Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఉచితాలపై అనుచిత సూక్తులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి మాటకారి. జనాకర్షణ విద్య బాగా తెలిసిన వ్యక్తి. అసలు సమస్యల గురించి, సంఫ్‌ు పరి వార్‌ చిమ్ముతున్న విద్వేష రాజకీయాల గురించి, మూక దాడులు, హత్యలు, ముస్లిం వ్యతిరేక విషవమనం గురించి అయితే ఆయన పెదవి విప్పరు. కానీ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సూక్తి ముక్తావళి వినిపించడంలో మాత్రం దిట్ట. జనానికి ఉచితంగా అదో ఇదో అందజేసి ఓట్లు లాక్కోవాలనుకోవడం చాలా ప్రమాద కరమైన ధోరణి అని ఆయన హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని కథేరీ జిల్లాలో 296 కిలో మీటర్ల పొడవైన నాలుగు వరసల బుందేల్‌ ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (రహదారి) ని ప్రారంభించిన సందర్భంలో మోదీ ఉచితాల అనుచితాన్ని గురించి ప్రస్తావించారు. ఈ హెచ్చరిక సిద్ధాంత రీత్యా సబబైందే. కానీ ఈ నియమాన్ని ఆయన ఏ మేరకు పాటించారు లేదా పాటిస్తారు అన్నది సమాధానం దొరకని ప్రశ్న. యువత ఇలాంటి ఉచితాలకు లొంగిపోకూడదని కూడా మోదీ ఉచిత సలహా పారేశారు. ఈ ఉచితాల సంస్కృతిని ప్రోత్సహించే వారికి రహదార్లు, విమానాశ్రయాలు, రక్షణ వ్యవస్థలు నిర్మించడం మీద శ్రద్ధ ఉండదని మునుపటి ప్రభుత్వాలకు చురక కూడా అంటించారు. అసలు రాజకీయాలలో ఈ ఉచితాల సంస్కృతికి తావివ్వకూడదని హితవు పలికారు. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండాలన్నది మోదీ అంతిమ లక్ష్యం. ఆయన ఉద్దేశం కేవలం కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కాదు. ప్రతిపక్షాలు లేని భారత్‌ కోసమే ఆయన కలగంటున్నారు. కేంద్రం లోనూ, రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండడాన్నీ ఆయన డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటుంటారు. పనిలో పనిగా ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్య నాథ్‌ ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి పథకాలను, శాంతి భద్రతల పరి రక్షణకు పాటుబడ్తున్న తీరును వేనోళ్ల పొగిడారు. ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తున్న వారికి వ్యతిరేకంగా యోగీ సర్కారు బుల్డోజర్‌ రాజ్యాన్ని నడుపు తున్న తీరు, తద్వారా మౌలిక మానవ హక్కులకు కలుగు తున్న విఘాతం మాత్రం ప్రధానమంత్రికి కనిపించదు. గత ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న చోట చిన్న చిన్న ఊళ్లకు కూడా రహదార్ల సదుపాయం ఎలా కల్పిస్తున్నామో మోదీ పూసగుచ్చినట్టు వివరించారు. ఈ రహదార్లవల్ల ఆ చిన్న గ్రామాలకు ఒరిగేదేమిటో జనం అనుభవంలోకి రాదు. ఆ రహదార్ల మీద సామాన్యుడు వినియోగించే చిన్న వాహనాలకు ప్రవేశం శూన్యం, పైగా అడుగడుగునా టోల్‌ గేట్‌ పేర బోలెడు రుసుము చెల్లించవలసి వస్తుందన్న వాస్తవాన్ని కూడా మోదీ వాటంగా దాచేస్తారు. యువత కలలను సాకారం చేయడమే తమ ప్రభు త్వాల లక్ష్యమని ఆయన చెప్పారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, ఆధునిక సదుపాయాలు మొదలైనవి కల్పించడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతోందని నమ్మబలకడానికి ప్రయత్నిస్తారు. ఈ సామాజిక న్యాయం అన్న మాట ప్రభుత్వం చేపడ్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం ముస్లింలకు కూడా దక్కుతోంది కదా అని చెప్పడం ఆయన అసలు ఉద్దేశం. కానీ ఏ ఎన్నికలలోనూ బీజేపీ ఒక్క ముస్లింకైనా టిక్కెట్‌ ఇవ్వడం మానేసి ఎన్నేళ్ల యిందో ఆయన చెప్పరు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకపోవడం ఏ రకంగా సామాజిక న్యాయలక్ష్యాలు సాధిస్తుందో ఎవరికీ అంతు పట్టదు.
ఒక్క మోదీ ప్రభుత్వమే కాదు ఇతర పార్టీలు కూడా జనాకర్షక పథకాల చేంతాడంత జాబితాను ప్రతి ఎన్నికల సందర్భంలోనూ వల్లె వేయడం ఎవరికి తెలియని రహస్యం గనక. కానీ జనాకర్షక పథకాలకూ ఓట్లు సంపా దించి పెట్టడంలో ఓ పరిమితి ఉంటుందని, ఆ తరవాత అవి వికటిస్తాయని మోదీతో సహా అన్ని పార్టీలకు తెలుసు. అనేకానేక ఉచితాలు ప్రకటించిన పార్టీలు కూడా ఎన్నికలలో బోల్తా పడిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 2019 బడ్జెట్‌లో మోదీ సర్కారు ప్రకటించిన జనాకర్షక పథకాల జాబితా చాలా పొడవైందే. ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎన్‌.డి.ఎ. 2019 ఎన్నికలలో 400 కన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తుందని అప్పటి కేంద్ర మంత్రులు జయంత్‌ సిన్హా, రాం విలాస్‌ పాశ్వాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు అనడం కన్నా అత్యాశ పడ్డారు అని చెప్పడమే ఉచితంగా ఉంటుంది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 2014లో కన్నా ఎక్కువ సీట్లు సంపాదించిన మాట వాస్తవమే. కానీ ఈ ఉచితాలు సాధించి పెట్టే విజయా లకూ పరిమితి ఉంటుందని రుజువైందిగా. మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ హయాంలో అందించిన ఉచితాల గురించి బాకాలూదిన మాట నిజం కాదా! కరోనా కష్ట కాలంలో ఇచ్చిన అయిదు కిలోల ఉచిత ధాన్య సరఫరాను ఇప్పటికీ కొనసాగిస్తున్న మాట కళ్లకు కనిపిస్తున్న సత్యమేగా! 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని మోదీ గొప్పగా ప్రకటించిన అంశం ఆచరణలో కుదేలైందిగా! ఇది సాధ్యం కాదని తెలుసుగనకే రైతులకు ఏడాదికి రూ. ఆరు వేలు అందించడం ఉచితాల జాబితాలోకి రాదని మోదీ ఎవరిని నమ్మించాలను కుంటున్నారు? అనేక రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతూనే ఉన్నా యిగా! 2006, 2011లో తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల సందర్భంగా డి.ఎం.కె. అనేక ఉచితాలు ప్రకటించింది. కానీ 2011లో డి.ఎం.కె.కు పరాజయమే ఎదురైంది. 55 లక్షల మందికి పింఛన్లు, 15 లక్షల మందికి లాప్‌ టాప్‌లు, రెండున్నర కోట్ల మందికి స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామన్నా అఖిలేశ్‌ యాదవ్‌కు పరాజయమే ఎదురైంది. ఉచితాల మంత్రం అన్ని వేళలా పారక పోవడానికి నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. పేదవాడి బతుకు మౌలికంగా మారనంత కాలం అతడి జేబులో నాలుగు రూపాయలు పెట్టినంత మాత్రాన నమ్మేంత అమాయకులు పేద వారిలోనూ ఉండరు. అన్నింటికీ మించి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు, అవి ప్రజలకు అందడానికి మధ్య అపారమైన వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించనంత అమాయకత్వం ఓటర్లకు ఉండదు. ఈ ఉచితాలవల్ల తమ జీవితాల్లో గుణాత్మక మార్పు ఏమీ లేదని జనానికి తెలుస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీ డబ్బు పంచినా అవి జేబులో పెట్టుకుని తాము గెలిపించదలచుకున్న వారినే గెలిపించడం అనేక సార్లు ఎదురైన అనుభవమే. ఇప్పటికీ ప్రభుత్వ పంపిణీ విధానం అమలులో అవకతవకలవల్ల ఏటా రూ. 40,000 కోట్లు నష్టం కలుగుతూనే ఉంది. విధానం ఎంత గొప్పదైనా అమలే అసలైన గీటు రాయిగా ఉంటుంది. ప్రభుత్వం ఎంతమందికి ఎన్ని ఉచితాలు ఇచ్చినా కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడ్తున్న మొత్తం, బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేస్తున్న మొత్తం అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ. అన్నింటికన్నా మించి ఉచితాలు చేటు తెస్తాయని చెప్తున్న మోదీ సర్కారే ఉచితాల మీద ఆధారపడడం అన్నింటికన్నా ఎక్కువ ప్రమాదం. దీర్ఘ కాలికంగా ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికి ఈ విధానాలు ఏ రకంగానూ దోహదం చేయవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img