక్కువైనా రాజకీయ సుస్థిరత సాధ్యమైతే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్‌.) లాంటివి తాత్కాలికంగా ఆదుకోక మానవు. శ్రీలంకను కాపాడగలిగేది ఉమ్మడి కృషే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img