Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

తేలని పంచాయితీ

. విభజన అంశాలపై ముగిసిన కేంద్ర హోం శాఖ సమావేశం
. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు హాజరు
. కుదరని ఏకాభిప్రాయం
. ప్రత్యేక హోదా ప్రస్తావన ఏదీ?
. విద్యుత్‌ బకాయిలపై కొనసాగని చర్చ
. రైల్వే జోన్‌ అసాధ్యమన్న హోం శాఖ
. రాజధానికి నిధుల నిరాకరణ
. వెనుకబడిన జిల్లాల నిధులు ఐదేళ్లకే పరిమితం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా నేతృత్వంలో మంగళవారం ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. వివాదాలపై రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ఏకాభి ప్రాయం కుదరలేదు. సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు ఇంధన, విద్యుత్‌, పౌర సరఫరాల, పారిశ్రామిక, మార్కెటింగ్‌ తదితర శాఖల కార్యదర్శులు హాజరై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 14 అంశాలపై చర్చించగా, అందులో ఏడు అంశాలు రెండు రాష్ట్రాల ఉమ్మడి అంశాలుగా ఉన్నాయి. మరో ఏడు అంశాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే ఉన్నాయి. కొత్త రాజధానికి కేంద్రం సహకారం, నిధులు, పన్నుల రాయితీ, ఏడు వెనుకబడిన ప్రాంతాల జిల్లాలకు నిధులు, కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ప్రభుత్వ కంపెనీలు తదితర అంశాలపై చర్చించినా ఏ ఒక్క అంశమూ కొలిక్కి రాలేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించి కార్పొరేషన్ల విభజన, 9, 10 షెడ్యూలులోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన అంశాల పైనా అదే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్‌ పంపిణీ పైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర బిందువైన ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేశారు. విద్యుత్‌ బకాయిల పైనా చర్చించలేదు. మళ్లీ మొక్కుబడిగానే ముగిసింది. మళ్లీ భేటీ కావాలా?, వద్దా? అనే దానిపై నిర్ణయించకుండానే సమావేశం ముగిసింది.
ప్రతి అంశానికీ తెలంగాణ అడ్డంకి
ప్రతి అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అధికారులు అడ్డుతగిలారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి సహకరించకుండా, తెలంగాణ అధికారులు ఏదొక సాకు చెబుతూ అంగీకరించలేదు. రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేయగా, ఆ నిర్ణయాన్ని కేబినెట్‌కు వదిలేయాలని హోం శాఖ కార్యదర్శి సూచించారు. రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఇప్పటికే ఇచ్చిన రూ.1500 కోట్ల వివరాలు ఇవ్వాలని కేంద్రం వివరణ కోరింది. శివరామకృష్ణన్‌ కమిటీ రూ.29 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదు. వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరగా, ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని హోం శాఖ అధికారులు స్పష్టం చేశారు. షీలా బిడే కమిటీ సిఫార్సులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. షీలా బిడే కమిటీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదని హోం శాఖ అధికారులు దాటవేశారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ తెలంగాణ అంగీకరించకపోయినా, హోం శాఖ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. న్యాయ నిపుణుల సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశాన్ని తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహా వివిధ సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నాయని తెలంగాణ అధికారులు వెల్లడిరచారు. పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున ఎలాంటి నిర్ణయం లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంలో కేంద్రం మరోసారి మెతక వైఖరి అవలంభించింది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూలు`9లోని సంస్థల విభజనకు షీలాబిడే కమిటీ మొత్తం 90 సంస్థల విభజనకు ప్రతిపాదించిందన్నారు. ఆ మేరకు వివాద పరిష్కారానికి హోం శాఖ ఉప కమిటీ నియమించిం దని, 90 సంస్థలను 3 భాగాలుగా విభజించారని పేర్కొన్నారు. 53 ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు ఏకాభిప్రాయం ఉందని, 15 సంస్థలకు తెలంగాణ అంగీకరిస్తే, ఆంధ్రప్రదేశ్‌ ఒప్పుకోలేదని వివరించింది. 22 సంస్థల విషయంలో తెలంగాణ అంగీకరించలేదని, వాటిపై తెలంగాణ హైకోర్టులో కేసులు పెండిరగ్‌లో ఉన్నట్లు తెలిపింది.
25 సార్లు భేటీ వృధా
రెండు రాష్ట్రాల విభజన అంశాల పై ఇప్పటివరకూ 25 సార్లుగా దిల్లీ కేంద్రంగా నిర్వహించిన సమావేశాలు వృధాగా మారాయి. ఈ ఏడాదిలో దిల్లీ కేంద్రంగా ఇది నాలుగో భేటీ కొనసాగినా ఫలితం లేదు. విభజన అంశాలను కొలిక్కి తేవడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అవలంభిస్తోంది. ఆది నుంచి తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది. మొక్కుబడిగా హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించి హడావుడీ చేస్తుందేగానీ సమస్య పరిష్కారంపై చొరవ చూపడం లేదు. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పంపిణీలో వివక్ష చూపుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరుగున పడేసింది. గత ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మోదీ చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలకు మోదీ నిధులను కేటాయించి, మిగిలిన రాష్ట్రాలను చిన్న చూపు చూస్తున్నారనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. పార్లమెంటులో చేసే బిల్లులకు సంపూర్ణ మద్దతిస్తోంది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ భేటీలు నిర్వహించి, గట్టిగా విభజన సమస్య లపై మాట్లాడితే కొంత వరకైనా పరిష్కారమయ్యేవి. మూడేళ్ల నుంచి మోదీతో జగన్‌ భేటీలు నిర్వహించినా నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా సీఎం మేల్కొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img