Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రాణాంతకంగా ఫ్లూ

. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజాతో దేశంలో ఇద్దరి మృతి
. కర్ణాటక, హరియాణాలో ఒక్కో మరణం నమోదు
. నెలాఖరుకు ఇన్ఫెక్షన్‌ కేసులు తగ్గే అంచనా

న్యూదిల్లీ : ఇప్పుడిప్పుడే కోవిడ్‌ మహమ్మారికి ముందున్న పరిస్థితులు నెలకొంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా పంజా విరుసుతోంది. దీంతో దేశంలో ఇన్ఫెక్షన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజా ఇద్దరు ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. హెచ్‌3ఎన్‌2 వల్ల కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో మరణం నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడిరచింది. పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపింది. నెలాఖరుకు ఇన్ఫెక్షన్‌ కేసులు తగ్గుతాయని అంచనా వేసింది. ‘హెచ్‌3ఎన్‌2 సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా. చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వృద్ధులకు ఇది త్వరగా సోకుతుంది. ఇప్పటివరకు కర్ణాటకలో, హరియాణాలో ఒక్కొక్కరు ఈ ఇన్‌ఫ్లుయెంజా బారినపడి చనిపోయారు. దీంతో దేశంలో తొలి రెండు మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రతిఏటా సీజనల్‌ ఇన్‌ఫ్లుయోంజా రెండు దశల్లో విజృంభిస్తుంటుంది. జనవరి నుంచి మార్చి వరకు ఆపై వర్షాకాలం తర్వాత కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర సర్వైలైన్స్‌ అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. రియల్‌ టైమ్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ డీజీస్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎస్‌పీ) నెట్వర్క్‌తో రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయోంజా కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని ఆరోగ్యశాఖ ప్రకటన పేర్కొంది.
ఈనెల ఒకటో తేదీన కర్ణాటకలో 82 ఏళ్ల హైరె గౌడ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా చనిపోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. హరియాణాలోని జింద్‌ జిల్లాకు చెందిన 56ఏళ్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితుడికి జనవరిలో హెచ్‌3ఎన్‌2 పాజిటివ్‌గా తేలగా ఆయన ఫిబ్రవరి 8న ఇంట్లో మృతి చెందారు. ఐడీఎస్‌పీఐహెచ్‌ఐపీ (సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక) తాజా డేటా ప్రకారం 3,038 ఇన్‌ఫ్లుయోంజా కేసులు దేశంలో ఉన్నాయి. ఇందులో 1,245 కేసులు జనవరిలో, 1,307 ఫిబ్రవరిలో, 486 కేసులు మార్చి 9వతేదీ నాటికి నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. జనవరిలో 3,97,814 కేసులు తీవ్ర శ్వాసకోస సమస్యలు లేక ఇన్‌ఫ్లుయోంజా (ఏఆర్‌ఐ/ఐఎల్‌ఐ) నమోదు కాగా ఫిబ్రవరిలో వీటి సంఖ్య 4,36,523కి పెరిగింది. మార్చిలో సంఖ్య 1,33,412కు చేరింది. తీవ్రమైన దీర్ఘకాల శ్వాససంబంధిత వ్యాధి (ఎస్‌ఏఆర్‌ఐ) కేసులు జనవరిలో 7,041గా ఉంటే ఫిబ్రవరిలో 6,919, మార్చి 9కి 1,866 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు 955 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికంగా 545 కేసులు తమిళనాడులో నమోదు కాగా మహారాష్ట్రలో 170, గుజరాత్‌లో 74, కేరళలో 42, పంజాబ్‌లో 28 చొప్పున నమోదయ్యాయి. ఇదిలావుంటే, ఇతర ఇన్‌ఫ్లుయెంజాలతో పోల్చితే హెచ్‌3ఎన్‌2 వల్లే దేశంలో జర్వం కేసులు ఎక్కువైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఇన్‌ఫ్లుయెంజా ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇన్‌ఫ్లుయెంజా బారిన పడకుండా ఉండొచ్చని సూచించారు. ఇన్‌ఫ్లుయెంజా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, తుంపరలున్న ప్రదేశాన్ని తాకి తమ ముక్కు, నోటిని చేతిలో ముట్టుకున్నా హెచ్‌3ఎన్‌్‌2 సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇన్‌ఫ్లుయోంజా సోకితే 35 రోజుల వరకు జ్వరం, మూడు నుంచి ఐదు వారాల వరకు దగ్గు ఉంటుందని, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలతో పాటు కొందరికి శ్వాసక్రియలో ఇబ్బంది రావచ్చన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్‌ఫ్లుయోంజా బారిన పడకుండా ఉండవచ్చునని నిపుణులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img