Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

కొత్త సీఎస్‌పై సస్పెన్స్‌!

. తాజాగా తెరపైకి గిరిధర్‌ అరమణే
. సీఎం జగన్‌తో అర్థగంటకు పైగా భేటీ
. ఐఏఎస్‌ల్లో గంటగంటకూ పెరుగుతున్న ఉత్కంఠ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీకి రాబోయే కొత్త సీఎస్‌ పై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. మొన్నటివరకు తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌ పై వచ్చిన శ్రీలక్ష్మికి సీఎస్‌ పదవి దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరగ్గా, రెండు రోజుల క్రితం ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్‌ రెడ్డికి దాదాపు ఖాయమైనట్లు వార్త గుప్పుమంది. రేపో, మాపో ఉత్తర్వులు కూడా వెలువడతాయని ఎదురుచూస్తున్న సమయంలో శనివారం తాజాగా కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గిరిధర్‌ అరమణే పేరు తెరపైకి వచ్చింది. ఈనెలాఖరుకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సమయం మరో నాలుగు రోజులే ఉన్నందున ఐఏఎస్‌ల్లో కొత్త సీఎస్‌ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన గిరిధర్‌ ఏపీ కేడర్‌ సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. సీఎం జగన్‌తో శనివారం గిరిధర్‌ భేటీ కావడంతో ఐఏఎస్‌ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది. ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్‌ కావలసి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. అంటే… ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. సమీర్‌ శర్మను వదులుకోవడం ఇష్టంలేకో మరో కారణం వల్లో 2023 నవంబరు వరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు. కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది. సమీర్‌ శర్మ తర్వాత ఏపీ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలున్నారు. వీరందరిలో పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి పేర్లు మాత్రమే తదుపరి సీఎస్‌ పదవికి వినిపిస్తున్నాయి. సమీర్‌ శర్మకు రెండోసారి పొడిగింపు రాకముందు తదుపరి సీఎస్‌ తానే అని 1988 బ్యాచ్‌కు చెందిన పూనం మాలకొండయ్య గట్టిగా భావించారు. ఇప్పుడు ఎందుకోగానీ ఆమె నిశ్శబ్దం వహించారు. ఆమె సీఎస్‌ ఆయ్యే అవకాశం లేదని ఐఏఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. శ్రీలక్ష్మికి సీఎస్‌ పదవి అప్పగించడంపై జగన్‌ కోటరీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గం, విధేయత, ఇలా ఏ కోణంలో చూసినా జవహర్‌ రెడ్డికే సీఎస్‌ పోస్టు కట్టబెట్టాలని భావించారు. కానీ ఈ ఇద్దరిని పక్కకు నెట్టేసి సీఎస్‌ రేసులోకి గిరిధర్‌ అరమణే వచ్చారు. వీరి ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరివైపు మొగ్గుచూపుతారో మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img