Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కోవిడ్‌ మరణాలపై గుజరాత్‌ దొంగలెక్కలు !

అధికారికంగా 10వేలు : క్లెయిమ్‌లు అందుకు తొమ్మిది రెట్లు అధికం
మరణాల వాస్తవ సంఖ్యను దాచిపెట్టిన బీజేపీ ప్రభుత్వం
తమిళనాడు, తెలంగాణ, యూపీ, చత్తీస్‌గఢ్‌, ఏపీ, దిల్లీలోనూ ఇదే స్థితి
బెంగళూరు :
కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసేసింది. మొదటి రెండు దశల్లో లక్షలాది మంది మరణించారు. అయితే రాష్ట్రాలు మాత్రం మరణాల సంఖ్యను ఉన్నదానికంటే తక్కువగా చూపుతూ వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎత్తిచూపింది. భారత్‌లో కోవిడ్‌ మరణాల అధికారిక లెక్కలను నమ్మబోమని ఒక సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే ఇవన్నీ ఆరోపణలు కాదు నిజమని మరోమారు రుజువు అయింది. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 10,094 అని గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నష్టపరిహారం కోసం వచ్చిన దరఖాస్తులపై తాజాగా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వగా అందులో వచ్చిన క్లెయిమ్‌ల సంఖ్యను 68,370గా పేర్కొంది. కానీ నిజానికి ఆ రాష్ట్రంలో 89,633 దరఖాస్తులు వచ్చాయని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని తెలుస్తోంది. గుజరాత్‌ ప్రభుత్వం కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారాన్ని ప్రకటించగా మిగతా రాష్ట్రాలు తమకు తోచినంత ప్రకటించాయి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే కోవిడ్‌ మరణాలను గుజరాత్‌ ప్రభుత్వం ధ్రువీకరించిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిరచారు. చనిపోయే ముందు సంబంధిత వ్యక్తికి కోవిడ్‌ సోకినాగానీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే ఇతరత్రా కారణాల వల్ల మరణించినట్లుగానే పరిగణించిందని, అలా సంభవించినవి కోవిడ్‌ మరణాల లెక్కలోకి రావని తెలిపారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌ సోకిన నెలలోగా వ్యక్తి చనిపోతే నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకోవచ్చు. అందుకోసం పాజిటివ్‌ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. బహుశ ఈ కారణంగానే మరణాలకు, క్లెయిమ్‌లకు మధ్య పొంతన ఉండటం లేదు. మరణాలను తక్కువగా చూపడం కేవలం ఇప్పుడే కాదు 2020లోనూ జరిగిందని ది వైర్‌ సైన్స్‌ అధ్యయనాల్లో వెల్లడి అయింది. గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్‌ మరణాల సంఖ్యకు దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా మరణాలు సంభవించినట్లు తేలింది. భారత్‌లో వాస్తవ కోవిడ్‌ మరణాలు అధికారిక లెక్కల కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడి అయిందని ఎపిడెర్మలాజిస్ట్‌ ప్రభాత్‌ రaా తెలిపారు. ఈ అధ్యయనం వివరాలను జనవరి 6న ప్రచురించారు. 2020 ఆగస్టులో ది వైర్‌ సైన్స్‌ ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టుతో చాలా నిజాలు వెలుగుచూశాయి. గుజరాత్‌లోని వడోదరా, సూరత్‌ నగరాల్లో, తెలంగాణలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల అతిక్రమణ జరినట్లు వెల్లడి అయింది. కోవిడ్‌ సోకి మరణించినప్పటికీ వ్యక్తికి ఇతర వ్యాధులు ఉన్నందునే ప్రాణం పోయిందని పేర్కొంటూ సంబంధిత మరణాన్ని కోవిడ్‌ వల్ల సంభవించినదిగా నమోదు చేయకపోవడం ఆయా రాష్ట్రాల్లో కనిపించింది. గుజరాత్‌ రాష్ట్రంలో సంభవించిన సగానికిపైగా కోవిడ్‌ మరణాలు అహ్మదాబాద్‌, సూరత్‌లలోనే నమోదు అయినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ కూడా తొలుత మరణాలను తక్కువగా చూపి ఆపై కొంత కాలానికి సంఖ్యను సవరించి పంపుతుండటం రెండేళ్లుగా సాగుతోంది. ఇది ‘రీకన్సిలియేషన్‌ ఎక్సర్‌సైజ్‌’. అయితే ఆ తర్వాత కూడా మహారాష్ట్ర కోవిడ్‌ అధికారిక లెక్కకు వాస్తవంగా సంభవించిన మరణాల సంఖ్యకు పొంతన కుదరలేదని 2020 జూన్‌లో గణితశాస్త్రవేత్త మురాద్‌ బనాజీ వెల్లడిరచారు. 2021 జూన్‌లో తమిళనాడులోని ఓ ఎన్జీవో కూడా ఆ రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల వ్యత్యాసాన్ని ప్రధానంగా పేర్కొంది. అధికారిక లెక్క కంటే ఆరు రెట్లు అధికంగా మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఏప్రిల్‌లో కోవిడ్‌లో ఒక్కరూ మరణించలేదని గాంధీనగర్‌ అధికారులు పేర్కొనగా ఆ సమయంలో కోవిడ్‌ మృతదేహాలతో శ్మశానాలు నిండివున్నాయి. అప్పట్లో గుజారాతీ దినపత్రిక సందేశ్‌ సంపాదకులు రాజేశ్‌ పాథక్‌ బీబీసీతో మాట్లాడుతూ మరణాలను తక్కువగా చూపుతున్నారన్న తమ వార్తాలను గుజరాత్‌ ప్రభుత్వం తిరస్కరించలేదు, సమర్థించనూ లేదని చెప్పారు. ప్రస్తుతం పరిహారం కోసం వచ్చిన 68వేల క్లెయిమ్‌లను ప్రభుత్వం ఆమోదించడాన్ని బట్టి ఆ వార్తల్లో నిజం లేకపోలేదని స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img