Friday, June 14, 2024
Friday, June 14, 2024

ఏపీలో మిన్నంటిన రైతు నిరసనలు

రైతుల మధ్య చీలికకు మోదీ కుట్ర
సాగు చట్టాలు రద్దు చేసేదాకా పోరు ఆగదు
ప్రజా ఉద్యమాలకు తలొంచక తప్పదని నేతల హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : దేశానికి అన్నంపెట్టే అన్నదాతలను అతి కిరాతకంగా వాహనాలతో తొక్కించి చంపిన కేసులు ప్రమేయం ఉన్న కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని, వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి అధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రైలురోకోలు నిర్వహించారు. ఆలిండియా రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు దేశ వ్యాపిత నిరసనలో భాగంగా విజయవాడ రైల్యేస్టేషన్‌ వద్ద రైల్‌ రోకోకు రైతులు సన్నద్ధమయ్యారు. అప్పటికే పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు మోహరించి అడ్డుకోవడంతో రైల్వేస్టేషన్‌ వెలుపల నిరశన ధర్నా నిర్వహించారు. వామపక్ష పార్టీల రైతు, కార్మిక, ప్రజాసంఘాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ రైతు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రధాని మోదీ..ఉద్యమాన్ని అణచేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. రైతులు, రైతుసంఘాల మధ్య చీలిక తెచ్చి ఉద్యమాన్ని బలహీనం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. లఖింపూర్‌ ఖేరిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను వాహనాలతో తొక్కించి, తుపాకీతో కాల్చి చంపటం దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటన అని పేర్కొన్నారు. ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ ఏడాది కాలంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని మోదీ సర్కార్‌ తక్కువగా అంచనా వేస్తోందని, ప్రజా ఉద్యమాలకు ఎవరైనా తలవంచక తప్పదని హెచ్చరించారు. రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇప్పటివరకు అనేక కేసులు బనాయించారని, తాజాగా లఖింపూర్‌ ఖేరీలో హత్యాకాండను భారీ కుట్రగా అభివర్ణించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష బాధ్యుడైన మంత్రి కుమారుడుని కఠినంగా శిక్షించాలని, మంత్రిని పదవి నుండి బర్త్‌రఫ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రజలంతా వ్యతిరేకిస్తున్న వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని, మోదీ ఇంకా మొండిగా వ్యవహరిస్తే అన్నదాతల ఆగ్రహానికి బలికాక తప్పదని రావుల హెచ్చరించారు. దీనిపై ఈ నెల 26న ఉత్తరప్రదేశ్‌లో భారీ నిరసన ప్రదర్శన జరగనున్నట్లు చెప్పారు. రైతుసంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ లఖింపూర్‌ రైతులను చంపిన బీజేపీ గుండాలను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు అర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ రైతుల హక్కులు హరిస్తున్న మోదీ…మానవ హక్కుల గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఈ ఉద్యమం రైతులు ఒక్కరికే సంబంధించినది కాదని, ప్రజలందరిదని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రైతు ఉద్యమం బీజేపీని చిత్తుగా ఓడిరచడం ఖాయమన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యలమందరావు, రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, రైతుసంఘం కార్యదర్శి పి.జమలయ్య, డి.హరనాథ్‌, సాగునీటి వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వేణుగోపాలకృష్ణ, సుబ్బరావమ్మ, నరహరిశెట్టి నరసింహారావు, ప్రజాసంఘాల నాయకులు టి.తాతయ్య, ఎన్‌ బ్రహ్మయ్య, జీవీ రాజు, మోతుకూరి అరుణకుమార్‌, గుమ్మడి వెంకటరత్నం, మున్నంగి నరసింహారావు, చెరుకూరి సుబ్బారావు, ఎమ్‌.రామకృష్ణ, మస్తాన్‌ వలి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో
రైతులను అతి కిరాతకంగా తొక్కించి పొట్టనబెట్టుకున్న కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని, నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైతులు తలపెట్టిన రైలురోకో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రైల్‌రోకో విఫలం చేయాలని ముందస్తు ప్రణాళికతో సివిల్‌, రైల్వే పోలీసులు 200 మందికి పైగా రైల్వేస్టేషన్‌ చేరుకుని దుర్భేద్యమైన, రక్షణ వలయం ఏర్పాటు చేశారు. వామపక్ష కార్యకర్తలు, రైతు నాయకులతో తీవ్ర వాగ్వాదానికి దిగి రైల్వే స్టేషన్‌లోకి వెళ్లకుండా లాఠీలతో అడ్డుకొని గెంటి వేశారు. ప్రతిఘటించిన నేతలను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌ దాకా తీసుకెళ్లి అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసుల దురుసు వైఖరిపై నేతలు మండిపడ్డారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు టి.జనార్ధన్‌, ఉపాధ్యక్షురాలు హేమలత, బీకేయంయూ జిల్లా కార్యదర్శి పెంచలయ్య, ఐక్య వేదిక కార్యదర్శి కుమార్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి, సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌, సీఐటీయూ కార్యదర్శి లక్ష్మి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, వైఎఫ్‌ కార్యదర్శి రామకృష్ణ, పద్మనాభరెడ్డి, బెల్లంకొండ శ్రీనివాసులు, మంజుల, రత్నమ్మ, ప్రమీల, జై చంద్ర, సాయిలక్ష్మి, శశి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో
ఒంగోలు రైల్వే స్టేషన్‌ వద్ద కిసాన్‌ సంయుక్త మోర్చా అధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుండి బర్త్‌రఫ్‌ చేయాలని, అతని కుమారుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కన్వీనర్‌ చుండూరి రంగారావు, రైతుసంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌ లలితకుమారి, అఖిల భారత రైతుకూలీ సంఘం కార్యదర్శి కోడూరి నాంచార్లు, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు కొంట్రగుంట వెంకయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్‌డీ సర్ధార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్‌ చౌదరి, ఐఎఫ్‌టీయూ నాయకులు ఆర్‌ మోహన్‌, ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు ఎంఎస్‌ సాయి, ఓపిడీఆర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావలి సుధాకర్‌, బహుజన నాయకులు మిరియం అంజిబాబు, పౌరసమాజం నాయకులు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img