Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

ఉచిత గ్యాస్‌ బుకింగ్‌ ప్రారంభం

. ఆధార్‌ అనుసంధానం కోసం గ్యాస్‌ ఏజెన్సీల దగ్గర క్యూ
. వినియోగదారులకు సందేశాలు
. 48 గంటల్లో డీబీటీ ద్వారా సొమ్ము
. తొలి సిలెండర్‌ అందజేయనున్న సీఎం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : దీపావళి కానుకగా దీపం2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్‌ సిలెండర్ల కోసం మంగళవారం నుంచి బుకింగ్‌ ప్రారంభమైంది. ప్రతి రోజు కంటే మూడు రెట్లు ఎక్కువ మంది వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారు. బుకింగ్‌ అయిన 48 గంటల్లో గ్యాస్‌ సిలెండర్‌ ఇచ్చేలా హెచ్‌పీసీల్‌, ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చించింది. సిలెండర్‌ అందించిన క్షణం నుంచి 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. దీంతో ఉదయం పది గంటల నుంచే వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద బుకింగ్‌ల కోసం బారులు తీరారు. ఈ పథకం ద్వారా నాలుగు నెలలకొకటి చొప్పున ఏటా మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తారు. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మొదటి సిలెండర్‌ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిలెండర్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. దీనిని పొందేందుకు ఎల్పీజీ కనెక్షన్‌, తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు సమర్పించాలని ప్రభుత్వం సూచింది. ఈనెల 31 నుంచి 2025 మార్చి 31 లోపు తొలి ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పొందే అవకాశం ఉంది. రెండో విడతలో ఏప్రిల్‌ 1 నుంచి జులై 30 వరకూ, మూడో విడతలో ఆగస్టు 1 నుంచి నవంబరు 31 వరకు, నాలుగో విడత 2025 డిసెంబరు 1 నుంచి 2026 మార్చి 31 వరకు బుకింగ్‌ చేసుకునే సౌకర్యాని ప్రభుత్వం కల్పించింది. మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకానికి 2,684 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పట్టణాల్లో 24 గంటల్లోగా, పల్లెల్లో అయితే 48 గంటల్లోనే సిలెండర్‌ అందించే ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలుత రూ.833 డబ్బులు చెల్లించి గ్యాస్‌ సిలెండర్‌ కొనుగోలు చేసిన వినియోగదారుడి ఖాతాలోకి 48 గంటల్లోపు డీబీటీ ద్వారా సొమ్ము జమచేసేలా నిర్ణయించింది. గ్యాస్‌ బుకింగ్‌ చేసిన వారికి ఇలా సందేశాలు వస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దీపావళి నుంచి అందిస్తున్న ఉచిత గ్యాస్‌ సిలెండర్ల ‘దీపం2’ పథకంలో నమోదయినందున శుభాకాంక్షలు. మీ సబ్సిడీ మొత్తం మీరు సిలెండర్‌ డెలివరీ తీసుకున్న 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుందని తెలియజేస్తున్నాంఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అనే పేరుతో సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తోంది. ఇప్పటికే తొలి విడత ఉచిత గ్యాస్‌ సిలెండర్ల సబ్సిడీ కోసం ప్రభుత్వం తొలి దశలో భాగంగా ఒక సిలెండర్‌ రాయితీకిగాను రూ.895 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు సిలెండర్లకుగాను ఏడాదికి రూ.2,684 కోట్లను ఈ పథకం కింద ప్రభుత్వం కేటాయించనుంది. గ్యాస్‌ కనెక్షన్‌తో ఆధార్‌ అనుసంధానం లేని వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు గ్యాస్‌ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు తీసుకుని గ్యాస్‌ కంపెనీల దగ్గర బుకింగ్‌ కోసం క్యూ కడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి ఆధార్‌ అనుసంధానానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. దీపం2 పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీపం2 పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌, తెల్ల రేషన్‌ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులని ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడిరచారు. తెల్ల కార్డుకు అర్హతలేని వారికి, ధనికులకు ఈ పథకాన్ని అమలు చేస్తారా?, లేదా? అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img