Friday, May 31, 2024
Friday, May 31, 2024

నీటి పారుదల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో
15 శాతం నిథులు కేటాయించాలి

. పోలవరం బాధ్యత కేంద్రానిదే
. దిల్లీకి అఖిలపక్షాన్ని రాష్ట్రమే తీసుకువెళ్లాలి
. సజ్జలకు సీపీఐ నేతలు జల్లి విల్సన్‌, ఓబులేసు వినతి
. ప్రాజెక్టుల స్థితిగతులపై పార్టీ బృందం పర్యటన వివరాల వెల్లడి
. సీఎం, మంత్రుల దృష్టికి తీసుకువెళతానని ‘సజ్జల’ హామీ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాష్ట్ర ప్రభుత్వం 202324 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు 15 శాతం నిధులు కేటాయించి, పూర్తిగా ఖర్చు చేయాలని, పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున నిర్మాణ బాధ్యత, నిర్వాసితుల పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రమే వహించాలని, అందుకోసం దిల్లీకి అఖిలపక్ష బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకోవడానికి సీపీఐ రాష్ట్ర నాయకత్వ బృందం ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు చేసిన పర్యటనలో దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరింది. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ తరపున మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్‌, జి.ఓబులేసు ఆ మేరకు వివరాలను అందజేసి వాటిపై సమగ్రంగా చర్చించారు. సీపీఐ రాష్ట్ర నాయకత్వం 9 రోజుల పాటు ఈ మొత్తం ప్రాజెక్టులను పరిశీలించి వచ్చిన తర్వాత మార్చి 5న రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిందని, అందులో ఏకగ్రీవంగా ఆమోదించిందని తీర్మానాలను సజ్జలకు జల్లి విల్సన్‌, ఓబులేసు వివరించారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ… రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ వద్దకూ ఈ సమస్యలను తీసుకువెళతానని సజ్జల హామీ ఇచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా ప్రతిపాదిత ఎత్తుతో నిర్మించాలని, నిర్వాసితులకు పరిహారాన్ని ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రకారం చెల్లించాలని సీపీఐ నేతలు కోరగా, దానిపైనా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే దీని నిర్మాణ బాధ్యత చేపట్టాలని, నిర్వాసితుల పరిహారం సవరించిన అంచనా ప్రకారం చేయాలని, అందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువెళ్లి చర్చించాలని సజ్జలకు విజ్ఞప్తి చేశారు. ఎగువ భద్ర నిర్మాణం వల్ల టీబీ డ్యామ్‌ ద్వారా హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్‌కు జరిగే నష్టాన్ని నివారించడానికి కేంద్రం వద్ద సమర్థవంతమైన వాదనలు వినిపించి, దాన్ని ఆపు చేయించాలన్నారు. గాలేరునగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల క్రింద ఉన్న రిజర్వాయర్ల అసంపూర్తి పనులు ఈ ఏడాదిలో పూర్తి చేసి కరువు ప్రాంతాలను ఆదుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి చేకూర్చే గుండ్రేవుల, వేదవతి, రాజోలి, సిద్దేశ్వరం, అలుగు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని, వంశధార, నాగావళి నదులపై ఉన్న రిజర్వాయర్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని కోరారు. ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌1, ఫేజ్‌2 లో ఉత్పన్నమైన అనేక భూ సేకరణ సమస్యలను పరిష్కరించి కాలువల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ తీర్మానాలను కాలబద్దంగా పూర్తి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సజ్జలకు జల్లి విల్సన్‌, ఓబులేసు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img