Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

నిషేధాజ్ఞలు

ఎవరినీ అనుమతించని యోగీ సర్కారు
అడుగడుగునా ఆటంకాలు బ అరెస్టులు, గృహనిర్బంధం
మంత్రి తనయుడిపై కేసు బ కాన్వాయ్‌లో లేమంటున్న మంత్రి మిశ్రా
మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం

లఖింపూర్‌ ఖేరి/లక్నో : అన్నదాతల ఆందోళనతో యుద్ధభూమిగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్రానికి చెందిన నాయకులు, రైతులు, ఆందోళనకారులు, సామాజిక ఉద్యమనేతలను ఆ జిల్లాకు రాకుండా ఆంక్షలు విధించారు. దీనితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏ రాజకీయ నాయ కులు, రైతు సంఘాల నాయకులనూ యూపీలోని అనుమతించడం లేదు. మరోవైపు, తన కాన్వాయ్‌తో ఢీకొట్టి నలుగురు రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడుతో పాటు కొంత మందిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. రైతులను మద్దతు తెలపడానికి, మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రతిపక్ష నేతలకు అవకాశం లేకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. గృహనిర్బంధాలకు పాల్పడ్డారు. నిన్నటి నుంచి ఏ ఒక్కరినీ అఖింపూర్‌ ఖేరి జల్లాకు రావడానికి అనుమతించలేదు. నిన్నటి హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు, మంత్రి కాన్వాయ్‌లో వచ్చిన నలుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీలో రైతులపై జరిగిన ఈ దారుణం యోగి ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మంత్రి కాన్వాయ్‌ ఢీకొని మరణించిన రైతుల కుటుంబాలకు యోగి ప్రభుత్వం రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి రూ.10 లక్షల వంతున పరిహారం అందజేయనున్నట్లు హోంశాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ అశ్వనీ కుమార్‌ అవస్థి చెప్పారు. లఖింపూర్‌ హింసపై రిటైర్డు హైకోర్టు జడ్జితో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిరచాయి. బీజేపీ ప్రభుత్వంపై తుపాకులు ఎక్కుపెట్టాయి. జిల్లా ప్రధాన కార్యాలయానికి 80 కిలోమీటర్లు, రాజధాని లక్నోకు 225 కిలోమీటర్ల దూరంలో గల లఖింపూర్‌ ఖేరి జిల్లాకు ఎవరినీ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, ఎస్‌పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌, బీఎస్‌పీ నేత ఎస్‌సీ మిశ్రా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ వంటి అనేకమంది నేతలను అరెస్టు చేశారు. జిల్లాలోకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా సహా చాలామందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అవస్థి లక్నోలో పీటీఐకి చెప్పారు. శాంతిభద్రతల అదనపు డీజీ ప్రశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ ఇద్దరి వైపుల నుంచి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఇంటర్నెట్‌ పనిచేయడం లేదని, అందువల్ల అక్కడ ఏమి జరిగిందో ఇంకా పూర్తిగా తెలియలేదని ఆయన చెప్పారు.
రాష్ట్రపతికి ఎస్‌కేఎం లేఖ
నలుగురు రైతులను దారుణంగా తన కాన్వాయ్‌తో గుద్ది హత్య చేసిన కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను తక్షణమే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) విజ్ఞప్తి చేసింది. మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ ద్వారా విచారణ జరపించాలని డిమాండు చేసింది. రైతు జగ్జీత్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు ఆశిష్‌ మిశ్రా, కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు లఖింపూర్‌ ఖేరి నుంచి సమాచారం అందింది. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తుండగా ఈ విషాదఘటన చోటుచేసుకుంది. రైతుల మృతి అనంతరం ఆగ్రహంతో ఆందోళనకారులు సైతం రెండు వాహనాలను దహనం చేశారు. పోలీసులు, ప్రభుత్వ అధికారుల కళ్లుగప్పి సోమవారం ఉదయానికే బీకేయూ నాయకుడు రాకేశ్‌ తికైత్‌ లఖింపూర్‌ ఖేరి చేరుకున్నారు. మంత్రి అజయ్‌ మిశ్రాకు ఉద్వాసన పలకాలని, మరణించిన రైతు కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేస్తూ జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కారమైతేనే రైతుల అంతిమ సంస్కారం జరుపుతామని తికైత్‌ స్పష్టంచేశారు.

మంత్రి కొడుకు కాల్పులు
మంత్రి కొడుకు కారుతో గుద్దించడమే కాకుండా రైతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని అన్నదాతలు ఆరోపించారు. మరోవైపు, ఘటనాస్థలిలో తాను, తన కుమారుడు లేనేలేమని మంత్రి అజయ్‌ మిశ్రా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియో సాక్ష్యాలను పత్రికలకు విడుదల చేశారు. హింసాత్మక ఘటన చోటుచేసుకున్న తికోనియాకు జర్నలిస్టులు సహా ఎవరినీ రానివ్వడం లేదు. జిల్లా ప్రవేశ మార్గాలన్నింటా పోలీసులను భారీగా మోహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img