Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

కమ్యూనిస్టుల పోరాటాలతోనే సంస్థానాల విలీనం

స్వయంగా అంగీకరించిన వల్లభాయ్‌ పటేల్‌
తెలుసుకోవాలని అమిత్‌ షాకు రాజా హితవు

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : కమ్యూనిస్టుల క్రియాశీల పోరాటాల ఫలితంగానే నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పోరాటం వల్లే ఇది సాధ్యమైందని నాటి కేంద్ర హోంమంత్రి వల్లభాయ్‌ పటేల్‌ చెప్పారని గుర్తు చేశారు. పటేల్‌ కారణంగానే హైదరా బాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైందని పదేపదే చెప్పే అమిత్‌ షా ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. సెప్టెంబరు 17 అనేది కేవలం కమ్యూనిస్టులకు సంబంధించి నది మాత్రమే కాదని, ఇది తెలంగాణ ప్రజలందరిదని, అందుకే ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేలా సీఎం కేసీఆర్‌పై మేధావులు, ప్రజలు ఒత్తిడి తీసుకురావాల న్నారు. 73వ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమర వీరుల స్మారక ట్రస్టు అధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సభ జరిగింది. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడు, సీపీఐ పూర్వ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా డి.రాజా, వక్తలుగా టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం.కోదండరామ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.
రాజా మాట్లాడుతూ 1925లో ఆవిర్భవించిన సీపీఐ తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం నినాదమిచ్చిందని గుర్తు చేశారు. 1938లో ఏర్పడిన అఖిలభారత కిసాన్‌ సభ ‘దున్నే వానికే భూమి’ నినాదాన్ని తొలిసారిగా తెరపైకి తెచ్చిం దన్నారు. ఈ రెండు నినాదాల ఆధారంగా భారతదేశం, హైదరాబాద్‌ సంస్థాన స్వాతంత్య్రోద్యమం, భూస్వామ్య వ్యతిరేకోద్యమంలో కమ్యూనిస్టు పార్టీ అమోఘమైన పాత్ర పోషించిందని, కమ్యూనిస్టు నాయకులు చేసిన త్యాగాలు ఇంకెవ్వరూ చేయలేదన్నారు. 1925లో ఏర్పడిన ఆర్‌ఎస్‌ ఎస్‌కు ఈ రెండు ఉద్యమాలలో ఎలాంటి పాత్ర లేదని, బ్రిటీషు పాలకులపై కనీసం వేలెత్తి చూపలేదని విమర్శిం చారు. అలాంటిది ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ చరిత్రను వక్రీకరి స్తున్నాయని దునుమాడారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా రాజ్యాంగంలో పెట్టాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ ఒత్తిడికి బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తలొగ్గలేదని చెప్పారు. ప్రధానిగా మోదీ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు మెట్ల వద్ద సాష్టాంగ నమస్కారం చేశారని రాజా గుర్తు చేస్తూ ఏడేళ్ల పాలనలో దేశాన్ని, రాజ్యాంగాన్ని, పార్లమెంటు, ప్రజా స్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తితో మతతత్వ, కార్పొరేట్‌ అనుకూల ఫాసిస్టు శక్తులపై పోరాటానికి ప్రజలను ఏకం చేయాలని రాజా పిలుపునిచ్చారు.
బీజేపీ కిడ్నాప్‌ కుట్ర : సురవరం
సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ నాడు నిజాం నవాబు తెలంగాణ ప్రజల రక్తాని జలగల్లా పీల్చి రూ.400 కోట్లు సంపాదించి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా మారాడని, నేటి ప్రధాని మోదీ 20మంది కార్పొరేట్ల కోసం మొత్తం దేశాన్నే అమ్మేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, పోరాటంలో మరణించిన అమరవీరుల త్యాగాలను పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కిడ్నాప్‌ చేసే బీజేపీ ప్రయత్నం అత్యంత నీచమైందని, దీనిని ప్రజలు నిరాకరిస్తారని, ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిజాం సంస్థానాన్ని విలీనం చేయడమే భారత సైన్యం లక్ష్యమైతే కమ్యూనిస్టులపై వారు దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్‌ వల్లే బీజేపీ బలపడిరది : నారాయణ
నారాయణ మాట్లాడుతూ తెలంగాణ విలీనం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌…దీనిని అధికారి కంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వల్లనే రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ మాట్లాడుతూ నాటి భూస్వామ్య విధానాలే రాష్ట్రంలో కొనసాగుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఎవరినీ కలిసే పరిస్థితులు లేవని, ప్రశ్నించేవారిపై దాడులు, అరెస్టులు జరుగుతున్నాయన్నారు. మనుషుల ప్రాణం పోయినా పట్టించుకోని ప్రభుత్వం ఏమి ప్రభుత్వ మని ప్రశ్నించారు. పోడు భూముల పరిష్కారానికి స్పష్టమైన చట్టం ఉన్నప్పటికీ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు. చట్టం అమలుకు కమిటీ అవసరమన్నారు. ప్రజాస్వామ్య విలువల కోసం ఐక్య పోరా టం చేయాలన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజ లను ఊచకోత కోసిన ఖాసీం రజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీతో టీఆర్‌ఎస్‌ దోస్తీ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట సమరయోధులను గుర్తించకుండా, వారికి పెన్షన్లు ఇవ్వకుండా బీజేపీ ఉత్సవాలు చేయడాన్ని తప్పుపట్టారు. మిలిటెంట్‌ తరహా భూ పోరాటం అత్యవశ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు తప్పదన్నారు. సభలో నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు సీహెచ్‌ హనుమంతరావు, మనోహర పంతులు, దొడ్డ నారాయణరావు, బత్తిని యాదగిరి, ఎడ్ల నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, జైన్‌ మల్లయ్య, కొమురయ్య, ఏటుకూరి కృష్ణమూర్తిలను సన్మానించి, జ్ఞాప్తికలు బహుకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img