Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ముస్లింల రిజర్వేషన్లకు ఎసరు

కర్నాటకలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లకు మంగళం పాడేసిన బీజేపీ తెలంగాణాలో కూడా అదే పని చేయాలనుకుంటోంది. ఆదివారం హైదరాబాద్‌ సమీపంలోని చేవెళ్లలో బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణలో కనక వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిలంకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెగేసి చెప్పారు. మే 10న శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న కర్నాటకలో ఈ పని ఇటీవలె చేసేశారు. అంటే విద్య, ఉద్యోగాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవన్న మాట. ముస్లింలలో ఉన్న పేదరికం దళితులలో ఉన్న పేదరికం కన్నా ఎక్కువ అని సచార్‌ కమిటీ తేల్చింది. ఆ తరవాతే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం మొదలైంది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని కూడా అమిత్‌ షా అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముస్లింలకు ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ముస్లింలకు రెండు పడకగదుల ఇళ్లు కేటాయించడాన్ని కూడా అమిత్‌ షా అభ్యంతర పెట్టారు. ఇలాంటి ఇళ్లు పొందే హక్కు ఎస్‌.సి.లు, ఎస్‌.టి.లు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి మాత్రమే ఉందని అమిత్‌ షా అభిప్రాయ పడ్డారు. తెలంగాణ శాసనసభకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టగలమన్న భరోసా బీజేపీ లో వ్యక్తం అవుతోంది. దీనికి ప్రాతిపదిక ఉందా లేదా అని తేల్చడం ఎలాగైనా అధికారంలోకి రావాలనుకునే బీజేపీకి ఎటూ ఉండదు. కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం ముస్లింలకు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి బిల్లు 2017లోనే ఆమోదించారు. ఈ బిల్లును ఆమోదించాలన్న తీర్మానంతో సహా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూనే ఉంది. మతం ఆధారంగా రిజర్వేషన్లను ఆమోదించలేమని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ముస్లింలలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే రిజర్వేషన్లు కల్పిస్తాం కనక ఈ బిల్లును ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేంద్రం లెక్క చేయలేదు. మొదట రిజర్వేషన్లు కల్పించినప్పుడు మత ప్రస్తావన లేని మాట నిజమే. కేవలం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలనుకున్నారు. ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన అప్పుడు లేదు. ఈ ప్రాతిపదికన ఎస్‌.సి., ఎస్‌.టి.లకు మాత్రమే మొదట్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్‌.టి.లు అంటే గిరిజనులు అందరూ హిందువులా కాదా అన్న అంశం చర్చనీయమే కాని వారిని హిందువులుగా పరిగణించడం కొనసాగుతూనే ఉంది. బీజేపీ వారిని హిందువులుగా పరిగణించడానికి నానా పాట్లూ పడుతోంది. అంటే రాజ్యాంగ నిర్మాతలు సంకల్పించిన సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారు అంటే హిందువులు మాత్రమే పరిగణనలోకి వచ్చారు. ఇతర మతాల వారిలో కుల వ్యవస్థ, అంటరానితనం లేవు అన్న భ్రమతో వారికి రిజర్వేషన్ల అవసరం ఉందని భావించలేదు. ఈ రిజర్వేషన్లు ఖరారు చేసిన తరవాత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న అంబేద్కర్‌ సామాజికంగా వెనుకబడిన తరగతుల వారు కూడా ఉన్నారనీ, వారికీ ఏదో వెసులుబాటు కల్పించాలని చెప్పారు. ఆ కారణంగానే ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించడానికి అనేక దశల్లో ప్రయత్నాలు జరిగాయి. చివరకు మండల్‌ కమిషన్‌ నివేదిక అమలులోకి వచ్చిన తరవాత ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు వర్తించాయి. మొదట రిజర్వేషన్లు కల్పించినప్పుడు వెనుకబడిన తరగతుల వారు అన్న నిర్వచనం కిందకు ఎస్‌.సి.లు, ఎస్‌.టి.లు మాత్రమే వచ్చారు. ఇతర వెనుకబడిన తరగతుల వారు అన్న మాట మండల్‌ కమిషన్‌ నేపథ్యంలోనే ప్రచారంలోకి వచ్చింది. ఇందులో కూడా హిందువులు కాని వారికి రిజర్వేషన్లు దక్కలేదు. పైగా ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ‘‘వెనుకబడిన తరగతులలో సంపన్నవర్గం’’ అన్న భావన తీసుకొచ్చి, దానికి ఆర్థిక ప్రాతిపదికను ప్రమాణంగా తీసుకోవడానికి కారణం న్యాయవ్యవస్థే. అప్పుడూ ఇతర మతాల వారికి, ముఖ్యంగా వెనుకబడి ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందనుకుంటున్న ముస్లింలకు రిజర్వేషన్లు దక్కలేదు. సచార్‌ కమిటీ నివేదిక ఆ అవకాశం కల్పించింది.
ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తాం అని అమిత్‌ షా చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి రిజర్వేషన్ల నేపథ్యం మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించాలన్న లక్ష్యం మోదీకి, అమిత్‌ షాకు ఉన్నప్పటికీ ఈ విషయంలో వీరిద్దరి మధ్య పొంతన కుదరడం లేదని అనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది నెలల కింద ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారి ఓట్లు సంపాదించడానికి పాస్మాంద ముస్లింలను ఆదుకుంటామని చెప్పారు. ముమ్మారు తలాఖ్‌ కు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయడం ముస్లిం మహిళలకోసమే అని బీజేపీ దండోరా వేసుకుంటూనే ఉంటుంది. మోదీ చెప్పే మాటలకు అమిత్‌ షా చేసే ప్రకటనలకు మధ్య అంతరం కనిపించడం వారు భిన్న సైద్ధాంతికదారుల్లో ఉన్నారని కాదు.
ఉత్తర భారతదేశంలో హిందుత్వం శక్తుల ఏకీకరణ పూర్తి అయింది. దక్షిణాదిలో ఆ పని సంపూర్ణంగా జరగలేదు. ముస్లింల ఓట్లు లేకపోయినా ఫరవా లేదు అన్న ధరణిలో బీజేపీ కనిపిస్తోంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలలో 400పైన సీట్లు సంపాదించాలని మోదీ ఆశిస్తున్నారు. అన్ని సీట్లు రావాలంటే కనీసం వెనుకబడిన ముస్లింవర్గాల ఓట్లైనా రాబట్టగలగాలి. అందుకే మోదీ పాస్మాందా ముస్లింల ప్రస్తావన తీసుకొస్తున్నారు. కానీ తెలంగాణలో అమిత్‌ షా దానికి భిన్నంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. కానీ కాదు. మోదీ వచ్చే ఎన్నికల్లో మెజారిటీని మరింత పెంచుకుని రికార్డు సృష్టించడం కోసం పాస్మాందా ముస్లింల ప్రస్తావన చేస్తే అమిత్‌ షా తెలంగాణలో హిందువుల ఓట్లను సంఘటితం చేయడం కోసం ముస్లింల రిజర్వేషన్లకు కత్తెర వేస్తామంటున్నారు. లక్ష్యం ఒకటే వ్యక్తీకరణలోనే తేడా. గత నెలలో అమిత్‌ షా కర్నాటకలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం గురించే మాట్లాడారు. ముస్లింలకు దక్కకుండా లాగేసిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఒక్కలిగ-లింగాయత్‌ సామాజిక వర్గాలకు కేటాయించారు. తెలంగాణలోనూ అదే పని చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆడిరచినట్టల్లా ఆడుతున్నారని అమిత్‌ షా అంటున్నారు. అందుకే హైదరాబాద్‌ విమోచన దినాన్ని ప్రభుత్వపరంగా నిర్వహించడం లేదట. ఇందులోనూ బీజేపీకి స్వార్థమే ఉంది. హైదరాబాద్‌ విమోచనను బీజేపీ ముస్లిం వ్యతిరేక దృష్టితోనే చూస్తుంది. ఎక్కడ ఏ పావు కదిపితే ఓట్లు రాలుతాయన్నదే బీజేపీ ఆలోచన తప్ప సమాజాభివృద్ధి బీజేపీ ఎజెండాలోనే ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img