Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

తెగని గొడవ !

. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం
. జైపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో గెహ్లాట్‌ భేటీ
. దిల్లీ చేరుకున్న సచిన్‌ పైలట్‌

న్యూదిల్లీ/జైపూర్‌ : రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో గొడవ సద్దుమణగలేదు. సీఎం పీఠం కోసం కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విధేయులు ఏకంగా పార్టీ అధిష్ఠానానికి ధిక్కార స్వరం వినిపించడంతో గెహ్లాట్‌ వైఖరి పట్ల అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సీఎం ఎన్నిక కోసం జైపూర్‌ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ సైతం సంక్షోభాన్ని చక్కదిద్దలేక చేతులెత్తేసి దిల్లీ వచ్చేశారు. 82 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరు కాకుండా ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించడాన్ని ‘క్రమశిక్షణా రాహిత్యం’గా పార్టీ పరిశీలకులు అభివర్ణించారు. ఖర్గే, మాకెన్‌ రాజస్థాన్‌ పరిణామాలపై లిఖితపూర్వక నివేదికను సోనియాకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో తిరుగుబాటుకు కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంగళవారం జైపూర్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులతో సమావేశ మయ్యారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షు రాలు సోనియా గాంధీతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు, సచిన్‌ పైలట్‌ సోనియాను కలిసేందుకు దిల్లీ వెళ్లారు. అయితే వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత రాజస్థాన్‌ సీఎం పదవిపై నిర్ణయం తీసుకోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కాగా, సీఎం అశోక్‌ గెహ్లాట్‌పై ఇప్పట్లో ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమని కూడా చెబుతున్నాయి.
అశోక్‌ గెహ్లాట్‌తో మాట్లాడలేదు: సచిన్‌ పైలెట్‌
రాజస్థాన్‌ సీఎం పదవి విషయంలో తాను అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చించ లేదని ఆ పార్టీ నాయకుడు సచిన్‌ పైలెట్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం గెహ్లాట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే సీఎం పదవిలో కొనసాగ కూడదని పైలట్‌ న్యూదిల్లీలో పార్టీ అధిష్ఠానానికి చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇదిలాఉండగా, సీఎం పదవి కోసం సచిన్‌ పైలట్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం జైపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన శిబిరంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం పైలట్‌ పెదవి విప్పలేదు. అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి ఉండాల్సిందిగా ఆయన తన మద్దతుదారులను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ఖిలాడీ లాల్‌ బైర్వా మీడియాతో మాట్లాడుతూ 2023 ఎన్నికల కోసం పార్టీ అగ్ర నాయకత్వం సంస్థను పునర్నిర్మిస్తున్నదని, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించేది వారేనని చెప్పారు. అజయ్‌ మాకెన్‌ చేసిన క్రమశిక్షణా రాహిత్యం వ్యాఖ్యపై రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ మహేష్‌ జోషి మంగళవారం మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం పై ఒత్తిడి పెంచడానికి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు విధేయులైన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని తెలిపారు. ‘మేం అధిష్ఠానం పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కానీ మా అభిప్రాయం చెప్పేందుకు ప్రయత్నించాం. నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం.. ఎవరైనా సందేహాలు లేవనెత్తితే కట్టుబడి ఉంటాం. మా విధేయత లేకుంటే, రాజస్థాన్‌లో చాలా కాలం క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయి ఉండేది’ అని విలేకరులతో అన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి బరిలో ఎవరెవరు ఉంటారన్న దానిపై సందేహాలు ఇంకా నివృత్తి కాలేదు. అయితే పార్టీ కేంద్ర ఎన్నికల మండలి చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ మాత్రం కొంత స్పష్టత ఇచ్చారు. ‘కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబం ధించి ఇప్పటి వరకు చేసిన పనిని మేము కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షు రాలు సోనియా గాంధీకి వివరించాం. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి వరకు శశి థరూర్‌, పవన్‌ బన్సాల్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు’ అని మిస్త్రీ మంగళవారం మీడియాతో తెలిపారు. గెహ్లాట్‌కు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు అక్టోబర్‌ 19న పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత గెహ్లాట్‌ను సంప్రదించి ముఖ్యమంత్రి ఎంపిక పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img