Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉద్యోగుల నిరసన గళం

. నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలు
. 26 జిల్లాల్లో ప్రదర్శనలు
. సీఎస్‌కు ఏపీ జేఏసీ అమరావతి సవరించిన నోటీసు
. అవసరమైతే ఉద్యమం తీవ్రతరం : బొప్పరాజు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉద్యోగుల నిరసనలు వెల్లువెత్తాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. ఉద్యోగుల డిమాండ్ల సాధనపై ప్రభుత్వం దిగిరానందున, మొక్కుబడిగా చర్యలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఈనెల 9 నుంచి సవరించిన ఉద్యమ కార్యాచరణ షెడ్యూలును ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. దశల వారీగా ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల వారీగా ఉద్యోగులంతా ఉద్యమంలో నిమగ్నమయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీ పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాల వద్ద ఏపీ జేఏసీ అమరావతి అధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వ మాటలను ఉద్యోగులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఉద్యమ కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 20 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. అవసరమైతే కార్యాచరణను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయ వద్ద ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి అధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన చేపట్టగా, వారికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, నేతలు పీవీ మురళీకృష్ణ, గిరికుమార్‌, ఎన్‌.శ్రీనివాస్‌ తదితరులు అక్కడికి వచ్చి సంఫీుభావం తెలిపారు. ఉద్యోగులు ఒక్కసారిగా ఉద్యమబాట పట్టడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. మొదటి నుంచి జగన్‌ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోంది. వారు పని చేసిన కాలానికి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు రావడం గగనంగా మారింది. దాచుకున్న డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దాట వేస్తోంది. పీఎఫ్‌ రుణాలు, పీఆర్సీ తదితర ఆర్థికపరమైన ప్రయోజనాలపై సాచివేత ధోరణి అవలంభిస్తోంది. ఈ సమస్యలపై పదేపదే ప్రభుత్వానికి, మంత్రుల కమిటీకి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన తీసుకెళ్లినా స్పందన లేదు. తుదకు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మంత్రుల కమిటీ సమావేశ ప్రతుల్లోనూ ప్రభుత్వం నుంచి వారి హామీలపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు దశల వారీగా ఉద్యమబాట పట్టారు.
సీఎస్‌ను కలిసిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడితో దశలవారి ఆందోళనల సవరించిన షెడ్యూలును శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి ఏపీ జేఏసీ అందజేసింది. విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు అధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఏళ్లుగా ప్రభుత్వం స్పందించకుండా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందన్నారు. రెండేళ్లుగా వాడుకున్న ఉద్యోగుల డబ్బులు చెల్లించకపోవడం, ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలు, లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్లు, మెడికల్‌ రీయింబర్స్‌ మెంటు బిల్లులు, డీఏ బకాయిలు, కొత్తగా ఇవ్వాల్సిన డీఏ తదితర ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం నోచుకోనందున ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వాటితో పాటు ప్రభుత్వమే హామీ ఇచ్చిన సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపుదల తదితర ఆర్థికేతర అంశాలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో ఉద్యమ కార్యాచరణకు దిగినట్లు వివరించారు. ఈనెల 9 నుంచి ఏప్రిల్‌-5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, 17, 20 తేదీల్లో (రెండు రోజులు) ఉద్యమానికి మద్దతు కోరుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల సందర్శన, 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉద్యోగులు వర్కు టూ రూల్‌, 27న కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇళ్ల సందర్శన తదితర ఆందోళన కార్యక్రమాల షెడ్యూలు నోటీసును సీఎస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి వీవీ మురళీకృష్ణ నాయుడు, బి.కిషోర్‌ కుమార్‌, వి.అర్లయ్య, ఎ.సాంబశివరావు, ఎస్‌.మల్లీశ్వరరావు, బి.జగదీష్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img