Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చోటెక్కడ?

ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిత మోదీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం
లౌకిక స్వభావానికి విరుద్ధంగా పాలన
సీపీఐ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో డి.రాజా

విశాలాంధ్ర విశాఖపట్నం : మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో ప్రజాస్వా మ్యానికి స్థానం లేకుండా పోయిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఏడేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీి కూటమి పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్న మైందని, సామాజిక వ్యవస్థ కుల, మత ఉన్మాద ఛాయలతో కునారిల్లుపోతోందన్నారు. మోదీ సర్కార్‌ను తక్షణమే అధికార పీఠం నుంచి తొలగించాలని, అందుకోసం రాజకీయ లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు రాష్ట్రస్థాయి వర్క్‌ షాప్‌ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజా ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ, అప్రజాస్వామిక, విచ్ఛిన్నకర, మతోన్మాద, ఫాసిస్టు విధానాలు పెచ్చరిల్లిపోతున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా, దేశ లౌకిక స్వభావాన్ని కాలరాస్తూ పాలన సాగిస్తున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని రాజా నొక్కిచెప్పారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ వల్ల దేశంలో ప్రజాస్వామిక హక్కులకు ప్రమాదం ఏర్పడిరదని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. రాజ్యాంగంలో మన దేశాన్ని సెక్యులర్‌ రిపబ్లిక్‌గా అంబేద్కర్‌ పేర్కొంటే, దానికి విరుద్ధంగా హిందూ రాజ్యస్థాపనకు బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తూ దేశ మూల స్వభావాన్ని మార్చాలని భావిస్తున్నాయని, దీన్ని అడ్డుకోవలసిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల చేతిలో డబ్బులు లేక కొనుగోలు శక్తి పడిపోయిందని, నిరుద్యోగం ప్రబలిందని చెప్పారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, టెలికం, రైల్వే, పోర్టులు, ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణతోపాటు రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం దేశ రక్షణకే ప్రమాదకరమని రాజా హెచ్చరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో లేదని ఒక సర్వే వెల్లడిరచిందని చెబుతూ ప్రజలు స్వేచ్ఛగా తమ వ్యతిరేకతను, నిరసనను తెలియజేసే పరిస్థితి లేదని, నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కని అన్నారు. ఎప్పుడో బ్రిటిష్‌ కాలంలో తెచ్చిన దేశద్రోహ చట్టం, ఐపీసీ 124ఏని అమలుచేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవారిపై దీన్ని ప్రయోగించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.
నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ కింద అన్ని ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం పూనుకుందని, దేశంలో ప్రభుత్వ ఆస్తులేమీ లేకుండా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కుంటోందని, రాష్ట్రాలను మున్సిపాలిటీలకంటే హీనంగా చూస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని, ఇలాగే కొనసాగితే సమాఖ్య వ్యవస్థకు అర్థం ఉండదని అన్నారు. బీజేపీని అధికారం నుంచి తప్పించి దేశాన్ని కాపాడుకోవాలని, ఎలక్టోరల్‌ పద్ధతిలోనే దీన్ని సాధించగలమని, పార్లమెంటులో సీపీఐ బలం పెరగాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులు, ఉత్పత్తి రంగంలో ఉండే ఫ్యాక్టరీ కార్మికులు ఇంటి నుంచే పనిచేయగలరా? అని ప్రశ్నించారు.
వర్కింగ్‌ క్లాస్‌ కేవలం జీతాలు, హక్కులపై దృష్టి పెట్టకుండా రాజ్యాధికారం కోసం పోరాడాలని అన్నారు. ప్రైవేట్‌ వ్యవస్థ మానవ విలువలను హరిస్తుందన్నారు. కుల వివక్ష లేని సమాజం వచ్చినప్పుడే మార్పును ఆశించగలమని చెప్పారు. సీపీఐ 24వ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరగనున్నాయని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు సైద్ధాంతికంగా, రాజకీయంగా దిశానిర్దేశాన్ని ఈ మహాసభలు చేస్తాయని రాజా తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ సరళీకరణ తరువాత రాజకీయాల్లోకి వ్యాపారస్తులు ప్రవేశించారని, రాజకీయాల్లో విలువలుపడిపోయాయని అన్నారు. లాక్‌డౌన్‌, కరోనా విపత్తు సమయంలోనూ సీపీఐ సభ్యత్వం పెరిగిందని చెప్పారు. వెనెజులా తక్కువ ధరకు ముడి చమురు ఇస్తామంటే అమెరికా అడ్డం చెప్పడంతో కేంద్రం ఆగిపోయిందన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో మూలాలను గుర్తించకుండా వాడినవారిని వేధించడాన్ని తప్పుపట్టారు. దేశంలోకి అఫ్గనిస్తాన్‌ నుంచి మోడీ దత్తపుత్రుడు ఆదానీకి చెందిన ముంద్రా పోర్టు నుంచి హెరాయిన్‌ వచ్చిందని, విజయవాడ చిరునామా ఇచ్చారని, బీజేపీకి జగన్‌ నమ్మకమైన మిత్రుడని గ్రహించాలని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులను చంపడానికి ప్రయత్నించడం దేశ రాజకీయాల్లో సరికొత్త ధోరణిగా పేర్కొన్నారు. జగన్‌ పాలన రెండున్నరేళ్లు పూర్తికావస్తోందని, ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటూ మంత్రులందరినీ మారుస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో అన్నీ నేనే అంటూ వ్యక్తి చుట్టూ పాలన నడుస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, 12 నెలల్లో తీసుకోవాలనుకున్న అప్పులో 97శాతాన్ని నాలుగు నెలల్లోనే తీసేసుకున్నారని, రాష్ట్రంపై అప్పు రూ.5లక్షల కోట్లు ఉందని అన్నారు. కాంట్రాక్టర్లకు ర.80వేల కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పారు.
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావడంలేదని చెప్పారు. పీఆర్‌సీని అమలుచేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడిచాని దాని ప్రస్తావన లేదని విమర్శించారు. అప్పుల కోసం కార్పొరేషన్‌ పెట్టడాన్ని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్‌, ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పీజే చంద్రశేఖరరావు, పి.హరనాథరెడ్డి, అక్కినేని వనజ, జి. ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌కి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img