Friday, August 12, 2022
Friday, August 12, 2022

‘ఆపరేషన్‌ కమలం’

జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు డబ్బు,పదవి ఎర
హౌరాలో నగదుతో దొరికిపోయిన ప్రజాప్రతినిధులు
పోలీసు విచారణ తర్వాత ఎమ్మెల్యేల అరెస్ట్‌
ప్రతి ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు,మంత్రి పదవి : కాంగ్రెస్‌
ఇది దిల్లీలో ‘హమ్‌ దో’ గేమ్‌ ప్లాన్‌ అని ఆరోపణ

న్యూదిల్లీ/రాంచి/హౌరా: దేశంలో బీజేపీ యేతర ప్రభుత్వాలను కూలగొట్టే కుట్రలను కాషాయ పార్టీ కొనసాగిస్తోంది. ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు నగదు, పదవులను ఎర వేస్తూ ప్రజాస్వామ్య హననానికి ఒడిగడుతోంది. తాజాగా జార్ఖండ్‌లోని హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘ఆపరేషన్‌ కమలం’ బట్టబయలైంది. పశ్చిమ బెంగాల్‌లో జార్ఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురి ఎమ్మెల్యేల వద్ద భారీగా నగదు దొరకడంతో బీజేపీ ‘అనైతిక’ చర్య మరోసారి వెలుగుచూసింది. తమ ముగ్గురి ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నగదు, మంత్రి పదవిని ఎర వేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను దుయ్యబట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక వాహనం నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శనివారం సాయంత్రం పంచలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాణిహతి వద్ద జాతీయ రహదారి-16పై అడ్డగించిన వారి ఎస్‌యూవీ నుంచి రూ.49 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేష్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సల్‌ కొంగరి, వారి డ్రైవర్‌తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారు ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎందుకు తీసుకువెళుతున్నారో పోలీసులకు సమాధానం ఇవ్వలేదు. ‘అంత పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లడానికి గల కారణాన్ని వారు చెప్పలేకపోయారు. గిరిజన మహిళలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన చీరలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వచ్చామన్న వారి వాదనతో మాకు సంతృప్తి లేదు.
తదుపరి విచారణ కోసం మేము వారిని అరెస్టు చేశాము’ అని ఆ అధికారి పీటీఐకి తెలిపారు. హౌరా రూరల్‌ పోలీసుల నుంచి రాష్ట్ర సీఐడీ విచారణ చేపట్టిందని అన్నారు. ఎమ్మెల్యేలతో సహా ఐదుగురిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం సహా భారత నేర శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
రాత్రంతా ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత అరెస్టులు చేశామని అన్నారు. హౌరా పోలీస్‌ సూపరింటెండెంట్‌ (రూరల్‌) స్వాతి భంగాలియా మాట్లాడుతూ ‘నల్ల కారులో భారీ మొత్తంలో డబ్బు రవాణా అవుతున్నట్లు మాకు నిర్దిష్ట సమాచారం అందడంతో వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించాము.
ముగ్గురు జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఈ ఎస్‌యూవీని అడ్డగించాము. వాహనంలో నగదు దొరికింది’ అని తెలిపారు. మొత్తం సొమ్మును నిర్ధారించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తెప్పిస్తున్నామని, ఆ డబ్బు ఎక్కడికి తీసుకువెళుతున్నారని ఎమ్మెల్యేలను కూడా ఆరా తీస్తున్నారు. కాగా ఎస్‌యూవీలో ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, అందులో కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తుతో పాటు ‘ఎమ్మెల్యే జమ్తారా జార్ఖండ్‌’ అనే బోర్డు ఉందని పోలీసులు తెలిపారు. అన్సారీ జమ్తారా ఎమ్మెల్యేగా, కచ్చప్‌ రాంచీ జిల్లాలోని ఖిజ్రీ శాసనసభ్యుడిగా, కొంగరి సిమ్డేగా జిల్లాలో కోలేబిరా ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ ఫిర్యాదు
జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఇస్తోందని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో భారీ మొత్తంలో నగదుతో అరెస్టయిన తమ ముగ్గురు ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్‌ ఆదివారం తెలిపింది. ఇక్కడ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ మంత్రి అలంగీర్‌ ఆలం మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి రూ.10 కోట్లు, మంత్రి పదవి ఇస్తామని ఇతర ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినందుకు ముగ్గురు శాసనసభ్యులపై ఆ పార్టీ బెర్మో ఎమ్మెల్యే కుమార్‌ జైమంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేష్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సల్‌ కొంగరి ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని అడ్డగించగా, వాహనంలో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం ఆదివారం మధ్యాహ్నం వారిని అరెస్టు చేశారు. ‘రాజేష్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సల్‌ కొంగరి నన్ను కోల్‌కతాకు రమ్మని అడిగారు. ఒక ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇఫ్రాన్‌ అన్సారీ, రాజేష్‌ కచ్చప్‌ నన్ను కోల్‌కతా నుంచి గువహటికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అక్కడ వారి ప్రకారం అసోం ముఖ్యమంత్రి హేమంత్‌ బిస్వా శర్మతో సమావేశానికి నిర్ణయించారు’ అని జై మంగల్‌ పేర్కొన్నారు. రాంచీలోని అర్గోరా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 (సి), నేరపూరిత కుట్రతో వ్యవహరించే ఐపీసీ సెక్షన్‌ 120 (బి) కింద ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హాని కలిగించే నేర కార్యకలాపాలను అరికట్టాలని పోలీసులను కోరారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో నగదు స్వాధీనం చేసుకున్నందున, వారు విషయాన్ని పొరుగు రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్లు అర్గోరా పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.
బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’ బట్టబయలు : కాంగ్రెస్‌
హౌరాలో భారీ మొత్తంలో నగదుతో ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టుబడిన తర్వాత జార్ఖండ్‌లో తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. మహారాష్ట్రలో వారు చేసిన పనిని జార్ఖండ్‌లో చేయాలన్నది కాషాయ పార్టీ గేమ్‌ ప్లాన్‌ అని తెలిపింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ శనివారం ట్విటర్‌లో ‘జార్ఖండ్‌లో బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’ హౌరాలో ఈ రాత్రికి బట్టబయలైంది. ఇ-డి ద్వయాన్ని అమర్చడం ద్వారా మహారాష్ట్రలో ఏమి చేశారో జార్ఖండ్‌లోనూ అదేవిధంగా చేయాలన్నది దిల్లీలో ‘హమ్‌ దో’ గేమ్‌ ప్లాన్‌’ అని ఆరోపించారు. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘అనైతికంగా’ అధికారాన్ని చేజిక్కించుకున్నందుకు బీజేపీపై కాంగ్రెస్‌ విరుచుకుపడిరది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాష్ట్రీయ జనతాదళ్‌ ఒక భాగంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేసిన కుట్రలో భాగమే భారీ మొత్తంలో నగదు అని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
భారీ నగదుతో పోలీసులకు పట్టుబడిన జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు పడిరది. ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ‘ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. వీరి సస్పెన్షన్‌ అమలులోకి వస్తుంది’ అని జార్ఖండ్‌ పార్టీ ఇన్‌ఛార్జి అవినాశ్‌ పాండే వెల్లడిరచారు. ఇందుకు సంబంధించి పార్టీలో ప్రతి ఒక్కరి సమాచారం తమ దగ్గర ఉందన్న ఆయన… ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img