Friday, March 31, 2023
Friday, March 31, 2023

దేశ సమాఖ్య స్ఫూర్తిని రక్షించుకోవాలి

ప్రాంతీయ పార్టీలన్నీ ఒక అవగాహన రావాలి
కాంగ్రెస్‌ తన దారిలో వెళ్లవచ్చు…
భవిష్యత్తు కూటమికి ఆ పార్టీని దూరం పెట్టాలి
మమతా బెనర్జీ

కోల్‌కతా : దేశ సమాఖ్య స్ఫూర్తిని రక్షించుకోవాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అన్నారు. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ఎం.కె.స్టాలిన్‌, కె.చంద్రశేఖరరావులకు సంప్రదింపులు జరపడానికి ఒక రోజు ముందు టీఎంసీ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తుల్లో ఏర్పాటు చేయబోయే అటువంటి కూటమికి కాంగ్రెస్‌ను దూరం పెట్టాలని అన్నారు. ఏ ప్రాంతీయ పార్టీలూ దానితో సత్సంబంధాలను పంచుకోవని, ‘కాంగ్రెస్‌ తన దారిలో తను వెళ్లవచ్చు’ అని ఆమె తెలిపారు. తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, చంద్రశేఖరరావులకు తనకు మధ్య సుహృద్భావ వాతావరణం పెరుగుతున్న నడుమ బెనర్జీ ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం ఆ ఇద్దరి నేతలతో బెనర్జీ ఫోన్‌లో చర్చించారు. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఎంసీ భారీ విజయం సాధించిన తర్వాత సోమవారం బెనర్జీ మాట్లాడుతూ ‘దేశ సమాఖ్య నిర్మాణాన్ని, దేశ రాజ్యాంగాన్ని కూల్చివేశారు. దానిని కాపాడుకునేందుకు అందరం కలిసి రావలసిన అవసరం ఉంది’ అని అన్నారు. స్టాలిన్‌, చంద్రశేఖరరావులతో తన టెలిఫోన్‌ సంభాషణను ప్రస్తావిస్తూ, ‘సమాఖ్య నిర్మాణం పరిరక్షణకు మేము కలిసి ప్రయత్నిస్తున్నాం. ప్రాంతీయ పార్టీలన్నీ తప్పనిసరిగా ఒక అవగాహనకు రావాలి’ అని తెలిపారు. గోవాలో పొత్తు విషయంలో కాంగ్రెస్‌తో విభేదించిన తర్వాత ఒక కూటమి ఏర్పాటుకు బెనర్జీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో ఏ ప్రాంతీయ పార్టీ స్నేహపూర్వక సంబంధాలను నెరపదని అన్నారు. ‘కాంగ్రెస్‌ తనదారిన తను వెళ్లవచ్చు. మా దారిన మేము వెళతాము’ అని స్పష్టం చేశారు. అయితే తమిళనాడులో డీఎంకేకు ఒక ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ పార్టీ ఉండటం విశేషం. మమతా బెనర్జీ ఫోన్‌ చేసిన తర్వాత కేసీఆర్‌ ఆదివారం మాట్లాడుతూ తాను త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేను కలవనున్నట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా వేర్వేరు రాజకీయ పార్టీలను ఐక్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా టీఎంసీ అధినేత్రి ఉన్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు మీరు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించినపుడు కేసీఆర్‌ మాట్లాడుతూ ‘మమతా సోదరి(మమతా బెనర్జీ) నాకు ఫోన్‌ చేసింది. ఫోన్‌లో ఒక చర్చ జరిపాం. ఆమె నన్ను బెంగాల్‌కు ఆహ్వానించింది లేదా తానే హైదరాబాద్‌కు వస్తానని తెలిపింది. ఆమెకు స్వాగతం చెప్పాను. ఆమె ఎప్పుడైనా రావచ్చు. మేము చర్చిస్తాం. దేశవ్యాప్తంగా అనేక మందు రాజకీయ నాయకులు ఉన్నారు’ అని అన్నారు. కాగా తమతమ రాష్ట్రాల గవర్నర్ల చర్యలపై ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేసిన బెనర్జీ, స్టాలిన్‌లు ఆదివారం కూడా మాట్లాడుకున్నారు. ‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాల గవర్నర్‌లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, రాజ్యాంగ ఉల్లంఘనపై మమతా బెనర్జీ టెలిఫోన్‌ సంభాషణలో తనను ఆందోళనను, ఆవేదనను పంచుకున్నారు’ అని ఫోన్‌ సంభాషణ తర్వాత స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. ‘ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుకు ఆమె సూచించారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని నిలబెట్టేందుకు డీఎంకే కట్టుబడి ఉంటుందని నేను ఆమెకు హామీ ఇచ్చాను. సీఎంల సమావేశం త్వరలో జరగవచ్చు’ అని అన్నారు. సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పీ) తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు గతవారం ఉత్తర ప్రదేశ్‌ను సందర్శించిన బెనర్జీ, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేయకూడదని టీఎంసీ నిర్ణయం తీసుకుందని అన్నారు. ‘అఖిలేష్‌ యాదవ్‌(ఎస్‌పీ అధ్యక్షుడు) ఏ స్థానంలోనూ బలహీనపడకూడదని యూపీ ఎన్నికల్లో ఎవరినీ నిలబెట్టకూడదని టీఎంసీ నిర్ణయించింది. మొదటి దశ ఎన్నికల్లో 57 సీట్లకుగాను 37 స్థానాల్లో అఖిలేశ్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. సమాజ్‌వాది పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఒక ర్యాలీ కోసం మార్చి 3న యూపీలో మరోసారి పర్యటిస్తానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి తెలిపారు. యూపీని(బీజేపీకి వ్యతిరేకంగా) రక్షిస్తే, దేశాన్ని రక్షించినట్లవుతుంది. 2024లో నరేంద్ర మోదీని ఓడిరచాలని మనం కోరుకుంటున్నట్లయితే యూపీ, బెంగాల్‌ వంటి పెద్ద రాష్ట్రాలు ప్రధానం’ అని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img