Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

డేంజర్‌ బెల్స్‌.. 11 వేలకు పైనే కరోనా కొత్త కేసులు.. 29 మరణాలు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం కూడా భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 11 వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11,109 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితోపోలిస్తే 9 శాతం ఎక్కువ. నిన్న ఒక్కరోజే 10,158 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. ప్రస్తుతం 49,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,16,583 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,064 కి చేరింది.ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల ( 220,66,25,120) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం చాలా ముఖ్యం. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇక ఆసుపత్రులు వంటి ప్రదేశాల్లో డబుల్‌ లేయర్‌ మాస్క్‌లు ధరించడం మంచిది్ణ అని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాయర్ పేర్కొన్నారు.కాగా, ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం మేర కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. ఇక బుధవారం ఒక్కరోజే 7,830 కరోనా కేసులు నమోదుకాగా, గురువారం 10,158 కొత్త కేసులు బయటపడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img