Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

ఎగువ భద్రతో సీమకు తీవ్ర నష్టం

. రాష్ట్ర ప్రాజెక్టులు పట్టించుకోని కేంద్రం
. నిలదీయని రాష్ట్ర ప్రభుత్వం
. మూడున్నరేళ్లుగా సాగని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. సీపీఐ బృందం ప్రాజెక్టుల పరిశీలన ప్రారంభం

విశాలాంధ్ర ` బొమ్మనహళ్‌/అనంతపురం అర్బన్‌/డి.హీరహళ్‌:
కర్ణాటకలోని తుంగభద్ర ఎగువ భాగాన ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే భవిష్యత్తులో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ భద్రకు కేంద్ర ప్రభుత్వం 5,300 కోట్లు కేటాయించి జాతీయ హోదా కల్పించినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించక పోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సోమవారం ఎగువ భద్ర బొమ్మనహాళ్‌ సరిహద్దులోని హెచ్‌ఎల్‌సి కాలువలను రామకృష్ణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ పరిశీలన ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. మొదటి రోజు ఎగువ భద్రతో పాటు హెచ్‌ఎల్సీ 105కిలోమీటర్ల వద్ద హెచ్‌ఎల్సీ కాలువను పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన రామకృష్ణ బృందానికి నియోజకవర్గ సీపీఐ, మండల టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ మూడున్నర సంవత్స రాలుగా రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదనీ, కనీసం కాలువలు తవ్వకం కూడా సాగడం లేదన్నారు. కాలువలు తవ్వేందుకు ప్రభుత్వం ఆసక్తికనపరచడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్త్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగంపట్ల నిర్లక్ష్యంగా ఉందన్నారు. సీఎం సొంత జిల్లా కడపలోనూ ఒక్క కాలువ కూడా తవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కూడా నిధులు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదనీ, సహకరించడం లేదన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు జీవనాధా రమైన తుంగభద్ర నికర జలాలకు గండికొడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఎగువ ప్రాజెక్టుపై మౌనంవహిస్తూ సీమ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నోరుమెదపడంలేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరుతో పాటు జిందాల్‌కు వచ్చే నీటి వాటా పూర్తిగా తగ్గుతుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలు తాగు నీటి కోసం తుంగభద్ర జలాశయంపై ఆధారపడి ఉన్నాయన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు నిర్మించేందుకు పూనుకున్నదని విమర్శించారు. తమ 8 రోజులు పర్యటన పూర్తయిన తర్వాత నివేదిక తయారుచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టుల స్థితిగతులపై వివరిస్తామని తెలిపారు. ఇరిగేషన్‌ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడి రైతులు సీపీఐ బృందం వద్దకు వచ్చి ఎగువ భద్ర నిర్మిస్తే తుంగభద్ర జలాశయంకు కోత పడుతుందని వాపోయారు. హెచ్‌ఎల్‌సి కాలువ దుస్థితిని అధికారులతోనూ రైతులతోనూ చర్చించారు. మార్చి చివరిదాకా సాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి లేఖ రాస్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జగదీశ్‌, ఈశ్వరయ్య, రామచంద్రయ్య, జంగాల అజయ్‌ కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, రైతు సంఘం నాయకులు కాటమయ్య, సీపీఐ జిల్లా జాఫర్‌, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, సంజీవప్ప, కేశవరెడ్డి, రామకృష్ణ, శ్రీరాములు, రమణ, రాజేష్‌, నాగరాజు, గోపాల్‌ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img