విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 24న దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ప్రత్యేకించి షెడ్యూల్ 13లోని అంశాలపై 24న సమావేశంలో చర్చించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పెండిరగ్ విభజన సమస్యలపై తొలిసారిగా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. ఇటీవల మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరుగా కలిసిన సందర్భంలో విభజన చట్టంలోని అంశాల అమలు గురించి ప్రస్తావించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై పెండిరగ్ అంశాలపై చర్చించారు. వీటి పరిష్కారానికి మూడంచెల విధానం పాటించాలని నిర్ణయించారు. వీటిలో కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు కూడా చర్చకు రానున్నాయి.