Friday, August 19, 2022
Friday, August 19, 2022

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్య

ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా కాల్పులుసాయుధుడి అరెస్టు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
ప్రధాని కిషిడా దిగ్భ్రాంతిభద్రతా ఏర్పాట్లపై దర్యాప్తునకు ఆదేశం
నేడు సంతాప దినం ప్రకటించిన భారత్

టోక్యో:
జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబే శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్‌లోని నరా పట్టణంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై కాల్పులు జరిగాయి. సాయుధ దుండగుడు రెండుసార్లు కాల్పులు జరుపగా బులెట్లు అబే ఛాతీలోకి దూసుకెళ్లాయి. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావం అవుతుంటే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అబే పరిస్థితి విషమించింది. కీలక అవయవాలు పని చేయడం ఆగిపోయింది. గుండె స్పందన లేదు. షింజో అబేను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. షింజో అబే గుండె బాగా దెబ్బతిన్నదని, మెడ వద్ద రెండు గాయాలతో ధమని దెబ్బతిని తీవ్ర రక్తస్రావం అయి గుండెపోటు స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని నరా వైద్య విశ్వవిద్యాలయం అత్యవసర విభాగాధిపతి హిడేటడా ఫుకుషిమా తెలిపారు. దేశంలో అత్యంత శక్తిమంత నాయకుల్లో ఒకరైన అబే మరణ వార్త జపాన్‌ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనాస్థలిలోనే సాయుధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో జపాన్‌ ఒకటి కాగా ఇక్కడ మారణాయుధాల నియంత్రణ చట్టాలు కఠినంగా ఉంటాయి. షింజో అబే కాల్చివేత గురించి తెలిసి వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారంతో బిజీగా ఉన్న ప్రధాని ఫ్యూమియో కిషిడా, కేబినెట్‌ మంత్రులు వెంటనే టోక్యోకు తిరిగొచ్చారు. జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించిన అబే 2020లో గద్దెదిగారు.
వీడియోలు వైరల్‌:
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలతో పాటు వార్తా ఛానళ్లలో కనిపించాయి. ప్రచారాధికారులు కింద పడిపోయిన అబేను చుట్టుముట్టి ఉండటం వాటిలో కనిపించింది. అబే మరణానికి ముందు జరిగిన ఘటనల వీడియోను ఎన్‌హెచ్‌కే టీవీ ప్రసారం చేసింది. నీలం రంగు సూటు ధరించి…పిడికిలి బిగించి చేయి పైకెత్తి నరా రైల్వేస్టేషన్‌ బయట అబే ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై రెండుసార్లు కాల్పులు జరిగాయి. అబే రోడ్డుపై కుప్పకూలిపోయారు. భద్రతా సిబ్బంది ఆయన వద్దకు పరుగు పరుగున చేరుకున్నారు. అబే చొక్కా రక్తంతో తడిచి ఆయన ఛాతి పట్టుకొని ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.
బూడిద రంగు చొక్కా ధరించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం, అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకోవడం కనిపించింది. నిందితుడిని తెత్సుయా యమాగామి(41)గా పోలీసులు గుర్తించారు. ఇతను గతంలో మూడేళ్ల పాటు మారిటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (సముద్ర స్వీయరక్షణ దళం)లో పనిచేసినట్లు ఎన్‌హెచ్‌కే వార్తాఛానల్‌ పేర్కొంది. అబేపై యమాగామి ఎందుకు కాల్పులు జరిపారో తెలియలేదు. తుపాకీతో సభా ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించడాన్న దానిపై ఆరా తీస్తున్నారు. భద్రతాలోపాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రెస్‌ కెమెరాగా భ్రమపెట్టి ఆయుధాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రధాని కిషిడా ఖండన:
అబే హత్యను అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రధాని కిషిడా భావోద్వేగానికి గురయ్యారు. భద్రతా పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం యోచించిందిగానీ అబేకు అత్యధిక భద్రతను కల్పించిందని చెప్పారు. అబే కాల్చివేత జపాన్‌ ప్రజాస్వామానికి సవాల్‌ విసురుతోందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.
అబేకు అరుదైన వ్యాధి:
యుక్తవయసు నుంచే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అబే గతంలో వెల్లడిరచారు. అదే కారణంగా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా సమయంలో అల్సరేటివ్‌ కొలైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. అనేక లక్ష్యాలను అసంపూర్ణంగా వదిలి వెళ్లడం బాధిస్తోందని చెప్పారు. ఉత్తర కొరియా చాలా ఏళ్ల కిందట జపనీయులను అపహరించిన అంశాన్ని పరిష్కరించడంలో విఫలమైనట్లు వెల్లడిరచారు. అబే తన 52వ ఏట అంటే 2006లో జపాన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు.
అతిపిన్న వయస్సు ప్రధానిగా నిలిచారు. ఈయన రాజకీయ ప్రస్తానం ఒడిదుడుకుల మధ్య సాగింది. ఆరుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. జపాన్‌ను అభివృద్ధి పథంలో నడిపారు. ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చారు. జపాన్‌, అమెరికా మధ్య మైత్రిని బలోపేతం చేశారు. బడుల్లో దేశభక్తి పాఠాలు చెప్పించి అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌ ప్రతిష్ఠను పెంచారు. తనకున్న వ్యాధి తిరగబెట్టినందున 2020లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.
అబే భారత్‌కు ఆత్మీయుడు: మోదీ
షింజో అబే భారత్‌కు ఆత్మీయుడని, తనకు ఆప్త మిత్రుడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అబే హత్యను ఖండిస్తూ ఆయన మరణానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని మెరుగైన స్థలిగా మార్చేందుకు అబే నిబద్ధతతో పనిచేశారని శ్లాఘించారు. అబే మరణానికి సంతాపంగా జులై 9న(నేడు) భారత్‌లో సంతాప దినంగా పాటిస్తామని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. భావోద్వేగంగా ట్వీట్లు చేశారు. ఇటీవల జపాన్‌కు వెళ్లినప్పుడు అబేను కలిసి అనేక అంశాలపై చర్చించినట్లు గుర్తుచేసుకున్నారు. అదే తమ చివరి సమావేశం అవుతుందని అనుకోలేదన్నారు. అబే హత్య తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆత్మీయ మిత్రుల్లో ఒకరిని కోల్పోవడం తీవ్రంగా బాధించిందని మోదీ పేర్కొన్నారు.
అబే అద్భుతమైన నాయకుడని కొనియాడారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే అబేతో పరిచయం ఉందన్నారు. అబే కుటుంబానికి, జపాన్‌ ప్రజలకు సానుభూతిని ప్రకటించారు. భారత్‌`జపాన్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడానికి అబే కారణమన్నారు. ఈ కష్టసమయంలో జపాన్‌కు భారత్‌ తరపున సంఫీుభావాన్ని ప్రకటించిన మోదీ..ఇటీవల టోక్యోలో అబేతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img