Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

కార్పొరేషన్‌లకు నిధులేవి?

సంక్షేమాన్ని విస్మరించడమే రాజన్న రాజ్యమా?
చేతివృత్తిదారుల ఆగ్రహం
సమాఖ్య అధ్వర్యాన రాష్ట్రవ్యాప్త ధర్నాలు
సీఎం స్పందించకుంటే ఆందోళన ఉధృతం రామాంజనేయులు, చలపతి

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వృత్తుల కార్పొరేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని, చేతి వృత్తిదారులకు ఆయా కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్పొరేషన్‌ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాది క్రితం ఏర్పాటు చేసిన 56 వృత్తుల కార్పొరేషన్‌లకు, పాలక వర్గ సభ్యులకు జీతభత్యాలు చెల్లిస్తూ కార్పొరేషన్‌లకు మాత్రం ఒక్క పైసా నిధులు కేటాయించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు విమర్శించారు. చేతి వృత్తిదారుల సంక్షేమాన్ని విస్మరించి రాజన్న రాజ్యాన్ని ఎలా తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. చేతివృత్తిదారుల సమాఖ్య పిలుపులో భాగంగా విజయవాడలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని డీఆర్వోకు చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి తరపున కె.రామాంజనేయులు, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధవరపు వెంకట్రావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.నాగసుబ్బారెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్‌. వెంకట శివ వినతిపత్రం సమర్పించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌..తన మూడేళ్ల పాలనాలో 30 రకాలకు పైగా చేతి వృత్తిదారులకు ఒరిగిందేమీ లేదని రామాంజనేయులు అన్నారు. నవరత్నాల్లోనూ రకరకాల నిబంధనలతో కోతలు విధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా కాలంలోనూ చేతి వృత్తిదారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నూతన సాంకేతిక యంత్ర పరికరాలు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధి కోల్పోయి వృత్తిదారులు అర్ధాకలితో అలమటిస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారంతా ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదలేనని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే చేతి వృత్తుల, కులవృత్తుల కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించాలని రామాంజనేయులు కోరారు.
కార్పొరేషన్లకు తక్షణమే నిధులు కేటాయించాలి: జింకా చలపతి
వృత్తిదారుల కార్పొరేషన్‌లకు తక్షణమే నిధులు కేటాయించాలని చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి డిమాండ్‌ చేశారు. సమాఖ్య పిలుపు మేరకు సత్యసాయి జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీవో వరప్రసాదరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం చలపతి మీడియాతో మాట్లాడుతూ సాంకేతికత ప్రభావంతో చేనేత, గీత, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, రజక వంటి చేతివృత్తులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని, చేతివృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కోట్లాదిమంది ఉపాధి తీవ్ర ప్రమాదంలో పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లు ఉపయోగపడతాయని ప్రజలు భావించారని, కానీ సీఎం జగన్‌ మాటలు కోటలు దాటాయి తప్ప చేతులు పొలిమేర దాటదన్నట్లు వీటికి నిధులు కేటాయించకుండా దిష్టిబొమ్మలుగా మార్చారని విమర్శించారు. చేనేత నాయకులు వెంకటనారాయణ, వెంకటస్వామి, రవికుమార్‌, చెన్నా భుజంగం, ఈశ్వరయ్య, శ్రీధర్‌, ఆదినారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో
చేతి వృత్తిదారులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవడం దారుణమని జిల్లా చేతి వృత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు మాధవస్వామి, కార్యదర్శి కారన్న విమర్శించారు. బీసీ కార్పొరేషన్‌ ఎదుట చేతివృత్తిదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం సంక్షేమశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. చేతివృత్తిదారుల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, చేనేత జిల్లా జిల్లా అధ్యక్షుడు సోము మోహన్‌, ఎం రంగప్ప, వెంకటేశ్‌, కె.శ్రీనివాసులు, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కారుమంచి, అధ్యక్షుడు శ్రీనివాసులు, బిసన్న, డీహెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి మహేశ్‌, ఏఐటీయూసీ నాయకులు రామాంజనేయులు, చంద్రకళ పాల్గొన్నారు.
నంద్యాలలో
చేతి వృత్తిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్యకు చేతివృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయుడు, కార్యదర్శి సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం గోస్పాడు మండల అధ్యక్షుడు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో
కులవృత్తులు, చేతి వృత్తిదారులను ముఖ్యమంత్రి రోడ్డున పడేశారని, అణగారిన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని చేతివృత్తిదారుల సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షుడు లింగమయ్య విమర్శించారు. చేతివృత్తిదారులు బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమాఖ్య జిల్లా కార్యదర్శి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో లింగమయ్య, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పెనకచర్ల బాలయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బంగారు భాషా, శాలివాహన సంఘం నాయకులు వెంకట్‌, నారాయణ, హనుమంతు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు గోవిందరాజు, రవి, కొండయ్య, నారప్ప, గీత కార్మిక సంఘం నాయకులు ప్రసాద్‌, జయలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్‌ లలితమ్మ, రఘు, మత్స్యకారుల సంఘం నాయకులు వెంకట్‌, భాస్కర్‌, కమ్మరి సంఘం నాయకుడు నార్పల సూరి, ఉప్పర సంఘం నాయకుడు జయరామ్‌, వడ్డెర సంఘం నాయకులు శీనన్న, వడ్డే శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం నాయకులు సత్యనారాయణ, రజక వృత్తిదారుల సమాఖ్య నాయకులు నాగప్ప, నాగరాజు, పెయింటర్‌ భూషణ, సుబ్బరాయుడు, రాజు, రామాంజనేయులు, ఎస్టీ నాయకుడు వెంకటేశ్‌, మైనార్టీ నాయకుడు ఖాజా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img