Friday, May 31, 2024
Friday, May 31, 2024

అసెంబ్లీలో రచ్చ

. పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లపై చర్చకు టీడీపీ సభ్యుల పట్టు
. వాయిదా తీర్మానానికి స్పీకర్‌ తిరస్కృతి
. పోడియం వద్ద ఆందోళన
. 11మంది ప్రతిపక్ష సభ్యులు మళ్లీ సస్పెన్షన్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర శాసనసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 14న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా, ఐదు రోజులుగా ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురవుతూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై వీరి ఏ ఒక్క వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించడం లేదు. అందుకోసం ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయడం, సస్పెన్షన్‌కు గురికావడం నిత్యకృత్యమైంది. టీడీపీ కీలక సమస్యలు ప్రస్తావించే పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, శాసనసభ ఉప నాయకుడు రామానాయుడులను సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్‌ చేశారు. దీంతో బడ్జెట్‌ సమావేశాలు అధికారపార్టీ సభ్యులతో ఏకపక్షంగా సాగుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చల కంటే సభా నాయకుడి పొగడ్తలే లక్ష్యంగా సమావేశాల తీరు ఉన్నది. ఆదివారం అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు విద్యుత్‌ చార్జీల పెంపు, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపుపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా దానిని స్పీకర్‌ తిరస్కరించారు. ఆపై ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత అయినా చర్చకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు కోరారు. ప్రశ్నోత్తరాల జరిగాక తేనీటి విమానం అనంతరం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై విపక్ష సభ్యులు పట్టుబట్టారు. చర్చకు అవకాశం లేదని స్పీకర్‌ తేల్చిచెప్పడంతో ఆయన పోడియం వద్ద ‘మోటార్లకు మీటర్లు6వేల కోట్ల కుంభకోణం’ ‘పంపుసెట్లకు మీటర్లురైతుల మెడకు ఉరితాళ్లు’ అనే నినాదాలతో ప్లేకార్డులను ప్రతిపక్ష సభ్యులు ప్రదర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.57వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపారని, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వ్యవసాయమే దండుగన్న మీకు దీనిపై మాట్లాడే అర్హత లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునుద్దేశించి అధికారపార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. స్పీకర్‌ డిమాండ్లను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా అధికారవిపక్ష సభ్యుల ఆరోపణలుప్రత్యారోపణలతో సభలో గందరగోళం నెలకొంది. మాజీమంత్రి కురసాల కన్నబాబు జోక్యం చేసుకొని బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపింది చంద్రబాబు కాదా? నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయిన విషయం గుర్తులేదా ? అని టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. ఏలూరు కలెక్టరేట్‌లో రైతులపై బాబు లాఠీచార్జ్‌ చేయించారని, హైదరాబాద్‌లో రైతులను గుర్రాలతో తొక్కించారని తెలిపారు. విద్యుత్‌ చట్టం2003 అమలు చేసినప్పుడు వామపక్షాలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడని విమర్శించాయన్నారు. ‘విద్యుత్‌ బిల్లులు కట్టలేదని మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర చంద్రబాబుది. రైతులను రోజుల తరబడి జైళ్లలో పెట్టించాడు. పార్టీలు మారటం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు..బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్‌లోగానీ టీడీపీలో చేరిన ఆయన మామ నుంచి ఆ పార్టీని లాక్కున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమే’ అని కన్నబాబు విమర్శించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకొని టీడీపీ సభ్యులు కావాలనే రోజూ రాద్దాంతం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై వారికి ఏమాత్రం శ్రద్ధలేదని, సభలో రభస చేయడం, సస్పెన్షన్‌కు గురి కావడమే లక్ష్యమని, బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తంతు’ అని వ్యాఖ్యానించారు. ప్రధానాంశాలపై సభలో చర్చించాల్సి ఉన్నందునే వారు ఇలా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని సభను సజావుగా నిర్వహించాలని స్పీకర్‌కు బుగ్గన విన్నవించారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. వెంటనే మేం చేసిన తప్పేమిటి? ఎందుకు సస్పెండ్‌ చేశారు? అని సస్పెన్షన్‌కు గురైన సభ్యులు స్పీకర్‌ను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చ కోరడం తప్పా? సొంత బాజాలు కొట్టుకోవడానికా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేది? అని నిలదీశారు. ఆందోళనకు దిగారు. దీంతో వారిని బయటకు పంపేందుకు మార్షల్‌కు స్పీకర్‌ ఆదేశించారు. సస్పెండ్‌ అయినవారిలో కింజారపు అచ్చెన్నాయుడు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, నిమ్మల చిన్నరాజప్ప, గద్దె రామమోహన్‌, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, బెండాళం అశోక్‌, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. తొలుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘విద్యుత్‌ బాదుడు రూ.57వేల కోట్లు, 6వేల కోట్ల కుంభకోణానికే విద్యుత్‌ మీటర్లు, విద్యుత్‌ రంగ నిధులన్నీ షిర్డీసాయి పాలు, 10లక్షల ఎకరాల కబ్జాకే స్మార్లు మీటర్ల ఎంవోయూలు’ అంటూ ప్లేకార్డులు, నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీకి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img